సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు మరియు యు.పి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లపై జరుగుతున్న అక్రమ ఆస్తుల కేసు విచారణ మూసివేత దిశలో ప్రయాణిస్తున్నదని పత్రికలు ఘోషిస్తున్నాయి. అదే సమయంలో ములాయం పార్టీ యు.పి.ఎ కూటమిలోకి ప్రయాణం చేస్తున్నదని కార్టూన్ సూచిస్తోంది. ఈ రెండు పరిణామాలకు ఎంత గాఢమైన అనుబంధం ఉన్నదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఒక వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మేరకు ములాయం, అఖిలేష్ లు 1993-2005 మధ్యలో సంపాదించిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలని సుప్రీం కోర్టు 2007లో సి.బి.ఐని ఆదేశించింది. అప్పటి నుండి సి.బి.ఐని తన స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ములాయం సింగ్ కాంగ్రెస్ ను తిట్టని సందర్భం అంటూ లేదు. అయినప్పటికీ యు.పి.ఎ ను అనేకసార్లు కష్ట సమయాల్లో గట్టెక్కించడం ఆయన మానుకోలేదు. ఇప్పుడు యు.పి.ఎ ప్రభుత్వం వాస్తవానికి మైనార్టీ ప్రభుత్వం. ఐనా విజయవంతంగా కొనసాగుతున్నదంటే దానికి కారణం ములాయం, మాయావతిలు సి.బి.ఐ విచారణ భయంతో ఆ కూటమికి ఇస్తున్న మద్దతే అన్నది బహిరంగ రహస్యం.
ములాయం సింగ్ చేస్తున్న మద్దతు యజ్ఞం ఎట్టకేలకు సఫలీకృతం చెంది కేసుల నుండి విముక్తి లభించనున్నదని సోమవారం ది హిందూ పత్రిక ఒక కధనం ప్రచురించింది. దీని ప్రకారం కేసును మూసివేయడానికి తగిన ఏర్పాట్లను సి.బి.ఐ చేస్తోంది. వారు అక్రమాస్తులు సంపాదించారని చెప్పడానికి తగిన సాక్షాధారాలు ఏమీ సి.బి.ఐ కి దొరకలేదు. ఆస్తుల పెరుగుదల అంటూ ఏమన్నా జరిగితే అది ప్రధానంగా బంధువుల నుండి తీసుకున్న అప్పుల వల్లనే తప్ప అక్రమ సంపాదన వల్ల కాదని సి.బి.ఐ ప్రాధమిక విచారణలో తేళ్ళిపోయింది. అంటే ఐదేళ్ల నుండి ప్రాధమిక విచారణలోనే సి.బి.ఐ గడిపిందన్నమాట!
విచారణాధికారులు విచారణ పూర్తి చేసి నివేదికను సీనియర్ అధికారులకు సమర్పించారనీ, వారు తదుపరి నిర్ణయం తీసుకోవలసి ఉన్నదనీ పత్రిక తెలిపింది. కేసును మూసివేయడమా లేక తదుపరి విచారణ కొనసాగించడమా అన్నది నివేదికను చూసి సీనియర్ అధికారులు నిర్ణయిస్తారని తెలుస్తోంది. పైకి మాత్రం విచారణ ఇంకా కొనసాగుతోందని సి.బి.ఐ చెబుతోంది.
మరింత విచారణ కోసం అవసరమైన కోణాలను విచారణాధికారులు కనిపెట్టి మరింత విచారణకు నిర్ణయం తీసుకున్నప్పుడల్లా సదరు నిర్ణయాలను సీనియర్ అధికారులు అడ్డుకున్నారని తెలుస్తోంది. అంటే ములాయం, అఖిలేష్ ల నిర్దోషిత్వాన్ని నిరూపించడానికే సి.బి.ఐ కంకణం కట్టుకున్నదన్నమాట. సి.బి.ఐ ని సరైన దిశలో నడిపినందుకు ప్రతిఫలంగా కాంగ్రెస్ పార్టీ, వచ్చే ఎన్నికల్లో ఎస్.పి నుండి తగిన రాజకీయ తోడ్పాటు పొందవచ్చు.
ఈ ప్రభుత్వాల నాయకులు సాగిస్తున్నది పరిపాలన కాదు, సంపాదన; వారివి రాజకీయాలు కాదు అరాచకీయ కీచకాలు; వారి మధ్య జరిగేది రాజకీయ ఘర్షణలు కాదు, స్వార్ధపర కుమ్మక్కులు. సి.బి.ఐ, కోర్టులు, ప్రభుత్వాలు అందుకు సాధనాలు మాత్రమే.

సి.బి.ఐ ను కాంగ్రెస్ వాడుకుంటోందని మనకు తెలుసు.మరి యన్.డి.ఎ అధికారంలో ఉన్నప్పుడు వాజ్ పాయ్ గారి నేతృత్వంలో వారేమివెల్లబుచ్చారు? మరి బి.జె.పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా ఈ విషయాన్ని గట్టిగా ప్రశ్నించవచ్చుకదా!(జగన్ విషయంలో అడిగినట్టు) పైపెచ్చు అద్వాని గారు ములాయం ను సందర్భానుసారం కీర్తిస్తుంటారు! ఇదేమి వైచిత్రమోమరి! అంటే ఎస్.పి మద్ధతు వారికీ అవసరమనేగా! నీచరాజకీయాలు విలువలు,వ్యక్తిత్వం వంటివి ఏమైనా వాటికి ఉన్నాయా? ప్రజాస్వామ్యమంటే ఈ పార్టీలదేనా?
అందరూ చెత్త ……… (edited)
ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయి