మోడీకి వీసా ఇవ్వొద్దు, అమెరికాకు 65 ఎం.పిల లేఖలు


Narendra Modi

నరేంద్ర మోడిపై అమెరికా విధించిన వీసా నిషేధాన్ని ఎత్తివేయించడానికి బి.జె.పి అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ ఒక పక్క ప్రయత్నాలు చేస్తుండగానే మరో పక్క ఆయనకు వీసా ఇవ్వొద్దంటూ 65 మంది భారత ఎం.పిలు అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాకు లేఖలు రాశారు. అమెరికా మోడి పట్ల ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్నే కొనసాగించాలని వారు తమ లేఖల్లో కోరారు. లేఖలు రాసిన ఎం.పిల్లో 12 రాజకీయ పార్టీలకు చెందినవారు ఉన్నారని ది హిందు తెలిపింది.

వాస్తవానికి ఈ లేఖలు గత సంవత్సరం నవంబరు, డిసెంబరు నెలల్లో రాసినట్లు తెలుస్తోంది. రాజ్ నాధ్ సింగ్ అమెరికా చేరుకుని మోడిపై వీసా నిషేధం ఎత్తివేయించడానికి లాబీయింగ్ జరుపుతున్న నేపధ్యంలో సదరు ఎం.పిలు మరొకసారి అవే లేఖలను మళ్ళీ ఫాక్స్ చేశారు. రాజ్య సభ సభ్యులు 25 మంది కలిసి ఒక లేఖ, లోక్ సభ సభ్యులు 40 మంది కలిసి మరొక లేఖ గత నవంబర్ 26, డిసెంబర్ 5 తేదీల్లో అమెరికా అధ్యక్షుడికి పంపించారు. అయితే ఆ సంగతి పత్రికలకు చెప్పలేదు. పత్రికలకు చెప్పడం ఇదే మొదటిసారి.

“మోడీకి అమెరికా వీసా నిరాకరిస్తున్న ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలని మేము గౌరవపూర్వకంగా కోరుతున్నాము” అని రెండు లేఖల్లో ఎం.పిలు పేర్కొన్నారని పత్రిక తెలిపింది. ఈ రెండు లేఖలు ఒకే తరహాలో ఉన్నాయని తెలుస్తోంది.

‘ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్’ సంస్ధ లేఖ కాపీలను పత్రికలకు అందజేసింది. రాజ్య సభలో స్వతంత్ర సభ్యుడు మహమ్మద్ అదీబ్ చొరవతో పార్లమెంటు సభ్యులు ఈ అసాధారణ చర్యకు పూనుకున్నారు. రాజ్ నాధ్ సింగ్ మోడి వీసాకు అనుకూలంగా లాబీయింగ్ ప్రారంభించిన నేపధ్యంలోనే మళ్ళీ ఒకసారి లేఖలను ఫాక్స్ చేశామని మహమ్మద్ అదీబ్ తెలిపారు.

బి.జె.పి అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ తాను మోడిపై విధించిన వీసా నిషేధం ఎత్తివేయడానికి కృషి చేయనున్నట్లు ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన మంగళవారం వాషింగ్టన్ చేరుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా చట్ట సభల (హౌస్, సెనేట్) సభ్యులు, లాబీయింగ్ సంస్ధలు (think-tanks), అమెరికా ప్రభుత్వ అధికారులు తదితరులను కలుసుకోనున్నారని పత్రికలు తెలిపాయి.

ఒబామాకు రాసిన లేఖలపై సంతకం చేసినవారిలో సి.పి.ఎం సభ్యుడు సీతారాం యేచూరి, సి.పి.ఐ సభ్యుడు ఎం.పి.అచ్యుతన్ లు కూడా ఉన్నారని హిందు తెలిపింది. ఐ.బి.ఎన్ లైవ్ ప్రకారం ఎం.పిల చర్యను ఎన్.సి.పి పార్టీ స్వాగతించింది. “ఈ లేఖ మంచి అడుగు. 2002 దాడుల వలన అమెరికా మోడీకి ఒకసారి వీసా నిరాకరించింది. అదే పద్ధతిలో మోడీ వీసా కోసం అమెరికా ముందు మోకరిల్లుతున్నారు. చేవ గలిగిన ఎం.పిలు ఈ విజ్ఞప్తిని వ్యతిరేకించాలి. ఈ వ్యక్తి అమెరికాలో ప్రవేశించకుండా ఉండేలా ఆ దేశంపై ఒత్తిడి తేవాలి’ అని ఎన్.సి.పి ప్రతినిధి తారిక్ అన్వర్ అన్నారని ఐ.బి.ఎన్ తెలిపింది.

నేను రాయలేదు

అయితే తాను లేఖపై సంతకం చేయలేదని సీతారాం యేచూరి చెబుతున్నారు. తన పేరు ఉండడం పట్ల ఆయన ఆశ్చర్యం ప్రకటించారని ఐ.బి.ఎన్ లైవ్ తెలిపింది. అసలు అమెరికాకు తాను రాయడమేంటని ఆయన ప్రశ్నించారు. ఇదేదో కట్ అండ్ పేస్ట్ వ్యవహారం లాగా ఉందన్నారు. “అమెరికా ప్రభుత్వానికి రాసేవారిలో నేను చివరే ఉంటాను. ఇలాంటివి నేను చేయను. దేశం యొక్క అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి మేము ఎవరినీ అంగీకరించము. ఇలాంటి అంశాలను ఇండియాలోనే రాజకీయంగా పరిష్కరించుకోవాల్సినవి” అని యేచూరి స్పష్టం చేశారు. కానీ యేచూరి నిరాకరణ పట్ల మహమ్మద్ అదీబ్ కూడా ఆశ్చర్యం ప్రకటించారు. యేచూరి, అచ్యుతన్ లు లేఖలపై సంతకం చేసిన మాట నిజం అని ఆయన బల్లగుద్ది చెబుతున్నారు. 

లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి:

“మోడి పాలనా వ్యవస్ధలోని అనేకమంది సీనియర్ అధికారులతో సహా అనేకమంది నేరస్ధులకు వ్యతిరేకంగా కేసులు కోర్టులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఈ పరిస్ధితిలో నిషేధాన్ని ఎత్తివేస్తే 2002 నాటి భయానక హత్యాకాండలో మోడి పాత్రను నిరాకరించినట్లే అవుతుంది.”

“అది (నిషేధం ఎత్తివేత) మోడి యొక్క మానవ హక్కుల ఉల్లంఘనలను న్యాయబద్ధం చేస్తుంది. అమెరికా-ఇండియా సంబంధాల స్వభావాన్ని కూడా తీవ్రంగా మార్చివేస్తుంది. సార్వత్రిక విలువలయిన మానవహక్కులు, న్యాయంల కంటే అమెరికాకు తన ఆర్ధిక ప్రయోజనాలే మిన్న అన్న సందేశం ఇచ్చినట్లవుతుంది.”

నిజానికి అమెరికాకు ఇప్పుడే కాదు ఎప్పుడూ తన ఆర్ధిక ప్రయోజనాలే ఎక్కువ. అందుకోసం అది అత్యంత హీనమైన హత్యాకాండలను, అత్యాచారాలను, బెదిరింపులను, గూఢచర్యాలనూ, హక్కుల ఉల్లంఘనలను సాగిస్తోంది. అటువంటి అమెరికా విలువలు పాటిస్తున్నట్లు నమ్ముతున్నట్లుగా లేఖలోని అంశాలు తెలియజేస్తున్నాయి. ఈ కారణం వల్లనే యేచూరి లేఖ నుండి దూరం జరగడానికి ప్రయత్నిస్తున్నారని భావించవచ్చు. లేఖ సంతకందారుల్లో యేచూరి, అచ్యుతన్ లు ఉన్నట్లయితే వారు తమ రాజకీయ అవగాహనకు భిన్నంగా లేఖలో వ్యక్తం చేసినట్లే అర్ధం.

జనతాదళ్ (యు), కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎం.ఐ.ఎం, వి.సి.కె (తమిళనాడు), డి.ఎం.కె మొదలయిన పార్టీలకు చెందిన సభ్యులు లేఖలపై సంతకాలు చేశారని ఐ.బి.ఎన్ తెలిపింది.

5 thoughts on “మోడీకి వీసా ఇవ్వొద్దు, అమెరికాకు 65 ఎం.పిల లేఖలు

  1. modi హస్తం నిజంగా ఉంటే , కాంగ్రెస్ , లెఫ్ట్ పార్టీ లు 1000 కోట్లు కర్చు పెట్టి అయినా , చట్టం లో ఉన్న లొసుగులు అన్ని ఉపయోగించి జైలు లో వేయించే వారు. అక్కడే అర్ధం అవుతుంది మోడీ హస్తం లేదని!!!! ఇంక ఈ ముస్లిం నాయకులు ఎవరు ఎక్కువగా మోడీ ని బండ భూతులు తిట్టి , ముస్లిం వోట్ బ్యాంకు ని తమ వైపు లాక్కోవాలనే గాని , ముస్లిం లలో ఎడ్యుకేషన్ , ఉమెన్ ఎంప్లాయిమెంట్&ఎడ్యుకేషన్ యంత వుంది ఇలాంటివి పట్టవు,

    ఎవడు మోడీ ని బాగా తిడితే , వాడు సెకులర్ లేకుంటే communal, అల వుంది ఆ 60 mp la వ్యవహారం

  2. సిగ్గుచేటు ఈదేశ యం.పి.లు వేరేదేశానికి వీసామంజూరు చేయొద్దని మొరపెట్టుకోవడం ఏమిటి? వెల్లివాళ్ళకాళ్ళు పట్టుకోండి!సరిపోతుంది.

  3. america ki modi velthe ee mp la ku em problemo ardham kavadam ledu..america ki ravala vadda anedi america decide chestundi..evado edo cheppadu ani vallla decision marchukoru…mp lu prajalakau avasaram ayye panulu cheste manchidi…epudu budhi vastundo emito..

  4. ఒక వ్యక్తి మన ఇంటికి వస్తున్నాడు అంటే, మన ఇంట్లొ వాతావరణం లొ ఎదో ఒక మార్పు వస్తుంది, మంచి లేక చెడు ఎదో ఒకటి.

    అతనిని రావద్దు అంటున్నాం అంటే అతనివల్ల ఆ వాతావరణం పాడవుతుంది లేక అక్కడ ఉండె వాతావరణం వల్ల ఆ వ్యక్తి పాడవ్వచ్చు …. అని అర్ధం

    ఇక్కద మిగిలిన MP lu వద్దంటున్నారు అంటె మనం వదిలెయచ్చు .. కాని ఎర్ర పార్టీ ల వాళ్ళు వద్దంటున్నారు అంటె.

    ” గొప్పదైన అమెరికా మోడీ వల్ల పాడవుతుంది అనుకొవాలా లెక…..
    గొప్ప వాడైన మోడీ అమెరికా వల్ల పాడవుతాడ… ”
    అమెరికా ని ఎప్పుడు విమర్సించె ఎర్ర పార్టీ ల వాళ్ళకి మోడీ అక్కది కి వెళ్తె ఎంటి వెళ్ళక పోతె ఎంటి….

వ్యాఖ్యానించండి