బీహార్, శరణ్ జిల్లాలో కనీసం 22 మంది బడి పిల్లలకు ప్రాణాంతక పరిణామాలను రుచి చూపించిన రోజువారీ మధ్యాహ్న భోజనం భారత దేశంలోని విస్తార భాగాల్లో పాఠశాల విద్య ఎంతటి తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నదో వెల్లడి చేస్తోంది. ప్రభుత్వాలు ఒక పాఠశాల నిర్మాణానికి కాసింత చోటు చూపించలేకపోవడం, ఆహార పదార్ధాలు కలుషితం అయ్యే ప్రమాదానికి లోనుకాకుండా నిలవ చేయలేకపోవడం… ఈ అంశాలు సార్వత్రిక ప్రాధమిక విద్య పట్ల ప్రభుత్వాల నిబద్ధత ఏపాటిదో పట్టిస్తున్నాయి. మౌలిక సౌకర్యాలకు సంబంధించి, ఒక కొత్త పాఠశాలకు కూడా, బలీయమైన ప్రమాణాలు లోపించాయని బీహార్ ఘోరం స్పష్టంగా ఎత్తి చూపుతోంది.
మధ్యాహ్న భోజన పధకాన్ని రాష్ట్రాలు శక్తివంతం చేయడం కోసం ప్రజలు చెల్లిస్తున్న పన్నులపై కేంద్ర ప్రభుత్వం సెస్ కూడా వసూలు చేస్తున్నదన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇటువంటి అసమర్ధత, ఉదాసీనత తీవ్ర గర్హనీయమైనవి. కేంద్రం ఈ సెస్ లో కొంత భాగాన్ని మధ్యాహ్న భోజన పధకం కోసమే కేటాయిస్తోంది. 2011-12 సంవత్సరంలో సెస్ కింద రూ. 27,461 కోట్లు వసూలవ్వడం గమనార్హం.
దుర్ఘటనకు కారణంగా కలుషిత ఆహారం మరియు పచ్చ భాస్వరం -దీనిని ఎరువులు, కీటక నాశనిలలో వినియోగిస్తారు- కలిసిన ఆహార పదార్ధాల వైపు వేలెత్తి చూపుతున్న ప్రాధమిక సాక్ష్యాధారాలు నిజమే అయితే అది కనీస ఆహార భద్రతా ప్రమాణాలను పాటించడంలో క్షమించరాని రీతిలో వైఫల్యం చెందినట్లే కాగలదు. భారత దేశంలోని మధ్యాహ్న భోజన పధకం 10.54 కోట్ల మంది పిల్లలను అండగా నిలుస్తూ ప్రపంచంలోనే అత్యంత భారీ పాఠశాల భోజన పధకంగా, దానికి తగినట్లుగానే, ప్రసిద్ధికెక్కింది. అలాంటి కీలకమైన సంక్షేమ పధకంలో చోటు చేసుకునే ఇటువంటి మానవ నిర్మిత విషాదాలు పౌరుల నమ్మకాన్ని పట్టి కుదిపేస్తాయన్న తెలివిడి ప్రతి ఒక్కరినీ బాధించే విషయం.
ప్రాధమిక-పూర్వ మరియు ప్రాధమిక తరగతుల విద్యార్ధులకు నిర్దిష్ట స్ధాయిల్లో కెలోరీలు మరియు ప్రోటీన్లు అందించడమే ఈ పధకం ముఖ్యమైన ఉద్దేశ్యం. కానీ మొత్తం కమ్యూనిటీయే ఇందులో పాల్గొనేలా చేయడం ద్వారా ఈ పధకం అంతకంటే ఎక్కువే సాధిస్తోంది. మహిళలకు ఉపాధి కల్పించడం, కులాలకు అతీతంగా విద్యార్ధులందరూ ఒకే చోట కూర్చొని భోజనం చేసేలా ప్రోతహించడం ద్వారా కులాల అడ్డుగోడలను కూల్చడం తదితర ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి.
అధికార నిర్వహణ సమర్ధవంతంగా ఉన్న రాష్ట్రాల్లో ఈ పధకంగా చాలా బాగా పని చేస్తుండగా, ఎన్.జి.ఓ ల భాగస్వామ్యంతో అమలు అవుతున్న చోట్ల కొన్నిసార్లు పూర్తిగా విఫలం అవుతున్న పరిస్ధితిని ఈ సందర్భంగా గమనించాల్సి ఉంది. గత సంవత్సరం ఢిల్లీలో ఎన్.జి.ఓ లు తయారు చేసిన భోజన నమూనాల్లో ఘోరంగా 95 శాతం వాటిలో నిర్దేశిత పౌష్టికాహార ప్రమాణాలు లేవని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. ఇక్కడ నేర్చుకోదగిన గుణపాఠం ఏమిటంటే విధాన నిర్ణేతల్లోనూ, బ్యూరోక్రసీలోనూ గట్టి నిబద్ధత ఉన్నట్లయితే బాధ్యతాయుతమైన ప్రభుత్వ వ్యవస్ధ ఇతర ఏర్పాట్ల కంటే సమర్ధవంతంగా పని చేస్తుందని. స్వస్త్రోత్రాలు వల్లించుకునే బీహార్ ప్రభుత్వం కూడా ప్రయాణించవలసిన దూరం ఇంకా చాలానే ఉందని స్పష్టం అవుతోంది.
ఇటువంటి ఘోరకలి పునరుద్భవించకుండా ఉండడానికి అవసరమైన వ్యవస్ధాగత మార్పులను పట్టించుకోవడం మాని, భారీ సంఖ్యలో పిల్లలు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకోవాలని చూస్తే అది రెండింతల విషాదమే కాగలదు. ఆర్ధిక వృద్ధి కోసం మౌలిక సౌకర్యాల కల్పన పట్ల గొప్ప దృష్టి ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు తరచుగా మాటలు చెబుతాయి. కానీ భవిష్యత్తు శ్రామిక శక్తిని తయారు చేసే పాఠశాల వ్యవస్ధ నుండే అది మొదలవుతుందని గ్రహించడంలో అవి విఫలం అవుతున్నాయి. పిల్లలకు కనీసం ఒక భద్రమైన భోజనాన్ని ఇవ్వలేనపుడు అలాంటి గొప్పలు అర్ధరహితం.

చాలా భాధగా వుంది. 22 మంది పిల్లలు చనిపోయారు . ఇది చూసాక భారతీయుడు సినిమాలో , బ్రేక్ ఇన్స్పెక్టర్ తప్పు దోవ తొక్కడం వాళ్ళ స్కూల్ బస్సు లో పిల్లలు బ్రేక్ ఫెయిల్ అయి చనిపోతారు , దానికి శిక్షగా కన్నకొడుకుని చంపేస్తాడు హీరో , ఆ బిట్ గుర్తోచింది . ఇది కేవలం వైఫల్యం , దగాకోరుతనం కి సాక్షం మాత్రమే . ఆ జిల్లా deo, food distributor, food inspector, collector , ఈ సంగంతన ప్రత్యక్షంగా పరోక్షంగా సంబందమున్న అందరికి పెద్ద మొత్తం లో శిక్ష పడాలి. వాస్తవంగా చుస్తే చిన్న అధికారిని మటుకు బలిపసువుని చేసి మిగత అందరు తప్పించుకుంటారు.
పాఠశాలకు నిర్వహనకు ఉండాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించక పొవడమే ఈ విషాదానికి అసలుకారణం
ఇలాంటి సంఘటనలు దేశంలోఎక్కడోచోట జరుగుతునే వున్నాయి. ఇది మొదలు కాదు చివరకాదు. ఈ పాలన సామాన్య ప్రజలకోసం కాదు, పాలకులకోసం. అందువలన షరా మామూలే అనుకోవటం,ఒక నిట్టూర్పువిడవటం
ఆహారం లో క్రిమిసంహారకాలు ఉన్నాయంట కూల్డ్రింక్ ల లో చూసా ఇప్పుడు మధ్యాహ్న భోజనం లో చూసా రేపు నీళ్ళలో కూడా చూస్తానేమో
పెస్టిసైడ్స్ ఎక్కడో వాడితే వేరే చోట ఫలితం కనిపించింది ఒకడి ఆనందం(avasaram ) వేరే వాడి ప్రాణం తీస్తుంది