ఇళవరసన్ ది ఆత్మహత్యే!


ilavarasan

ఇళవరసన్ ఆత్మహత్య చేసుకున్నారని దాదాపు నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. సంఘటనా స్ధలంలో ఆత్మహత్య లేక లాంటిదేదీ దొరకలేదని మొదట రైల్వే పోలీసులు చెప్పినప్పటికీ వాస్తవానికి ఆయన లేఖ రాసినట్లు ఆ తర్వాత తెలిసింది. ఇళవరసన్ తన ఆత్మహత్యకు కారణాలు తెలియజేస్తూ నాలుగు పేజీల లేఖ రాశారని, దానిని తన జీన్ ఫ్యాంట్ జేబులో ఉంచారని తెలుస్తోంది. కానీ రైల్వే పోలీసులు వచ్చే లోపలే ఆ లేఖను సమీప బంధువులు తీసుకోవడంతో లేఖ రాయలేదని పోలీసులు పత్రికలకు తెలిపారు.

ఇళవరసన్ రాశారని చెబుతున్న లేఖ వాస్తవానికి ఆయన రాసి ఉండకపోవచ్చనీ, ఆయనను చంపినవారే ఆ లేఖను అక్కడ ఉంచి ఉండవచ్చని వి.సి.కె లాంటి పార్టీలు ఆరోపించాయి. జాతీయ ఎస్.సి కమిషన్ చైర్ పర్సన్ పూనియా, ఇళవరసన్ తల్లిదండ్రులు కూడా ఇవే అనుమానాలు వ్యక్తం చేశారు. దానితో పోలీసులు లేఖను ఫోరెన్సిక్ నిపుణులకు పరిశీలన నిమిత్తం పంపారు. తమిళనాడు ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ వారు, సదరు లేఖ ఇళవరసన్ దస్తూరితో సరిపోయిందని నిర్ధారించడంతో ఆయన మరణం పట్ల కలిగిన అనుమానాలు తొలగిపోయినట్లే.

ఇళవరసన్ విగత దేహం ధర్మపురి రైలు పట్టాలపై జులై 4వ తేదీన కనుగొనడంతో సంచలనం రేగిన సంగతి తెలిసిందే. ఆయనది హత్య అని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడంతో మద్రాసు హై కోర్టు, ఇళవరసన్ మృత దేహానికి రెండోసారి పోస్టుమార్టం చేయించింది. మొదటి సారి ధర్మపురి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించగా దానిపై ఇళవరసన్ తల్లిదండ్రులు, వారి తరపు లాయర్లు అనుమానాలు వ్యక్తం చేశారు. హై కోర్టు ఆదేశాల మేరకు మొదటి పోస్టుమార్టం వీడియోను ఇళవరసన్ తల్లిదండ్రులకు అప్పజెప్పారు. దాని ఆధారంగా వారు 13 ప్రశ్నల రూపంలో అనుమానాలు వెలిబుచ్చారు.

వీడియోను తిలకించిన వైద్య నిపుణులు సైతం మొదటి అటాప్సిపైన కొన్ని అనుమానాలు వెలిబుచ్చారు. మామూలుగా అయితే ఈ పోస్టుమార్టం సరిపోతుందనీ, కానీ అనుమానాస్పద మృతి అయినందున, వివిధ కారణాల వలన విస్తృత ప్రచారం కూడా పొందినందున మరింత జాగ్రత్తగా అటాప్సి/పోస్టుమార్టం నిర్వహించి ఉండాల్సిందని వైద్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనితో రెండోసారి అటాప్సి నిర్వహించడానికి కోర్టు ఆదేశించింది.

హై కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ, ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ కి చెందిన డాక్టర్ల బృందం నిన్న (శనివారం, జులై 13) ధర్మపురికి వచ్చి ఇళవరసన్ మృత దేహానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టంకు ముందు వారు ఇళవరసన్ తల్లిదండ్రులను కలిసి వారి అభ్యంతరాలను స్వీకరించారని, అనంతరం మూడు గంటల పాటు రెండోసారి అటాప్సి నిర్వహించారని ది హిందు తెలిపింది. తమ నివేదికను త్వరలోనే హై కోర్టుకు సీల్డ్ కవర్ లో అందజేస్తామని ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ డాక్టర్ల బృందం పత్రికలకు తెలిపింది.

రెండో ప్రయత్నం

“లేఖలోని దస్తూరి ఇళవరసన్ దేనని నిర్ధారిస్తూ మాకు నివేదిక అందింది. రైల్వే పోలీసులు ఘటనా స్ధలికి చేరేలోపే అక్కడికి చేరుకున్న అతని బంధువు ఒకరు ఆ లేఖను ఇళవరసన్ మృతదేహం నుండి తీసుకున్నారని కూడా నిర్ధారణ అయింది’ అని పరిశోధనాధికారి ఒకరు శనివారం తెలిపారని పత్రిక తెలిపింది.

ఇళవరసన్ ఆత్మహత్యకు ప్రయత్నించడం ఇది రెండోసారని తమ పరిశోధనలో తెలిసిందని పోలీసులు చెబుతున్నారు. దివ్య తనను వదిలి వెళిపోయిన తర్వాత జూన్ మొదటివారం నుండే ఇళవరసన్ ఆత్మహత్య ధోరణులను కనబరిచారని తెలుస్తోంది. మద్రాస్ హై కోర్టులో హాజరయిన దివ్య తాను తల్లి దగ్గరే ఉంటానని చెప్పినప్పటి నుండి ఇళవరసన్ డిప్రెషన్ లోకి వెళ్లారని పోలీసులు తెలిపారు.

“చెన్నైలోని టి.నగర్ లోని ఒక లాడ్జిలో ఉండగా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో ఇళవరసన్ తన ఎడమ ముంజేయి వద్ద పదునైన వస్తువుతో కోసుకున్నారు. అతని తల్లి వెంటనే గమనించి ఫస్ట్ ఎయిడ్ నిర్వహించారు. అటువంటి తీవ్ర చర్యలు తీసుకోవద్దని అతనికి కౌన్సిలింగ్ ఇచ్చినవారి స్టేట్ మెంట్లను మేము రికార్డు చేశాము… అతని గదిలో రక్తపు మరకలు ఉన్న విషయంపై హోటల్ సిబ్బంది నుండి సాక్ష్యం తీసుకున్నాము” అని పోలీసు అధికారి ఒకరు చెప్పారని ది హిందు తెలిపింది. ఇళవరసన్ ఎడమ చేతికి కట్టుతో ఉన్న ఫోటోను కూడా తాము సంపాదించామని కూడా సదరు అధికారి తెలిపారు.

ఇళవరసన్ మృత దేశానికి అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి నాధం కాలనీ వాసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. కాలనీ ప్రవేశం వద్ద 30 సెంట్ల స్ధలాన్ని అందుకోసం ప్రత్యేకంగా సేకరించినట్లు తెలుస్తోంది. దివ్య, ఇళవరసన్ ల పెళ్లిని వ్యతిరేకిస్తూ దివ్య తండ్రి ఆత్మహత్య చేసుకున్నాక వన్నియార్ కులస్ధుల దాడిలో నాధం కాలనీ మొత్తం తగలబడిన సంగతి తెలిసిందే. తమ కుమారుడికి మద్దతుగా వచ్చినవారందరికీ ఇళవరసన్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, హై కోర్టు, వైద్య నిపుణులు అందరూ తమకు తోడుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. దివ్య కోరుకుంటే ఇప్పటికైనా ఆమె తమతో కలిసి జీవించవచ్చనీ, ఆమెను తమ కన్న కూతురు కంటే ఎక్కువగా సాకుతామని ఇళవరసన్ తండ్రి ఎలంగో చెప్పడం విశేషం.

2 thoughts on “ఇళవరసన్ ది ఆత్మహత్యే!

  1. విశేఖర్ గారూ.. ఇళవరసన్ తన తల్లిదండ్రులకు, భార్యకు రెండు సూసైడ్ నోట్లు రాశాడని వార్తల్లో చదివాను. అవి దొరికితే.. వాటి అనువాదాన్ని అందించండి.. మీ రచనలో వాటి సారాంశాన్ని తెలుసుకోవాలనుంది. ప్రయత్నిస్తారు కదూ.. ప్లీజ్..

  2. అను గారూ ఇళవరసన్ రెండు లేఖలు రాయలేదు. రాసింది ఒకటే. అయితే తల్లిదండ్రులను, దివ్యను ఉద్దేశిస్తూ ఒకే లేఖ రాశాడు.

    లేఖ తమిళంలో ఉంది. ఆంగ్ల అనువాదం ఎవరూ ఇవ్వలేదు. కాబట్టి లేఖాంశాలు రాయడం నాకు సాధ్యం కాకపోవచ్చు. ఆంగ్ల అనువాదం దొరికితే మీరు కోరినట్లు రాస్తాను.

వ్యాఖ్యానించండి