కెనడా రాష్ట్రం క్వెబెక్ లో జులై 6 తేదీన పెట్రోలియం (క్రూడ్ ఆయిల్) తెస్తున్న రవాణా రైలు పట్టాలు తప్పి పెను విధ్వంసం సృష్టించింది. 72 ట్యాంకర్ల నిండా క్రూడాయిల్ తెస్తున్న గూడ్స్ రైలు అనూహ్య పరిస్ధితుల్లో తనంతట తాను కదిలి వేగం పుంజుకుని ఒక మలుపు దగ్గర పట్టాలు తప్పడంతో లాక్-మెగాంటిక్ అనే పట్టణం పాక్షికంగా ధ్వంసం అయింది. ట్యాంకర్లు ఒకదానిపై ఒకటి దొర్లిపడి పేలిపోవడంతో సమీపంలోని అనేక ఇళ్ళు తగలబడి పోయాయి. ఆరు వేల మందిని అప్పటికప్పుడు నగరం నుండి ఖాళీ చేయవలసి వచ్చింది. 50 మందికి పైగా చనిపోయిన ఈ ప్రమాదానికి కారణం ఇంకా తెలియకపోవడం ఒక సంగతైతే, ఎంతమంది చనిపోయిందీ ఇదమిద్ధంగా తెలియకపోవడం మరొక విషయం.
‘చావు రైలు’ గానూ, ‘నరకం నుండి ఊడిపడిన రైలు’ గానూ స్ధానికులు అభివర్ణించిన ఆ గూడ్సు బండి పట్టాలు తప్పే సమయానికి, అందులో ఎవరూ లేరు. నార్త్ డకోటా నుండి షేల్ ఆయిల్ తెస్తున్న ఈ బండిని నిజానికి డ్రైవర్ పార్క్ చేసి ఉంచాడు. ది అట్లాంటిక్ పత్రిక ప్రకారం అర్ధరాత్రి దాటాక లాక్-మెగాంటిక్ పట్టణానికి 11 కి.మీ దూరంలో బండిని నిలిపి డ్రైవర్/ఇంజనీరు సమీపంలోని హోటల్ లో బస చేయడానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన కొద్ది సేపటికి బండి కదలడం ప్రారంభించింది. అలా చెప్పా పెట్టకుండా ఎందుకు కదిలిందో కారణం ఇంకా తేలలేదు. కొండవాలు కావడంతో కొద్ది సేపట్లోనే వేగం పుంజుకుని పట్టణం నడిబొడ్డున ఉన్న మలుపు దగ్గర పట్టాలు తప్పింది.
అంతే. పట్టణ ప్రజలకు ఏం జరుగుతున్నదో అర్ధం అయ్యే లోపే ‘ధణేల్… ధణేల్’ మంటూ ట్యాంకర్లు ఒకదానిపై ఒకటి దొర్లిపడ్డాయి. ఆ రాపిడికి ట్యాంకర్లు అనేకసార్లు పేలిపోయి అడ్డు వచ్చిన ఇళ్లను, నిర్మాణాలను తగలబెట్టుకుంటూ, తొక్కుకుంటూ, తోసుకుంటూ పెను విధ్వంసం సృష్టించాయి. చనిపోయినవారిలో కొంతమంది ఆనవాళ్ళు కూడా దొరకలేదని వాషింగ్టన్ టైమ్స్ పత్రిక తెలిపింది. 50 మంది చనిపోయారని పత్రికలు చెబుతున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఏ లెక్కా వెలువడలేదు. కనీసం 6 సార్లు పేలుడు సంభవించిందని, పేలుళ్ళ ధాటికి పట్టణం మీదికి భారీ పరిమాణంలో అగ్ని గోళాలు విరుచుకుపడ్డాయని పత్రికలు తెలిపాయి.
ఈ ఫోటోలను ది అట్లాంటిక్ పత్రిక అందించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడి మనుగడ సాగిస్తున్నపుడు ఒక చిన్న పోరాపాటు (జరిగి ఉంటే) కూడా ఎంతటి విలయానికి దారి తీస్తుందో క్వెబెక్ ప్రమాదం తెలియజేస్తుంది.
- మెటల్ గోడలు కరిగిపోయిన దృశ్యం



















