ఎన్.ఎస్.ఎ తో కుమ్మక్కై యూజర్లను మోసం చేస్తున్న మైక్రోసాఫ్ట్


MS motto

అమెరికా రహస్య గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఎ -నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీ- తో పేరు పొందిన కంప్యూటర్ సాఫ్ట్ వేర్ సంస్ధ మైక్రోసాఫ్ట్ కుమ్మక్కయింది. “Your privacy is our priority” అన్న తన మోటోకు తానే స్వయంగా తూట్లు పొడుస్తోంది. మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అయిన విండోస్, ఈ మెయిల్ సంస్ధ ఔట్ లుక్ డాట్ కామ్ లకు తాను రూపొందించిన పటిష్టమైన ఎన్ క్రిప్షన్ ను ఛేదించి వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించగల తాళాన్ని తానే స్వయంగా ఎన్.ఎస్.ఎ కు అందజేసింది. స్నోడెన్ వెల్లడి చేసిన ఎన్.ఎస్.ఎ పత్రాలు ఈ సంగతులను ససాక్ష్యాలతో వెల్లడి చేస్తున్నాయని బ్రిటన్ పత్రిక ది గార్డియన్ తెలిపింది.

ఎన్.ఎస్.ఎ తో మైక్రోసాఫ్ట్ కుమ్మక్కు ఎంతవరకు వెళ్లిందంటే తాను అభివృద్ధి చేస్తున్న నూతన ఈ మెయిల్ వ్యవస్ధలోకి చొరబడలేనని ఎన్.ఎస్.ఎ గ్రహించి ఆందోళన వ్యక్తం చేస్తే చొరబాటుకు వీలయిన సాధనాలను తానే ఎన్.ఎస్.ఎ కు అప్పజెప్పేటంతగా. ది గార్డియన్ పత్రిక ప్రకారం స్నోడెన్ పత్రాలు “సిలికాన్ వ్యాలీ, అమెరికన్ గూఢచార సంస్ధల మధ్య సహకారం గత మూడేళ్లుగా ఎంత భారీ స్ధాయికి చేరుకున్నదో వెల్లడి చేస్తున్నాయి.” విదేశాల పౌరుల సమస్త ఇంటర్నెట్ సంభాషణల వివరాలను సేకరించి సి.ఐ.ఎ, ఎఫ్.బి.ఐ లతో పంచుకోడానికి ఎన్.ఎస్.ఎ అభివృద్ధి చేసిన ప్రిజం ప్రోగ్రాం ఏ విధంగా పని చేసేదీ కూడా స్నోడెన్ పత్రాలు వెల్లడి చేస్తున్నాయని పత్రిక తెలిపింది.

బ్రిటన్ రహస్య గూఢచార సంస్ధ జి.సి.హెచ్.క్యు –గవర్న్ మెంట్ కమ్యూనికేషన్స్ హెడ్ క్వార్టర్స్- ప్రిజం ప్రోగ్రాం ద్వారా సేకరించిన డేటాను విస్తృతంగా వినియోగించిందని, ముఖ్యంగా బ్రిటన్ పౌరుల ఈమెయిళ్ళు, టెలీ ఫోన్ వివరాలపైన భారీ నిఘా పెట్టిందని గార్డియన్ తెలిపింది. ఈ నిఘా ఎంత తీవ్రంగా, మరెంత ఆందోళనకరంగా ఉన్నదంటే ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ప్రతిపక్ష పార్టీలు, హక్కుల సంస్ధలు తీవ్ర ధ్వనితో డిమాండ్ చేస్తున్నారు.

గత వార్తలు చెప్పినట్లుగా ప్రిజం ప్రోగ్రాం కి మొట్టమొదట సహకారం ప్రారంభించిన కంపెనీ, మైక్రోసాఫ్ట్. ఈ సంస్ధ గత కొన్ని నెలలుగా ఔట్ లుక్ డాట్ కామ్ అనే పోర్టల్ ప్రారంభించింది. అంతకుముందు వివిధ ఎక్స్ టెన్షన్ లతో ఉన్న ఈ మెయిల్ సర్వీసులన్నింటినీ ఈ పోర్టల్ కిందికి మైక్రోసాఫ్ట్ సంస్ధ తెచ్చింది. అయితే ఈ పోర్టల్ ను ఏడాది క్రితమే పరీక్షించడం ప్రారంభించింది. ఈ పరీక్షలు ప్రారంభం అయినపుడే ఎన్.ఎస్.ఏ తన ఆందోళనను కంపెనీకి తెలియజేసింది. ఔట్ లుక్ డాట్ కామ్ కోసం మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసి అమలు చేస్తున్న ఎన్ క్రిప్షన్ వ్యవస్ధ పటిష్టంగా ఉండడంతో ఔట్ లుక్ పోర్టల్ ద్వారా జరిగే వెబ్ ఛాట్ లోకి తాము ప్రవేశించలేకపోతున్నామని ఎన్.ఎస్.ఏ తెలిపింది. ఎన్.ఎస్.ఏ కి ఆ సమస్య లేకుండా చేయడానికి మైక్రోసాఫ్ట్ పూర్తిగా సహకరించిందని స్నోడెన్ పత్రాల ద్వారా తెలుస్తోంది.

“గత సంవత్సరం ఔట్ లుక్ డాట్ కామ్ పోర్టల్ ను మైక్రోసాఫ్ట్ కంపెనీ పరీక్షించడం ప్రారంభించినప్పుడే దాని గుండా జరిగే వెబ్ ఛాట్ ఎన్ క్రిప్షన్ లోకి చొరబడడం గురించి ఎన్.ఎస్.ఏ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఐదు నెలల్లోనే మైక్రోసాఫ్ట్, ఎఫ్.బి.ఐ లు ఒక పరిష్కారం చూసుకున్నాయి. సదరు పరిష్కారం ద్వారా ఔట్ లుక్ డాట్ కామ్ ఛాట్ ల ఎన్ క్రిప్షన్ ను ఛేదించే అవకాశాన్ని కంపెనీ, ఎన్.ఎస్.ఏ కు కల్పించింది” అని ది గార్డియన్, స్నోడెన్ పత్రాలను ఉటంకిస్తూ తెలిపింది.

మైక్రోసాఫ్ట్ కంపెనీ, ఈ విధంగా అమెరికా గూఢచార కంపెనీలకు అందిస్తున్న సహకారం లేదా కుమ్మక్కు, వాస్తవానికి దాని మోటోకు బద్ధ విరుద్ధం. “మీ ఏకాంతమే మా ప్రాధామ్యం” అని చెప్పే మైక్రోసాఫ్ట్ అక్షరాలా దానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నమాట! ఒక్క మైక్రోసాఫ్టే కాదు. భారీ ఇంటర్నెట్ కంపెనీలయిన గూగుల్, స్కైప్, యాహూ, ఫేస్ బుక్ తదితర కంపెనీలన్నీ దాదాపు ఇలాంటి మోటోలనే కలిగి ఉన్నాయి. ‘Don’t be evil’ అని గూగుల్ అంటే, ‘our mission is to make the world more open and connected’ అని ఫేస్ బుక్ చెబుతుంది. ఈ మోటోలన్నీ అలంకార ప్రాయమేనని స్నోడెన్ పత్రాలు నిర్ద్వంద్వంగా తెలియజేస్తున్నాయి.

కంపెనీలు మాత్రం యధావిధిగా బొంకుతూనే ఉన్నాయి. ప్రభుత్వం నుండి చట్టబద్ధంగా అందిన వినతులకు మాత్రమే తాము స్పందిస్తున్నామని చెబుతున్నాయి. ఉనికిలో ఉన్న చట్టాలతో పాటు భవిష్యత్తులో రాగల చట్టబద్ధమైన డిమాండ్లకు అనుగుణంగా తాము స్పందించాల్సి ఉందని మైక్రోసాఫ్ట్ విచిత్రంగా సమాధానం చెబుతోంది. ఇలాంటి కంపెనీల వినియోగాన్ని క్రమంగా తగ్గించి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ను అలవాటు చేసుకోవడమే ఉత్తమంగా కనిపిస్తోంది.

వ్యాఖ్యానించండి