ప్రజాస్వామ్య అమెరికాలో 30,000 ఖైదీల నిరాహార దీక్ష


A jail in California

A jail in California

వివిధ దేశాల్లో మానవ హక్కుల ఉల్లంఘన పట్ల ప్రతి సంవత్సరం గొంతు చించుకునే అమెరికా తన పౌరులకు మాత్రం మానవ హక్కులు నిరాకరిస్తుంది. కాలిఫోర్నియా రాష్ట్రంలో జైళ్లలోని అమానవీయ పరిస్ధితులను, చిత్రహింసలను, పోలీసుల అణచివేత పద్ధతులను నిరసిస్తూ రాష్ట్ర వ్యాపితంగా వివిధ జైళ్లలోని 30,000 మంది ఖైదీలు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవడం ఈ సంగతిని మరోసారి తేటతెల్లం చేస్తోంది. బహుశా ప్రపంచ చరిత్రలోనే ఇంతమంది ఆమరణ నిరాహార దీక్షకు దిగడం ఇదే మొదటిసారి కావచ్చు.

గ్వాంటనామో బే జైలులో 150 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వందలాది ఖైదీలకు బలవంతంగా ఆహారం ఎక్కిస్తున్న అమెరికా కాలిఫోర్నియా ఖైదీల ఆందోళన పట్ల ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

రష్యా టుడే ప్రకారం కాలిఫోర్నియాలో మొత్తం 11 జైళ్ళు ఉండగా  వాటన్నింటిలోనూ ఖైదీలు సోమవారం నుండి ఆహారం నిరాకరిస్తున్నారు. అనేక నెలలుగా జైళ్లలోనే నిరసన ప్రదర్శనలు నిర్వహించిన ఖైదీలు తమ ఆందోళనకు ప్రభుత్వం స్పందించకపోవడంతో నిరాహార దీక్షకు దిగారు. కాలిఫోర్నియా డిపార్ట్ మెంట్ ఆఫ్ కరెక్షన్స్ అండ్ రీహేబిలిటేషన్ (సి.డి.సి.ఆర్) -రాష్ట్ర జైళ్ల విభాగం- ఖైదీల పట్ల అమానవీయ పద్ధతులను అవలంబిస్తోందని ఖైదీలు ఆరోపిస్తున్నారు.

ముఖ్యంగా వందలాది మంది ఖైదీలను ఒక పరిమితి అనేది లేకుండా దశాబ్దాల తరబడి ఒంటరిగా నిర్బంధిస్తున్నారని (సాలిటరీ కన్ఫైన్ మెంట్) వారు ఆరోపిస్తున్నారు. గరిష్టంగా 5 సంవత్సరాలు మాత్రమే ఒంటరిగా నిర్బంధించాలని ఖైదీలు ప్రధాన డిమాండుగా పెట్టారంటే ఖైదీల హక్కులు ఎంత తీవ్రంగా ఉల్లంఘించబడుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు.

లాస్ ఏంజిలిస్ టైమ్స్ (ఎల్.ఎ.టైమ్స్) పత్రిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న ఒంటరి నిర్బంధ విధానాలను సవరించుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. జైలు గ్యాంగ్ తగాదాల్లో ఉన్నారని భావించినవారిని గరిష్టంగా 5 సంవత్సరాలు మాత్రమే ఒంటరి నిర్బంధం విధించాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం వారిని ఎన్ని దశాబ్దాలైనా ఒంటరిగా నిర్బంధించవచ్చు.

ఒంటరి నిర్బంధం అంటే రోజులో 22.5 గంటల పాటు జైలులో ఎవరినీ కలవనివ్వరు. అతి చిన్న గదిలో నిర్బంధించడమే కాక ఆత్మహత్యకు పాల్పడవచ్చన్న పేరుతో పూర్తిగా నగ్నంగా ఉంచే అవకాశం ఉంటుంది. రాష్ట్ర జైళ్ళలో ప్రస్తుతం 4,527 మంది ఈ విధంగా ఒంటరిగా ఖైదీ చేయబడ్డారని ఎల్.ఎ.టైమ్స్ తెలిపింది. అయితే ఖైదీల ప్రకటన ప్రకారం ఈ సంఖ్య ఇంతకు రెట్టింపు ఉంటుంది. ఒక్క పెలికాన్ బే జైలులోనే 1180 మందిగా ఒంటరిగా నిర్బంధించారని తెలిపింది. ఈ జైలు నుండి మొదటిసారి నిరసనలు ప్రారంభం అయినట్లు తెలుస్తోంది.

ఆందోళన చేస్తున్న ఖైదీలు పత్రికలకు రాసిన ఒక లేఖలో ఇలా పేర్కొన్నారు. “ఖైదీల ఉమ్మడి మానవ హక్కుల ఉద్యమం ఇందు మూలంగా ప్రజలకు తెలియజేయునది ఏమంటే, ఒంటరి నిర్బంధానికి గురి చేయడం ద్వారా దశాబ్దాల తరబడి మమ్ములను చిత్రహింసలకు గురి చేస్యడానికి వ్యతిరేకంగా మేము తలపెట్టిన అహింసాయుత శాంతియుత నిరసన కార్యక్రమం ఈ రోజు నుండి తిరిగి మొదలవుతుంది… ఇందులో భాగంగా నిరాహార దీక్ష, నిరవధిక కాలం పాటు పని నిలుపుదల పాటిస్తాము. మా డిమాండ్లను అంగీకరిస్తూ సి.డి.సి.ఆర్ చట్టబద్ధమైన ఒప్పందంపై సంతకం చేసేవరకూ ఈ ఆందోళన జరుగుతుంది. సుదీర్హ కాలం పాటు ఒంటరిగా ఖైదు చేసే ప్రాక్టీస్ ను అంతం చేయాలన్నదే మా ప్రధాన డిమాండు.” పత్రికల ప్రకారం తమకు విద్యా, పునరావాస సౌకర్యాలు కూడా కల్పించాలని ఖైదీలు కోరుతున్నారు. ప్రతి నెలా తమవారికి ఫోన్ చేసే సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. అంటే కనీసం పరిమిత సంఖ్యలోనైనా ఫోన్ చేసుకునే సౌకర్యం ఖైదీలకు లేదన్నమాట!

కాలిఫోర్నియా ఖైదీలకు ఆందోళన చేయడం ఇది కొత్తకాదు. 2011లో జరిగిన నిరాహార దీక్ష పెలికాన్ బే జైలులోనే ప్రారంభం అయ్యి అనతికాలం లోనే రాష్ట్ర వ్యాపితంగా 6,000 మంది మద్దతు పొందింది. సదరు ఆందోళన చివరికి క్లాస్ యాక్షన్ లా సూట్ (ఒకే తరగతికి చెందిన అనేకమంది బాధితులు ఉమ్మడిగా హక్కుల రక్షణను గానీ, ఇతర విధాలుగా గానీ కోర్టు నుండి రక్షణ కోరడం) కు దారి తీసింది. ఈ కేసు ఇటీవలనే చర్చల దశలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. కానీ ఈ కేసు తర్వాత ఒంటరిగా ఖైదు అవుతున్నవారి సంఖ్య పెరిగిందేగాని తగ్గలేదని ఆందోళనకారులు చెబుతున్నారు. అనేక సంస్కరణలు ప్రవేశపెట్టినట్లు సి.డి.సి.ఆర్ చెప్పుకున్నప్పటికీ వాస్తవంలో ఒంటరి ఖైదు చేయగల అవకాశాలను అది మరింత విస్తృతం చేసిందని వారు ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక ఆందోళనను ఆమరణ నిరాహార దీక్షగా గుర్తించాలంటే ఆందోళనకారులు వరుసగా తొమ్మిది భోజనాలను నిరాకరించాల్సి ఉంటుంది. సోమవారం 30,000 మంది ఖైదీలు బ్రేక్ ఫాస్ట్, భోజనం నిరాకరించారని జైళ్ల అధికారులను ఉటంకిస్తూ ఎల్.ఎ.టైమ్స్ తెలిపింది. భోజనంతో పాటు పని, క్లాసులను కూడా ఖైదీలు ఎగవేశారని పత్రిక తెలిపింది.

ఖైదీల ప్రకటన ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 10,000 మందికి పైగా ఖైదీలు ఒంటరి నిర్బంధంలో ఉన్నారు. వీరిలో కొన్ని డజన్ల మంది దాదాపు 20 సంవత్సరాలకు పైగా ఒంటరి నిర్బంధంలో ఉన్నారు. వారిలో గాబ్రియేల్ రేస్ అనే ఖైదీ ఒక ఇంటిని దోపిడి చేసినందుకు 25 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నారని ట్రూత్-ఔట్ అనే వెబ్ సైట్ ద్వారా తెలుస్తోంది. గ్యాంగ్ సభ్యుడుగా ఈ దోపిడి చేశాడని ప్రాసిక్యూషన్ ఆరోపించడంతో ఈ విధంగా సుదీర్ఘ కాలం పాటు ఆయనను ఒంటరి నిర్బంధంలో ఉంచారని ట్రూత్-ఔట్ తెలిపింది.

అమెరికాలో ప్రజాస్వామ్యం తీరు ఇలా తగలడింది!

4 thoughts on “ప్రజాస్వామ్య అమెరికాలో 30,000 ఖైదీల నిరాహార దీక్ష

వ్యాఖ్యానించండి