లడఖ్ లో మళ్ళీ చైనా చొరబాటు


దౌలత్ బేగ్ ఓల్డి సెక్టార్ లో ఏప్రిల్ లో చైనా సైన్యం నిర్మించిన శిబిరం

దౌలత్ బేగ్ ఓల్డి సెక్టార్ లో ఏప్రిల్ లో చైనా సైన్యం నిర్మించిన శిబిరం

లడఖ్ లో మళ్ళీ చైనా చొరబాటు చోటు చేసుకున్నట్లు పి.టి.ఐ తెలిపింది. ఏప్రిల్ నెలలో చొరబడిన ప్రాంతానికి సమీపంలోనే తాజా చొరబాటు జరిగినట్లు తెలుస్తోంది. చుమర్ సెక్టార్ లో చొరబడిన చైనా పి.ఎల్.ఏ బలగాలు భారత సైన్యం నిర్మించిన బంకర్లు కొన్ని ధ్వంసం చేసి కెమెరా కేబుల్స్ ను తెంచివేసినట్లు తెలిసింది.

ఈ రోజు (మంగళవారం, జులై 9) వెలుగులోకి వచ్చినప్పటికీ వాస్తవానికి ఈ చొరబాటు జూన్ నెలలోనే జరిగింది. చైనా, భారత్ ల భూభాగాలను విడదీసే వాస్తవాధీన రేఖకు చైనావైపు నుండి ఎటువంటి ప్రవేశం లేని చోట్ల భారత్ బంకర్లు నిర్మించి చైనా సైనిక కదలికలను గమనించడానికి కెమెరాలు ఏర్పాటు చేసిందని, ఈ భూభాగాన్ని తమదిగా చైనా భావిస్తున్నదని తెలుస్తోంది.

భారత అధికార వర్గాల ప్రకారం జూన్ 17 తేదీన ఈ చొరబాటు చోటు చేసుకుంది. చుమర్ సెక్టార్ లోకి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు చొచ్చుకు వచ్చి భారత సైన్యం నిర్మించిన పరిశీలక బంకర్లను ధ్వంసం చేయడం ప్రారంభించాయని, కెమెరాల కేబుల్స్ ను కత్తిరించాయని అధికార వర్గాలు తెలిపాయి.

లె (Leh) కు 300 కి.మీ దూరంలో ఉన్న చుమర్, చైనాకు మొదటి నుండి అసౌకర్యం కలిగిస్తున్న ప్రాంతం అని పి.టి.ఐ తెలిపింది. ఎందుకంటే, చైనా-భారత్ సరిహద్దు వెంబడి ఉన్న ప్రాంతాల్లో ‘వాస్తవాధీన రేఖ’ ను చేరడానికి చైనా బలగాలకు నేరుగా ప్రవేశం లేని ఏకైక ప్రాంతం ఇదే.

చుమర్ సెక్టార్ కు సమీపం లోని దౌలత్ బేగ్ ఓల్డీ సెక్టార్ లో ఏప్రిల్ 15 తేదీన చైనా బలగాలు చొరబడడంతో రెండు వారాలకు పైగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడడం తెలిసిందే. ఈ ప్రాంతాలు తమవేనని ఇరు దేశాలు భావిస్తుండడంతో తరచుగా ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి. ఇటీవలివరకూ ఈ ప్రాంతాన్ని పెద్దగా పట్టించుకోని భారత ప్రభుత్వం, గత కొన్ని సంవత్సరాలుగా సైనిక కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రోడ్లు నిర్మించడం, పహారా కాయడం, బంకర్లు నిర్మించడం తదితర కార్యకలాపాలను నిర్వహిస్తోంది. దీనితో చైనా అప్రమత్తమై అతిగా స్పందిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఏప్రిల్ 15 నాటి చొరబాటు కూడా చుమర్ డివిజన్ లో భారత్ నిర్మించిన పరిశీలక స్తంభం (observation tower) వల్లనే సంభవించిందని పత్రికలు తెలిపాయి. చైనా బలగాల చొరబాటు అనంతరం తలెత్తిన ఉద్రిక్తతల నేపధ్యంలో ఈ టవర్ ను భారత్ సైనికులు కూల్చివేశాయని, అనంతరమే ఉద్రిక్తతలు చల్లబడ్డాయని ది హిందు తెలిపింది.

మార్చి చివరి వారంలో ఇరు దేశాల సైనిక బలగాల మధ్య కొన్ని పతాక సమావేశాలు జరిగాయి. భారత సైన్యం సాగిస్తున్న నిర్మాణాల పట్ల సదరు సమావేశాల్లో చైనా సైన్యం అసంతృప్తి తెలియజేసినట్లు తెలుస్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి చుమర్ లో భారత్ నిర్మించిన టవర్ పట్ల చైనా అభ్యంతరం తెలిపింది. ఆ తర్వాత కూడా టవర్ కొనసాగడంతో చైనా చొరబాటు జరిగినట్లు తెలుస్తోంది. అంటే ఏప్రిల్ నాటి చైనా చొరబాటు (మంత్రులు, అధికారులు ప్రకటించినట్లుగా) భారత ప్రభుత్వానికి తెలియకుండా జరిగిందేమీ కాదు.

టవర్ నూ, దానితో పాటు రక్షణ బంకర్లను కూడా భారత ప్రభుత్వం తొలగించడంతో చైనా కూడా తన చొరబాటు బలగాలను వెనక్కి ఉపసంహరించుకుంది. కానీ చైనా బలగాల కదలికలను పరిశీలించడానికి భారత సైన్యం అక్కడ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఈ చర్య కూడా చైనాకు నచ్చలేదని తెలుస్తోంది. ఫలితమే తాజా చొరబాటుగా భావించవచ్చు.

ది హిందూ ప్రకారం చుమర్ గ్రామం లడఖ్-హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులో ఉన్న ఒక మారుమూల గ్రామం. దీనిని తమ ప్రాంతంగా చైనా వాదిస్తోంది. చైనా బలగాలు, ప్రతి సంవత్సరం హెలికాప్టర్ల ద్వారా ఈ ప్రాంతానికి వస్తాయని తెలుస్తోంది. గత సంవత్సరం అలాగే హెలికాప్టర్ల ద్వారా ఇక్కడ దిగిన చైనా సైనికులు భారత సైన్యం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ నిర్మించిన గిడ్డంగి గుడారాలను ధ్వంసం చేశారు.

మే 5 న చైనా చొరబాటు ముగిసిన సందర్భంగా ఇరు పక్షాల మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదు. ఒప్పందం జరిగినట్లు ఏ పక్షమూ చెప్పలేదు. ఫలితంగా మళ్ళీ మళ్ళీ చొరబాట్లు, ఉద్రిక్తతలు జరిగే అవకాశాలకు ఇరు పక్షాలు చోటు కల్పిస్తున్నాయి. లడఖ్ ప్రాంతంలో ఇరు దేశాల మధ్య శాశ్వత సరిహద్దు రేఖ పై శాశ్వత ఒప్పందం జరగనంతవరకూ ఉద్రిక్తతలు కొనసాగుతాయి.

దేశంలో ప్రభుత్వాల పాలన పట్ల ప్రజల్లో అసంతృప్తి చెలరేగినపుడు పాలకులు తరచుగా సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం పరిపాటి. ఈ దృష్ట్యా చూస్తే సరిహద్దు ఉద్రిక్తతలు పాలక వర్గాలకు ప్రజల దృష్టిని మరల్చే శక్తివంతమైన సాధనాలు. అలాంటి సాధనాలను పనికిరాకుండా చేసుకోవడం పాలకులకు సహజంగానే మనసొప్పదు. కాబట్టి సరిహద్దు ఉద్రిక్తతలు శాశ్వతంగా చల్లారడం అనేది వాస్తవంలో ఒక కలే కావచ్చు.

2 thoughts on “లడఖ్ లో మళ్ళీ చైనా చొరబాటు

వ్యాఖ్యానించండి