ఈజిప్టులో మిలట్రీ కుట్ర: రాజ్యాంగం రద్దు, ప్రభుత్వం కూల్చివేత


‘సింగడు పోనూ బోయేడు, రానూ వచ్చేడు’ అని సామెత! ఈజిప్టులో అమెరికా నెలకొల్పిన నడమంత్రపు ప్రజాస్వామ్యం పరిస్ధితి అలాగే తగలడింది. 30 యేళ్ళ ముబారక్ నియంతృత్వ పాలనతో విసుగు చెంది ఉన్న ఈజిప్టు ప్రజల అసంతృప్తిని నేర్పుగా పక్కకు తప్పించి మళ్ళీ తన మరో కీలుబొమ్మనే ఈజిప్టు అధ్యక్షుడుగా ప్రతిష్టించడంలో సఫలం అయిన అమెరికా, మోర్శి వ్యతిరేక ప్రభంజనాన్ని బెదిరింపులతో అరికట్టడంలో విఫలం అయింది. ఐరోపా మద్దతు ఉందని భావిస్తున్న నేషనల్ సాల్వేషన్ ఫ్రంట్ అధినేత, ఐ.ఎ.ఇ.ఎ మాజీ చీఫ్ మహమ్మద్ ఎల్-బరాదీ నేతృత్వంలో ఈజిప్టు ప్రజలు పెద్ద ఎత్తున నగరాలన్నింటా వీధులను ముంచెత్తగా ఆర్మీ రంగం లోకి దిగి అధ్యక్షుడు మహమ్మద్ మోర్శిని అధికారం నుండి కూలదోసింది.

భారత పాలమానం ప్రకారం సరిగ్గా బుధవారం అర్ధరాత్రి మోర్శిని పదవి నుండి తప్పించి, హౌస్ అరెస్టు చేసి ఆర్మీ అధికార పగ్గాలను చేపట్టినట్లు రష్యా టుడే తెలిపింది. మోర్సికి వ్యతిరేకంగా అనేక వారాలుగా పెద్ద ఎత్తున ఈజిప్టు అంతటా ప్రదర్శనలు జరుగుతున్నాయి. దేశంలో ఇస్లామిక్ చట్టాన్ని రుద్దడానికి ముస్లిం బ్రదర్ హుడ్ నేతృత్వంలోని ఫ్రీడం అండ్ జస్టిస్ పార్టీ (మహమ్మద్ మోర్శి ఈ పార్టీ ద్వారానే అధ్యక్షుడుగా రెండేళ్ల క్రితం ఎన్నికయ్యారు) ప్రయత్నిస్తోందని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. మోర్శి వెంటనే గద్దె దిగాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఆయన దిగిరాలేదు. ఈ నేపధ్యంలో సంక్షోభాన్ని బుధవారం మధ్యాహ్నం లోగా పరిష్కరించుకోవాలని లేనట్లయితే తాము రంగంలోకి దిగుతామని ఆర్మీ ప్రకటించింది.

దీనితో ఈజిప్టులో మిలట్రీ కుట్రకు రంగం సిద్ధమయిందని పత్రికలు అంచనాలు వేయడం ప్రారంభించాయి. మోర్శి కూల్చివేతను నివారించడానికి అమెరికా శతధా ప్రయత్నిస్తున్నదని నేషనల్ సాల్వేషన్ ఫ్రంట్ అధినేత మహమ్మద్ ఎల్ బరాది ప్రకటించగా ఆయన ప్రకటన నిజమే అన్నట్లుగా అమెరికా కూడా మోర్సికి మద్దతుగా ప్రకటనలు జారీ చేసింది. ఈ లోగా బుధవారం మధ్యాహ్నానికి ఆర్మీ విధించిన గడువు సమీపించే కొద్దీ దేశం అంతటా కీలకమైన నగరాలలోని కీలక కూడళ్ళ వద్ద సైనికులు ట్యాంకర్లతో తిష్ట వేశారు. అధ్యక్ష భవనం చుట్టూ కూడా ట్యాంకర్లు మోహరించాయి.

తాహ్రిరి స్క్వేర్ మళ్ళీ ఉద్యమాల రణ క్షేత్రంగా మారింది. తాహ్రిరి స్క్వేర్ మొత్తం మోర్శి వ్యతిరేక ప్రదర్శనలతో నిండిపోగా ఇతర కూడళ్ళ వద్ద మోర్శి అనుకూలూరు ప్రదర్శనలు, సామూహిక ప్రార్ధనలు నిర్వహించారు.  రాబియా ఆల్-అదావియ్యా మసీదు వద్ద కొన్ని వందల వేలమంది మోర్శి మద్దతుదారులు గుమికూడి ప్రార్ధనలు నిర్వహించారు. కొన్ని చోట్ల మోర్శి అనుకూలురకు, వ్యతిరేకులకు ఘర్షణలు చెలరేగడంతో రెండు రోజుల్లో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక చోట్ల ముస్లిం బ్రదర్ హుడ్ కార్యాలయాలను తగలబెట్టగా మరికొన్ని చోట్ల కార్యాలయాలను లూటీ చేశారు.

ఆర్మీ విధించిన అల్టిమేటం గడువును మోర్శి ఏ దశలోనూ అంగీకరించలేదు. ఆయనకు అనుకూలంగా అమెరికా ప్రకటన చేయడంతో మోర్శి మరింత ధైర్యం తెచ్చుకొని ‘సైన్యానికి లొంగిపోవడం కంటే ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రాణాలు వదలడమే మేలని’ ప్రకటించారు. అయితే ఆయన ప్రకటన వట్టి వాగాడంబరంగానే మిగిలిపోగా సైన్యం ఆయనను హౌస్ అరెస్టు చేసిందని రష్యా టుడే తెలిపింది. కాగా మరి కొన్ని పత్రికలు ఆయనను అధ్యక్ష భవనం నుండి తొలగించి మిలట్రీ కార్యాలయాల్లో నిర్బంధించినట్లు తెలిపాయి.

రాయిటర్స్ వార్తా సంస్ధ ప్రకారం ఈజిప్టులో రాజకీయ పరివర్తనకు రోడ్ మ్యాప్ ను ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు, మహమ్మద్ ఎల్ బరాదీ నేతృత్వం లోని లిబరల్ ప్రతిపక్ష పార్టీల కూటమి నాయకులు కలిసి చర్చించి నిర్ణయిస్తారు. రాజకీయ మార్పిడి పధకాన్ని (political transition plan) రూపొందించడంలో తామరాద్ యువ ఉద్యమం కూడా పాలు పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ యువకుల ఉద్యమం వెనుక ఎవరు పాత్ర వహిస్తున్నదీ ఇంకా వెలుగులోకి రాలేదు.

మాజీ నియంత ముబారక్ పాలనలో  ఈజిప్టు మిలట్రీ కి అమెరికా మద్దతు ఉన్న నేపధ్యంలో, ఇప్పుడు కూడా పరివర్తనా కాలాన్ని నియంత్రించే పేరుతో అధికార పగ్గాలను తన చేతుల్లోకి ఆర్మీ తీసుకుంటున్నందున మళ్ళీ అమెరికా అనుకూల కీలు బొమ్మలు అధికారం చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజలు పెద్ద ఎత్తున ఆర్మీ ట్యాంకర్లకు స్వాగతం పలకడం, నియంతృత్వ పాలనలో కీలక పాత్ర పోషించిన సైన్యమే తమకు విముక్తి ప్రదాతగా నమ్ముకోవడం వలన వారు మరోసారి మోసపోవలసి వస్తుందని చెప్పక తప్పదు.

ముస్లిం బ్రదర్ హుడ్ పతనం?!

ఈజిప్టులో మొట్టమొదటి ప్రజాస్వామ్య బద్ధ ఎన్నికలుగా చెప్పబడిన ఎన్నికల్లో ముస్లిం బ్రదర్ హుడ్ అభ్యర్ధి మహమ్మద్ మోర్శి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ప్రజల బాగోగులు వదిలేసి తమ స్వంత ప్రయోజనాలను నెరవేర్చుకోవడంలో నిమగ్నమైయ్యారని పలు విమర్శలు వచ్చాయి. 2011 నాటి ఈజిప్టు విప్లవంలో ముస్లిం బ్రదర్ హుడ్ నేరుగా పాల్గొనలేదని దశాబ్దాల ఆర్ధిక సమస్యలతో అసంతృప్తితో రగిలిన ప్రజలు వీధుల్లోకి రావడంతో, అప్పటివరకూ అమెరికన్ డేగల రెక్కల మాటు దాగి ఉన్న ముస్లిం బ్రదర్ హుడ్ ఒక్కసారిగా ఉద్యమంలోకి ప్రవేశించి హైజాక్ చేసిందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రజల వాస్తవ పునాదితోనూ, వారి సమస్యలతోనూ సంబంధం లేని బ్రదర్ హుడ్, అధికారంతో దేశాన్ని ముస్లిం మత పాలనవైపుకి తీసుకెళ్తోందని ప్రజలు భావించడంతో అసంతృప్తి మూటగట్టుకుంది.

బ్రదర్ హుడ్ విధానాలు అధికారాన్ని మతం చుట్టూ కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తూ అసలు సమస్యలను గాలికి వదిలేసాయి. ముఖ్యంగా నిరుద్యోగం, దారిద్ర్యం లాంటి ఆర్ధిక, సామాజిక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. దీనితో అనేకమంది ప్రజల్లో మోర్శి పాలనపై భ్రమలు తొలగిపోవడం మొదలయ్యింది. అదీకాక అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు దశాబ్దాలుగా ఈజిప్టుపై మోపిన మిలట్రీ నియంతృత్వాన్ని, అసమాన ఒప్పందాలనూ ఎదుర్కొని నిలువరించాల్సి ఉండగా అదీ జరగలేదు. దానికి బదులు ప్రజల్లో సెక్టేరియన్ భావాలు పెంపొందించి శతాబ్దాల నాటి మత భావాలను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. అంతే కాక ఇతర రాజకీయ గ్రూపులతో కలిసి పని చేయడానికి ఆయన నిరాకరించారు. కీలక ప్రభుత్వ పోస్టులను బ్రదర్ హుడ్ నాయకులతో నింపేశాడు.

మరోవైపు ముస్లిం బ్రదర్ హుడ్ ప్రభుత్వం అమెరికాకు స్వేచ్చా మార్కెట్ విధానాల అనుసరణకు గట్టి హామీ ఇచ్చేసింది. ఐ.ఎం.ఎఫ్ అప్పులకోసం తీవ్రంగా ప్రయత్నించడం ప్రారంభించింది. ఐ.ఎం.ఎఫ్ అప్పుల సంగతి అందరికీ తెలిసిందే. ‘వ్యవస్ధాగత సర్దుబాటు కార్యక్రమం’ లాంటి అనేక విషమ షరతులతో వచ్చే ఐ.ఎం.ఎఫ్ అప్పు స్ధానిక ప్రజలకు నష్టాన్ని, విదేశీ మదుపరులకు లాభాల్నీ సమకూర్చింది.

అయితే మిలట్రీ కుట్ర అనంతరం అధికారం ఎవరి చేతుల్లోకి వెళ్తుందన్నదీ ఇంకా ఒక నిర్ణయానికి విశ్లేషకులు రాలేకపోతున్నారు. మళ్ళీ మిలట్రీ చేతుల్లోకి అధికారం వెళ్ళినట్లయితే ప్రజా ఉద్యమాలు మరొకసారి హైజాక్ అయినట్లే. ఉద్యమ నేతలు ప్రగతిశీలమైన నిర్దిష్ట రాజకీయ భావజాలాన్ని కలిగి ఉండకపోవడంతో ఉద్యమాలను హైజాక్ చేయడం పాలకవర్గాలకు తేలికగా మారిపోయింది. ఈ సారి పరిస్ధితి కూడా అంతకంటే భిన్నంగా ఉండవన్న భయాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

10 thoughts on “ఈజిప్టులో మిలట్రీ కుట్ర: రాజ్యాంగం రద్దు, ప్రభుత్వం కూల్చివేత

  1. @ ” ఉద్యమ నేతలు ప్రగతిశీలమైన నిర్దిష్ట రాజకీయ భావజాలాన్ని కలిగి ఉండకపోవడంతో ఉద్యమాలను హైజాక్ చేయడం పాలకవర్గాలకు తేలికగా మారిపోయింది.”

    అవును….నిర్దిష్ట లక్ష్యం, భవిష్యత్ ప్రణాళిక పోవడం వల్లే అనేక తిరుగుబాట్లు పక్కదోవ పడుతున్నాయి.
    మనదేశంలోనూ, మన రాష్ట్రంలోనూ అనేక ఉద్యమాలు ఇలా అసలు లక్ష్యం వదిలేసి…పక్కదోవ పట్టాయి.

    ” తిరుగుబాటు చేయడం తేలికే…..తిరిగి ‘బాట’ వేయడమే చాలా కష్టం. “

  2. ” తిరుగుబాటు చేయడం తేలికే…..తిరిగి ‘బాట’ వేయడమే చాలా కష్టం. “
    చందు తులసి గారు, అక్షరాల నిజమండి! పకడ్బందిగా, ప్రణాళికలేసుకొని, అనేకమంది ప్రాణాలు భలి పెట్టి తెచ్చిన రష్యా, చైనాల విప్లవాలు హైజాక్కు గురైయ్యాయి. ఇల్లాంటివన్ని ఒకలెక్కా? అయితే ప్రజాతిరుగుబాట్లను తక్కువగా అంచనా వేయకూడదు. ఏనాటికైనా ప్రపంచం ప్రజానిరంకుశత్వానికి గురి కాక తప్పదు.

  3. ’ తాహ్రిరి స్క్వేర్ మొత్తం మోర్శి అనుకూల ప్రదర్శనలతో నిండిపోగా ఇతర కూడళ్ళ వద్ద మోర్శి అనుకూలూరు ప్రదర్శనలు, సామూహిక ప్రార్ధనలు నిర్వహించారు.‘ కాని ఫోటోలు వ్యతిరేకుల ప్రదర్శనలతోనే నిండిపోయాయి.
    మన దేశంలో కూడా అటు బిజెపి, ఇటు కాంగ్రెస్ రెండింటిపై ప్రజలకు వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయం లేకపోవడం దురద్రుష్టకరమే.

  4. @ahsok

    మొదటి పదం ‘అనుకూల’ కాదు ‘వ్యతిరేక’. అది ఫ్లోలో దొర్లిన తప్పు. మధ్యాహ్నం సవరిస్తాను. ఇప్పుడు ఆఫీస్ కి వెళ్తున్నా.

  5. సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలనీ, లేదంటే రంగంలోకి దిగుతానని సైన్యం ప్రకటించడం, ఆ తరువాత మోర్శి కూల్చివేతను నివారించడానికి అమెరికా శతధా ప్రయత్నిస్తున్నదని నేషనల్ సాల్వేషన్ ఫ్రంట్ అధినేత మహమ్మద్ ఎల్ బరాది ప్రకటించగా ఆయన ప్రకటన నిజమే అన్నట్లుగా అమెరికా కూడా మోర్సికి మద్దతుగా ప్రకటనలు జారీ చేసింది. ఈ విషయాలు చూస్తుంటే సైన్యం చేసింది కుట్రగానే కనిపిస్తోంది. అంతేకాదు దానివెనక అమెరికా హస్తం కూడా ఉన్నట్లే. అధికారంలోకి రాబోయేది అమెరికా తొత్తులే అనిపిస్తుంది. సైనిక చర్య ప్రజలకు ఉపయోగపడదు.

వ్యాఖ్యానించండి