
Protesters shout slogans as they hold up a picture of former US spy Edward Snowden in front of the US consulate in Hong Kong on June 13, 2013. Snowden broke his silence on June 12, vowing to fight any bid to extradite him from Hong Kong and accusing Washington’s cyber-troops of prying into hundreds of thousands of targets globally including many in China. AFP PHOTO / Philippe Lopez
–
రచన: చందుతులసి
ఓ స్నోడెన్..
ఓ వేగుచుక్కా…
సాహసమే ఊపిరిగా స్వేచ్ఛా కేతనం ఎగరేసిన వీరుడా……
గుంటనక్క గోతుల్ని సాక్ష్యాలతో చాటిన శోధనుడా.
నీ ధైర్యం ప్రపంచ యువతను వెన్నుతట్టి లేపుతోంది
ఆంక్షలు లేని భావప్రపంచపు కొత్తదారిని చూపుతోంది.
ఓ స్నోడెన్
ఓ వెలుగు రేఖా…
శాంతిని, స్వేచ్ఛను లోకానికి చాటిన
బుద్ధుడు పుట్టిన నేల అనుకొని ఆశ్రయం కోరావా….?
సిద్ధార్ధుడ్నే కాదు…ఆయన సిద్ధాంతాల్ని మేమెప్పుడో మర్చిపోయాం.
మా కెవడైనా గుర్తుచేస్తే వాన్ని పక్క దేశాలకు తరిమి కొట్టాం.
ఓ స్నోడెన్..
ఓ స్వేచ్ఛా దివిటీ….
అతి పే……ద్ద ప్రజాస్వామ్యంలో
అంగుళం జాగైనా నీకు దొరకదు.
ఎందుకంటే…..
వెన్నెముకే లేని మేము ఆశ్రయం ఎలా ఇవ్వగలం..?
ఆసరా ఎలా కాగలం.?
నీకే కాదు…
ఈ దేశంలో పేదవాడికీ నిలువ నీడ దొరకదు.
ఓ స్నోడెన్…
ఓ సోదరుడా…
నువ్వు కనిపిస్తే…ఎదురొచ్చి
గుండెలకు హత్తుకోవాలనే ఉంది.
స్వేచ్ఛే నా ఊపిరి అని చాటి చెప్పిన
నీ గుండె చప్పుడు మనసారా వినాలనిపిస్తోంది.
శత్రువుని సైతం క్షమించాలని
మా పిల్లలకు చరిత్ర పాఠాలు చెపుతాం.
అవసరంలో ఆదుకోమంటున్న మిత్రునికి
ఆశ్రయం మాత్రం ఇవ్వలేం.
అశక్తులం…మమ్మల్ని క్షమించవూ…..
ఓ స్నోడెన్…
ఓ స్వేచ్ఛా చేగువెరా….
మా దేశంలో నీకు చోటివ్వలేకపోవచ్చు,
మా గుండెల్లో శాశ్వతంగా దాచుకుంటాం.
భారతదేశం ఇంకా బానిస శృంఖలాలు తెంచుకోలేదు
భారతదేశం ఇంకా భావదాస్యాన్ని విడనాడలేదు
భారత దేశమంటే ఏమనుకున్నావ్ స్నోడెన్!
ఇక్కడ స్వతంత్ర విహంగాలు ఎగురుతున్నాయనుకున్నావా?
ఇక్కడ విహంగాలను రెక్కలు విరిచి కట్టి వరల్డ్ బ్యాంక్ పంజరంలో దాచేసారు!
కట్లు విప్పుకోవడానికి కాలమెంత పడుతోందో తెలియదు!
స్వేచ్చ ఉండటానికి నీడ లేనిచోట నీకెలా నీడ దొరుకుతోంది అనుకున్నావ్?
పవిత్రతే మనిషి వైన వాడివి నీవు
మమ్మల్ని నీడకోసం దేబిరించి మలినమై పోవాలనుకున్నావా?
మేమంతా మరుగుజ్జులమని మరచి పోయావా నీవు?
పరాధీనులం మేము, పరిహసించకు మా తప్పుల్ని.
ఆకాశమే హద్దు అయిన వాడివి
సరిహద్దులెరుగని సకల జగజ్జనుల వారసుడివి!
కట్లు విప్పుకోవడానికి కాలమెంత పడుతోందో తెలియదు!
తిరుపాలు గారు….అద్భుతంగా చెప్పారు.
చందు తులసిగారు, నా మనసులోని మాటలను మీరు చెప్పి వేసారు.
చందు తులసి గారూ, మనసు కదిలించేలా, చాలా బాగా రాశారు. స్నోడెన్ ను అభిమానించేవారి గుండె చప్పుడు ఇది!
చాలా బాగా రాసారండి.
రాతి యుగం నుండి రాజుల కాలం వరకు ఇప్పటి ప్రజాస్వామ్యం కంటే మెరుగైన పాలన అనుకోవచ్చు. చివరికి బ్రిటిష్ పాలన ఇప్పటి పాలన కంటే బెటర్ అని పాతతరం వారు అంటున్నారు . స్నోడెన్ వంటి యోధుడికి వ్యక్తికి ప్రపంచం మొత్తం లో రక్షణ ఇవ్వలేని ప్రభుత్వాల మధ్య మనం జీవిస్తున్నామంటే…. తులసి గారు మమ్ములను కదిలించారు