ప్రిజం: మరో 4 స్లైడ్లు వెల్లడించిన వాషింగ్టన్ పోస్ట్


అమెరికా అక్రమ గూఢచర్యాన్ని ధ్రువపరిచే మరో నాలుగు పవర్ పాయింట్ స్లైడ్లను ‘ది వాషింగ్టన్ పోస్ట్‘ పత్రిక ప్రచురించింది. ప్రిజం అనే ప్రోగ్రామ్ సహాయంతో 9 ఇంటర్నెట్ కంపెనీల సర్వర్ల నుండి ప్రపంచ ప్రజల సెల్ ఫోన్, ఈ మెయిల్, చాటింగ్ తదితర సంభాషణలను అమెరికా గూఢచార సంస్ధ రికార్డు చేస్తున్న సంగతి ఎడ్వర్డ్ స్నోడెన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. గూఢచారులకు ట్రైనింగ్ ఇవ్వడానికి రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్లైడ్లను స్నోడెన్ ద్వారా సంపాదించిన ‘ది గార్డియన్’, ‘ది వాషింగ్టన్ పోస్ట్’ పత్రికలు గత నెల 6వ దేదీన నాలుగు స్లైడ్లను ప్రచురించాయి. ఆదివారం వాషింగ్టన్ పోస్ట్ పత్రిక మరో నాలుగు స్లైడ్లను ప్రచురించింది.

స్లైడ్లను ‘ది వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక ఇచ్చిన వ్యాఖ్యానాలతో సహా కింద చూడవచ్చు.

ప్రిజం ప్రోగ్రామ్ శక్తియుక్తుల గురించి ఈ స్లైడ్లు మరింత సమాచారం ఇస్తున్నాయి. స్లైడ్లలో ఉన్న సాంకేతిక పదజాలం వివిధ అంశాలకు పెట్టుకున్న కోడ్ నేమ్స్ గా తెలుస్తోంది. ఉదాహరణకి వివిధ టార్గెట్లను గుర్తించడానికి వినియోగించే శోధనా పదాలకు ‘సెలెక్టార్లు’ అని పేరు పెట్టారు. ‘రీజనబుల్ బిలీఫ్’ అనేది టార్గెట్ అమెరికన్ దేశీయుడా కాదా అని గుర్తించడానికి ఉపయోగించిన పదబంధం. దీని ప్రకారం విశ్లేషకుడు (analyst) టార్గెట్ చేయబడిన వ్యక్తి అమెరికన్ కాదని 51 శాతం సంతృప్తి చెందితే అది రీజనబుల్ బిలీఫ్ అవుతుంది.

ప్రైవేటు (ఇంటర్నెట్) కంపెనీల లోపల కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్న ఎఫ్.బి.ఐ, ప్రభుత్వ పరికరాలను కంపెనీల సర్వర్ల వద్ద స్ధాపించి డేటాను సేకరిస్తున్నదనీ ఈ డేటా సేకరణను ప్రభుత్వం వైపు నుండి పర్యవేక్షించే యంత్రాంగమే లేదనీ పోస్ట్ తెలియజేసింది. ఒక వేళ ఉన్నా అది కూడా గూఢచార యంత్రాంగంలో భాగంగా ఉందని తెలిపింది. మొత్తం 41 స్లైడ్లు ఉన్న ప్రిజం ప్రోగ్రామ్ శిక్షణా కార్యక్రమం నుండి ఇప్పటివరకు 8 స్లైడ్లను పత్రికలు (ది గార్డియన్, ది వాషింగ్టన్ పోస్ట్) ప్రచురించాయి.

డేటా సేకరించిన తర్వాత ఎఫ్.బి.ఐ దానిని నేరుగా ఎన్.ఎస్.ఎ కు పంపుతుందని పోస్ట్ తెలిపింది. ప్రిజం ఎంత భారీ కార్యక్రమం అంటే ఒక్క ఏప్రిల్ 5 తేదీనే మొత్తం 117,675 టార్గెట్ల పైన సంభాషణలు జరుగుతుండగానే నిఘా పెట్టారు. వీరిలో ఎంతమంది అమెరికన్లో, ఎంతమంది విదేశీయులో వేరు పరచగల పరిస్ధితి లేదని తెలుస్తోంది. అమెరికా పత్రికలకు ప్రిజం ప్రోగ్రామ్ వలన ఎంతమంది అమెరికన్లు బాధితులు అన్నదే సమస్యగా గుర్తుస్తున్నాయి తప్ప విదేశీయులు కూడా బాధితులుగా ఉండడం సమస్యగా గుర్తిస్తున్నట్లు లేదు. అంటే అమెరికన్ల పై నిఘా పెట్టడమే వాటికి అభ్యంతరం. విదేశీయులపై నిఘా వేసినా ఫర్వాలేదన్నమాట!

మైక్రోసాఫ్ట్, యాహూ, గూగుల్, ఫేస్ బుక్, పాల్ టాక్, యూ ట్యూబ్, స్కైప్, ఎ.ఒ.ఎల్, యాపిల్… ఈ తొమ్మిది కంపెనీలు ఇప్పుడు అమెరికా గూఢచార సంస్ధలు ఎఫ్.బి.ఐ, ఎన్.ఎస్.ఎ, సి.ఐ.ఎ లకూ బ్రిటిష్ గూఢచార సంస్ధ జి.సి.హెచ్.క్యు కూ సహకరిస్తున్నాయి. అంటే ఈ సంస్ధల వెబ్ సైట్ల వినియోగించడం ద్వారా మనం అప్ లోడ్ చేసే సమాచారం అంతా -అది పాఠ్యం రూపంలో ఉండొచ్చు, వాయిస్ రూపంలో ఉండొచ్చు లేదా ఛాట్ రూపంలో ఉండొచ్చు- అమెరికా గూఢచార సంస్ధలు నేరుగా కంపెనీల సర్వర్ల నుండే తస్కరిస్తున్నాయి. ఈ సంగతి బైటపడినా భారత ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు.

కాబట్టి మనకు మాత్రమే సొంతం అనుకున్న వ్యక్తిగత సమాచారం ఈ వెబ్ సైట్ల లోకి గానీ, సెల్ ఫోన్ల ద్వారా గానీ పంపకుండా ఉండడమే మనం చేయగలిగింది. సెల్ ఫోన్లలో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండడమే మంచింది. మళ్ళీ ఉత్తరాలపై ఆధారపడడమే ఉత్తమంగా కనిపిస్తోంది.

వ్యాఖ్యానించండి