మానవహక్కుల శిక్షణకు నిధులిస్తా తీసుకో, అమెరికాతో ఈక్వడార్


Photo: Russia Today

Photo: Russia Today

సార్వభౌమాధికార దేశం అంటే ఇదిగో ఇలా ఉండాలి! ఎంత చిన్న దేశం అయితేనేం, తన సార్వభౌమత్వానికి ప్రతీకాత్మకంగా ఐనా భంగం కలిగించే పెత్తందారీ హెచ్చరికల మొఖం మీద చాచికొట్టినట్లు సమాధానం చెప్పగలిగిన సత్తా ఉన్నపుడు!

ఈక్వడార్ ఇప్పుడు అదే చేస్తోంది. ఎడ్వర్డ్ స్నోడెన్ కు రాజకీయ ఆశ్రయం ఇస్తే ఈక్వడార్ కు లబ్ది చేకూర్చే రెండు వాణిజ్య ఒప్పందాలను రద్దు చేస్తానని అమెరికా హెచ్చరించిన గంటలలోపే ఈక్వడార్ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది.

రష్యా టుడే ప్రకారం, అమెరికా చెప్పిన రెండు చట్టాల వలన ఈక్వడార్ కి సాలీనా 23 మిలియన్ డాలర్లు లబ్ది కలుగుతుంది. సాలీనా అమెరికాకు ఏ ఒప్పందమూ లేకుండానే మానవ హక్కులను ఎలా కాపాడాలో శిక్షణ ఇవ్వడానికి తానే 23 మిలియన్ డాలర్ల నిధులు ఇస్తాము తీసుకోండని ఈక్వడార్ బదులిచ్చింది.

మానవ హక్కులకు తానే గొప్ప సంరక్షకుడినని గొప్పలు చెప్పే అమెరికాకు ఇంతకంటే సిగ్గుపోయే సమాధానం ఇంకేం ఉంటుంది? కాకపోతే అగ్రరాజ్యాధీశులు సిగ్గు అనేది శతాబ్దాల కిందటే వదిలేశారు. అసలైన అమెరికన్లను రక్తపుటేరుల్లో ముంచెత్తి అమెరికా నేలను హస్తగతం చేసుకున్నప్పుడే వారి మానవత్వం మంటగలిసి పోయింది. నీగ్రోలను జంతువుల లెక్కన ఓడల్లో బంధించి తెచ్చి బానిసలుగా చేసుకున్నపుడే వారి పశుత్వం నిగ్గుదేలింది. జాతి విద్వేషంతో ఇప్పటికీ నల్లవారిని సతాయిస్తూ, అబార్షన్ రాజకీయాలతో స్త్రీలను వేధిస్తున్న అమెరికన్ సమాజం మానవ హక్కులకు కాపలాదారు ఎలా అవుతుంది?! అలాంటి అమెరికా రాజ్యాధీసులకు (ప్రజలకు కాదు) మానవ హక్కులపై ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని గుర్తించిన ఈక్వడార్ కు జేజేలు!

తన పౌరుడినే వెంటాడి వేటాడుతూ, అతని పాస్ పోర్ట్ సైతం రద్దు చేసి, ప్రయాణించడానికి ఒక భూభాగం అనేదే లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్న అమెరికాకు- ప్రపంచ ప్రజల ఏకాంత హక్కులకు భంగం కలిగిస్తున్న సామ్రాజ్యాధీశుల బండారం బైటపెట్టి ప్రపంచానికే గొప్ప మేలు చేసిన ఎడ్వర్డ్ స్నోడెన్ కృషిని గుర్తించి, అమెరికా చట్టాలే కాకుండా అంతర్జాతీయ చట్టాలు కూడా గ్యారంటీ చేసిన హక్కులను తిరిగి అతనికి అప్పజెప్పడానికి ప్రయత్నిస్తున్న ఈక్వడార్, మానవ హక్కుల సంరక్షణలో శిక్షణ ఇవ్వడం అమెరికాకి లభించిన భేషైన అవకాశం!

ఈక్వడార్ ప్రభుత్వ ప్రతినిధి ఫెర్నాండో అల్వరాడో ఇచ్చిన సమాధానం ఇలా ఉంది. “ఈక్వడార్ ఎవరి నుండీ ఒత్తిడులు, బెదిరింపులను అంగీకరించబోదు. అది తన విలువలతో ఎప్పటికీ వ్యాపారం చేయదు. వర్తక ప్రయోజనాల కోసం లొంగుబాటు విధానాలను అనుసరించదు” అని ఫెర్నాండో స్పష్టం చేశారు. “అమెరికా మేము పొందుతున్నామని చెబుతున్న లబ్దికి సమానమైన మొత్తం, 23 మిలియన్ డాలర్లు, సాలీనా అమెరికాకు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాం. పౌరుల ఏకాంత (ప్రైవసీ) హక్కుల ఉల్లంఘనకు, మానవత్వానికే మచ్చ తెచ్చే చిత్రహింసలకు పాల్పడకుండా ఉండేలా అమెరికాలో తగిన శిక్షణ ఇవ్వడానికి ఆ నిధులను ఉపయోగపెట్టుకోవచ్చు” అని ఆయన తెలిపారు.

ఈక్వడార్ ఎగుమతుల్లో 40 శాతం అమెరికాకే వెళ్తాయని రష్యా టుడే తెలిపింది. ఈక్వడార్ సరుకులకు సుంకాలు లేని ప్రవేశం కల్పించే రెండు ఒప్పందాలలో ఒకదానిని రద్దు చేయడానికి అమెరికా స్నోడెన్ వ్యవహారానికి ముందే నిర్ణయించుకుంది. మరొక చట్టాన్ని పొడిగించడానికి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ తాను చెప్పినట్లు స్నోడెన్ హక్కులను కాపాడడానికీ, ఆయనకు రాజకీయ ఆశ్రయం ఇవ్వడానికీ తన వర్తక ప్రయోజనాలను వదులుకోవడానికి సైతం చిన్న దేశమైన ఈక్వడార్ సిద్ధంగా ఉండడం ముదావహం. మేము సార్వభౌమ దేశం అని చెప్పుకునే దేశాల ప్రభుత్వాల నుండి ప్రజలు కోరుకునేదీ, కోరవలసిందీ ఇదే.

4 thoughts on “మానవహక్కుల శిక్షణకు నిధులిస్తా తీసుకో, అమెరికాతో ఈక్వడార్

  1. ఈక్వడార్ నీకు సలాం. విశేఖర్ గారు దయచేసి అబార్షన్ రాజకీయాలు అంటే ఏమిటో వివరిస్తారా?

  2. గ్రేట్ ఈక్వడార్. రియల్లీ గ్రేట్.
    చాలా చిన్నదేశమైనా…..అమెరికాకు భయపడకుండా మానవ హక్కుల సంరక్షణ కోసం….విలువల పరిరక్షణ కోసం పాటుపడుతున్న ఈక్వడార్ ను చూసి మన పాలకులు చాలా నేర్చుకోవాలి.

    ప్రిజమ్ లాంటి అతిపెద్ద రహస్యం బయటపడ్డా….కనీసం ప్రశ్నించలేక తెల్లమొహం వేశారు మన పాలకులు.

  3. ఇక్వీడార్‌ మోకాలి ఎత్తుకు కూడ ఎదగని అమెరికా దాని పాదాలు తాకడానికి కూడ హర్‌ హు రాలు కాదు.

వ్యాఖ్యానించండి