స్నోడెన్: ఈక్వడార్ కు అమెరికా బెదిరింపులు


Ecuadorian President Rafael Correa

Ecuadorian President Rafael Correa

ఇంటర్నెట్ కంపెనీల ద్వారా ప్రపంచ ప్రజలపై అమెరికా సాగిస్తున్న గూఢచర్యాన్ని, ఏకాంత హక్కుల ఉల్లంఘనను వెల్లడి చేసిన మాజీ సి.ఐ.ఏ టెక్నీషియన్ ఎడ్వర్డ్ స్నోడెన్ కేంద్రంగా అమెరికా బెదిరింపులు కొనసాగుతున్నాయి. మాస్కో విమానాశ్రయంలో చిక్కుకుపోయిన స్నోడెన్ ను వెంటనే తమకు అప్పగించాలనీ, లేకపోతే రష్యా-అమెరికా సంబంధాలు దెబ్బ తింటాయని హెచ్చరించిన అమెరికా, స్నోడెన్ కు రాజకీయ ఆశ్రయం ఇవ్వజూపుతున్న ఈక్వడార్ ను తీవ్రంగా బెదిరిస్తోంది. అమెరికా ప్రభుత్వం లోని వివిధ నాయకులు, అధికారులు ఈక్వడార్ పై వాణిజ్య బెదిరింపులు సాగిస్తుండగా ఆ దేశం బెదిరింపులను ఏ మాత్రం లెక్క చేయకపోవడం విశేషం.

సెనేట్ లో విదేశీ వ్యవహారాల కమిటీ అధిపతి రాబర్డ్ మెనెండెజ్ ఈక్వడార్ పై వాణిజ్య బెదిరింపులు చేశాడు. స్నోడెన్ కు రాజకీయ ఆశ్రయం ఇచ్చినట్లయితే ఈక్వడార్ అంతర్జాతీయ వాణిజ్యం ప్రమాదంలో పడుతుందని ఆయన హెచ్చరించాడు. “చెడ్డ ప్రవర్తనకు మా దేశం బహుమానాలు ఇవ్వదు” అని ఆయన దురహంకార పూరితంగా వ్యాఖ్యానించాడు. ప్రిజం ప్రోగ్రామ్ ద్వారా తన అత్యంత ఘోరమైన ప్రవర్తనను మరోసారి ప్రపంచ ప్రజలకు చాటుకున్న అమెరికాకు మరొక సార్వభౌమాధికార దేశ ప్రవర్తనను ఎంచే నైతిక హక్కు లేనే లేదని ఈక్వడార్ పాలకులు సదరు వ్యాఖ్యలను తిప్పికొట్టారు.

అమెరికా మార్కెట్ లో ఈక్వడార్ కు పన్నులు లేని ప్రవేశాన్ని నిరోధించేందుకు తాను తీవ్రంగా ప్రయత్నిస్తానని మెనెండెజ్ ప్రకటించాడు. జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ప్రోగ్రామ్ ద్వారా ఈక్వడార్ (సరుకుల) కు అమెరికాలో పన్నులు లేకుండా ప్రవేశం లభిస్తోందని దీన్ని ఎత్తివేయడానికి తాను శ్రమిస్తానని ఆయన ప్రకటించాడు. అలాగే ఆండియన్ ట్రేడ్ ప్రమోషన్ అండ్ డ్రగ్ ఎరాడికేషన్ యాక్ట్ (ATPDEA) కింద ఈక్వడార్ కి కల్పించబడిన వాణిజ్య వసతులను తొలగించడానికి ప్రయత్నిస్తానని ప్రకటించాడు. ఈ రెండు ప్రోగ్రామ్ ల గడువు వచ్చే నెలాఖరుతో ముగుస్తుందని రష్యా టుడే తెలిపింది. అంటే ఎలాగూ గడువు ముగిసేవాటిని ముగిసేలా చూస్తానని మెనెండెజ్ బెదిరిస్తున్నాడన్నమాట!

Ecuador

Ecuador

ఆర్.టి ప్రకారం అమెరికాకు ఈక్వడార్ ఎగుమతి చేసే సరుకుల్లో ప్రధానమైనవి క్రూడాయిల్, పూలు, పళ్ళు, కూరగాయలు, రొయ్యలు, పెద్ద రొయ్యలు. ఈ సరుకులను పన్నులు లేకుండా ఎగుమతి చేయడానికి ఈక్వడార్ కి అవకాశం ఉందని మెనెండెజ్ బడాయి. అయితే ఈ అవకాశాలు ఈక్వడార్ కి మాత్రమే పరిమితం కాదు. ఉత్తర, దక్షిణ అమెరికా దేశాల వాణిజ్య కూటముల సభ్య దేశాల మధ్య జరిగిన ఒప్పందాల్లో భాగమే ఈ అవకాశాలు. అమెరికాకి ఎలాంటి లాభం లేకుండా ఇలాంటి ఒప్పందాలు జరగవు. కాబట్టి ఒప్పందాల ఉల్లంఘన, లేదా రద్దు ఇరు దేశాలనూ ప్రభావితం చేస్తాయి.

అమెరికాకు గ్యాస్, పెట్రోల్ సరఫరా చేసే దక్షిణ అమెరికా దేశాలు అతి తక్కువ ధరకు సరఫరా చేస్తాయి. అనేకమంది మధ్య, దిగువ తరగతి అమెరికన్లు ఈ దిగుమతులపై ఆధారపడి బతుకుతున్నారు. కనుక అమెరికా బెదిరింపులు ఆ దేశానికే ఎదురు తిరిగే అవకాశాలు ఎలాగూ ఉంటాయి. ఇవన్నీ ఆలోచించకుండా ఈక్వడార్, స్నోడెన్ కు రాజకీయ ఆశ్రయం ఇవ్వడానికి నిర్ణయిస్తోందని భావిస్తే అది పొరబాటే కాగలదు.

అయితే స్నోడెన్ కు రాజకీయ ఆశ్రయం ఇచ్చే అంశంతో సంభంధం లేకుండానే ATPDEA చట్టం పొడిగించే అవకాశాలు లేవని ఆర్.టి తెలిపింది. గతంలో ఈ చట్టం కింద బొలీవియా, కొలంబియా, పేరు దేశాలు లబ్ది పొందేవి. ఆ మూడు దేశాలు ఇప్పుడు ఈ చట్టం పరిధి నుండి తొలగించబడ్డాయి. ఇక మిగిలింది ఈక్వడారే. దానిని కూడా తొలగిస్తారని ఇప్పటికే ఒక అవగాహన ఉన్నది. అంటే మెనెండెజ్ చేసే బెదిరింపులు కేవలం ఉడత ఊపులే.

ఈ నేపధ్యంలో అమెరికా బెదిరింపులను ఈక్వడార్ లెక్క చేయలేదు. ది వాషింగ్టన్ పోస్ట్ లాంటి పత్రికలు సైతం తమ ఎడిటోరియల్స్ ద్వారా చేస్తున్న విమర్శలకు ఈక్వడార్ అధ్యక్షుడు రాఫెల్ కొరియా గట్టి బదులిచ్చారు. పస లేని బెదిరింపులతో అమెరికా ప్రపంచ దృష్టిని తాను చేస్తున్న అక్రమ గూఢచర్య కార్యకలాపాలపై నుండి స్నోడెన్ మీదికి మళ్లించడంలో సఫలం అవుతోందని ప్రజలు దానిని అనుమతించరాదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ప్రస్తుతం కొనసాగుతున్న వ్యవస్ధ అన్యామని, అనైతికమని ఆయన స్పష్టం చేశారు.

“స్నోడెన్ పైనా, ఆయనకు ‘మద్దతు’ ఇచ్చిన ‘దుష్ట దేశాల’ పైనా దృష్టిని మరాల్చడంలో వారు మేనేజ్ చేయగలిగారు. తద్వారా అమెరికా ప్రజలకూ, మొత్తం ప్రపంచానికీ వ్యతిరేకంగా వారు సాగించిన ఘోరాలను మనం మర్చిపోయేలా చేస్తున్నారు” అని కొరియా బుధవారం వ్యాఖ్యానించారు. అమెరికా వ్యతిరేక సెంటిమెంట్లను రెచ్చగొట్టి పాపులారిటీ సంపాదించిన వెనిజులా నేత హ్యూగో ఛావేజ్ స్ధానాన్ని ఆక్రమించడానికి కొరియా ప్రయత్నిస్తున్నారంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక మంగళవారం రాసిన ఎడిటోరియల్ కు ప్రతిస్పందనగా కొరియా ఈ వ్యాఖ్యానం చేశారు.

స్నోడెన్ వెల్లడించిన అమెరికా దుర్మార్గాలను వదిలి స్నోడెన్ పైనే ప్రపంచ ప్రజలు దృష్టి కేంద్రీకరిస్తే కొరియా చెప్పినట్లు అమెరికా లక్ష్యం నెరవేరినట్లే కాగలదు. అదే జరిగితే స్నోడెన్ తన ప్రాణాలకు తెగించి చేసిన సాహసం వృధా కాక తప్పదు. అది జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రపంచ వ్యాపితంగా ఉన్న ప్రగతిశీలురకూ, స్వేచ్ఛా పిపాసులకూ, హక్కుల కార్యకర్తలకూ ఉన్నది.

వ్యాఖ్యానించండి