గురువారం కొద్దిగా మెరుగుపడిన రూపాయి విలువ శుక్రవారం ఇంకొంత మెరుగుపడిందని మార్కెట్ వార్తలు సూచిస్తున్నాయి. అమెరికన్ రిజర్వ్ బ్యాంకు బెన్ బెర్నాంక్ ప్రకటనతో డాలర్ కొనుగోళ్ళు, రూపాయి అమ్మకాలు పెరగడం వలన చరిత్రలోనే అత్యంత కనిష్ట స్ధాయికి పడిపోయిన రూపాయి శుక్రవారం మధ్యాహ్నానికి డాలర్ కు రు. 59.82 పై ల స్ధాయికి పెరిగిందని తెలుస్తోంది. ఈ పెరుగుదలకు కూడా మళ్ళీ ఫెడరల్ రిజర్వ్ ప్రకటనే దోహదం చేయడం గమనార్హం.
ఇండియా కరెంటు ఖాతా లోటు కాస్త మెరుగుపడిందని గురువారం వార్తలు రావడం, ఫెడరల్ రిజర్వ్ ప్రకటనతో మెరుగుపడిన అమెరికా, ఆసియా స్టాక్ మార్కెట్లనుండి సానుకూల సంకేతాలు అందుకున్న భారత స్టాక్ మార్కెట్లు ప్రారంభంలో పెరుగుదలను నమోదు చేయడంతో రూపాయి విలువ గురువారం నాటి ‘డాలర్ = రు. 60.19 పై’ ల స్ధాయి నుండి ‘డాలర్ = రు. 59.82 పై’ స్ధాయికి పెరిగిందని ది హిందు తెలిపింది.
కరెంటు ఖాతా లోటు గురించి ఆర్.బి.ఐ గవర్నర్ ఆందోళన చెందుతున్న సంగతి విదితమే. 2012-13 ఆర్ధిక సంవత్సరం చివరికి ఈ లోటు 4.8 శాతం ఉన్నదని ఆర్.బి.ఐ గతంలో తెలియజేసింది. 2011-12 ఆర్ధిక సంవత్సరం చివరలో ఇది 4.2 శాతం మాత్రమే. ఈ లోటును చూపి ఆర్.బి.ఐ వడ్డీ రేట్లను మరింత తగ్గించడానికి గర్వర్నర్ సుబ్బారావు నిరాకరించారు. జూన్ రెండో వారంలో చేసిన ద్రవ్య విధాన సమీక్షలో ఆయన వడ్డీ రేటు తగ్గించకపోవడంతో పెట్టుబడిదారులు, ఇతర ధనికులు నిరాశ చెందారు. కొందరు బైటపడి కటువుగా విమర్శించారు కూడా. అయితే ఈ నికర లోటు వాస్తవంలో 3.6 శాతం మాత్రమేనని ఆర్.బి.ఐ గురువారం ప్రకటించింది. అంటే ముందు అనుకున్నట్లు 4.8 శాతం కాదని స్పష్టం అయింది. దానితో వడ్డీ రేట్ల తగ్గింపుపై మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి.
ఈ వార్తకు తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ అధికారులు పెట్టుబడిదారులకు, కంపెనీలకు వినసొంపయిన మాటలు చెప్పడంతో రూపాయి ధరతో పాటు భారత స్టాక్ మార్కెట్లు కూడా శుక్రవారం మెరుగుపడ్డాయి. ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ చెప్పిన మాటలను మార్కెట్లు తప్పుగా అర్ధం చేసుకున్నట్లు కనిపిస్తోందని వారు అర్ధం చేసుకున్నట్లు ఇప్పుడప్పుడే స్టిములస్ కార్యక్రమాన్ని వెనక్కి తీసుకునే అవకాశాలు లేవని ఫెడరల్ రిజర్వ్ న్యూయార్క్ విభాగం అధిపతి జెరోమ్ పావెల్ ప్రకటించారు. అమెరికా ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి చెందడంలో విఫలం అయితే సార్వభౌమ ఋణ పత్రాల నెలవారి కొనుగోళ్లను ఫెడ్ కొనసాగిస్తుందని ఆయన తెలిపారు. దానితో అమెరికా, ఆసియా స్టాక్ మార్కెట్లు పుంజుకోవడం, వాటిని అనుసరించి భారత స్టాక్ మార్కెట్లు, రూపాయి కూడా పుంజుకోవడం జరిగిపోయింది.
అనగా, ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్, అధికారుల మాటలపైన కూడా మన స్టాక్ మార్కెట్లు, రూపాయిల గమనం ఆధారపడి ఉంటోంది. భారత ఆర్ధిక వ్యవస్ధ విదేశీ ఆర్ధిక వ్యవస్ధలకు ముఖ్యంగా అమెరికా, ఐరోపా ఆర్ధిక వ్యవస్ధలకు అనుబంధంగా ఉన్నది తప్ప తనకంటూ స్వంత అస్తిత్వం లేదని, ఉన్నా అత్యంత బలహీనంగా ఉన్నదని అర్ధం చేసుకోవచ్చు. ఆ కాస్త అస్తిత్వం కూడా ఇక్కడి ప్రజల రోజువారీ శ్రమ, ఉత్పత్తులే కారణం తప్ప ప్రభుత్వాలు, ఆర్ధిక వ్యవస్ధ మేనేజర్ల ప్రతిభ అయితే మచ్చుకు కూడా కనిపించడం లేదు. లేకపోతే రూపాయి విలువ పతనం అవుతున్నపుడు ఆర్.బి.ఐ రంగంలోకి దిగి డాలర్లను ఆమేస్తూ రూపాయిలను కొనుగోలు చేసినా పతనం ఆగకుండా ఎందుకు ఉంటుంది?
అందుకే కార్టూనిస్టు అడుగుతున్నారు, “రూపాయి భవిష్యత్తు ఏమిటి?” అని.

చందుతులసి గారు గీసి పంపిన కార్టూన్ (లాంటిది) ఇది. వ్యాఖ్యగా నా మెయిల్ కి పంపారు.
బాగుంది, రూపాయి చిప్పలో డాలర్‌ని అడుక్కోవడం.