జారితే ఎక్కడ ఆగుతానో నాకే తెలియదు -రూపాయి


Rupee free fall

రూపాయి పరిస్ధితి కడు దయనీయంగా మారింది. రిజర్వ్ బ్యాంకు జోక్యం చేసుకున్నా వినకుండా పాతాళంలోకి వడి వడిగా జారిపోతోంది. బుధవారం, చరిత్రలోనే ఎన్నడూ లేనంత అధమ స్ధాయికి దిగజారి డాలర్ కి రు. 60.72 పైసల దగ్గర ఆగింది. సమీప భవిష్యత్తులో ఈ జారుడు ఆగే సూచనలు కనిపించడం లేదనీ మరింతగా రూపాయి విలువ పతనం కావచ్చని విశ్లేషకులు, మార్కెట్ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. రూపాయి పతనానికి కారణం గత ఆర్టికల్ లో చర్చించినట్లు ఎఫ్.ఐ.ఐ (ఫారెన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్) లు భారత స్టాక్ మార్కెట్ల నుండి ఉపసంహరించుకుని డాలర్ పెట్టుబడుల్లోకి పరుగులు పెట్టడమే.

బుధవారం రూపాయి కోల్పోయిన విలువ డాలర్ తో పోలిస్తే అక్షరాలా 106 పైసలు. అనగా క్రితం రోజుతో పోలిస్తే ఇది 1.78 శాతం తగ్గుదలకు సమానం. జూన్ 10వ తేదీన ఇదే స్ధాయిలో పతనం చవి చూసిన రూపాయి డాలర్ తో పోలిస్తే 109 పైసలు (1.91 శాతం) పడిపోయింది. డాలర్ల కోసం డిమాండ్ పెరగడంతో రూపాయి పతనం అరికట్టడానికి ఆర్.బి.ఐ వల్ల కూడా కాలేదు.

ఒక్క బుధవారమే ఎఫ్.ఐ.ఐ లు 550 కోట్ల మేర స్టాక్ మార్కెట్లను వదిలి వెళ్లిపోయాయి. ఈ మొత్తాన్ని కలుపుకుంటే జూన్ నెలలో ఇప్పటివరకు ఇండియా నుండి తరలి వెళ్ళిన ఎఫ్.ఐ.ఐ ల విలువ 9,000 కోట్ల రూపాయలు. ఋణ రంగంలో అయితే జూన్ నెలలో ఇప్పటివరకూ ఏకంగా రు. 27,850 కోట్లు భారత మార్కెట్లను ఖాళీ చేసి వెళ్లిపోయాయని ది హిందు తెలిపింది.

ఒక మార్కెట్ విశ్లేషకుడిని ఉటంకిస్తూ పత్రిక ఇలా తెలిపింది. “రూపాయి విలువ 59.90 పైసల వద్ద ఉన్నపుడు ఆర్.బి.ఐ జోక్యం చేసుకుంది. ఈ దశలో 5-10 పైసల రేంజిలో రూపాయి ట్రేడ్ అవుతోంది. కానీ రూపాయి విలువ డాలర్ కి 60 రూపాయల మార్క్ దాటిన మరుక్షణమే స్టాప్-లాస్ (నిర్దేశించబడిన మార్క్ ను తాకినపుడు ఆటోమేటిక్ గా అమ్మకం జరిగేలా ఏర్పాటు చేయబడిన మార్కు) ప్రేరేపించబడింది. దానితో రూపాయి తీవ్రంగా నష్టపోయింది.”

ప్రభుత్వం, ఆర్.బి.ఐ లు తగిన చర్యలు తీసుకోకపోతే త్వరలోనే రూపాయి విలువ డాలర్ కి రు. 62 – రు. 62.50 పై.లు మార్కు చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ బెన్ బెర్నాంక్ అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మెరుగుపడుతోందన్న సూచనలు ఇస్తుండడంతో డాలర్ భద్రమైన పెట్టుబడుల గమ్యంగా అవతరించి ఎఫ్.ఐ.ఐ లను ఆకర్షిస్తోంది. దీనితో డాలర్ విలువ బలపడి రూపాయి లాంటి వర్ధమాన దేశాల కరెన్సీలు బలహీనపడుతున్నాయి.

స్టాండర్డ్ చార్డర్డ్ బ్యాంకు నివేదిక ఇలా పేర్కొంది. “బలహీన రూపాయి ద్రవ్యోల్బణం ఒత్తిడిని తీవ్రతరం చేస్తుంది, కోశాగార లోటును (ఫిస్కల్ డెఫిసిట్) పెంచుతుంది. పెట్టుబడుల ప్రవేశం మందగింపజేస్తుంది. కానీ కరెంటు ఖాతా లోటుపైన ఎలాంటి సానుకూల ప్రభావమూ చూపదు. వేగవంతమైన పతనం బిజినెస్ సెంటిమెంటు పైన ప్రతికూల ప్రభావం సైతం చూపుతుంది.” ఏ పరిణామాలనైతే అడ్డుకోవాలని ప్రధాని, ఆర్ధిక మంత్రి శతవిధాలా ప్రయత్నిస్తున్నారో రూపాయి పతనం సరిగ్గా అదే పరిణామాలకు బాటలు వేస్తోందన్నమాట! మరి రెండు దశాబ్దాల నూతన ఆర్ధిక విధానాలు ఎవరికి లబ్ది చేకూర్చినట్లు?

4 thoughts on “జారితే ఎక్కడ ఆగుతానో నాకే తెలియదు -రూపాయి

  1. ఎఫ్.ఐ.ఐ లపై అతిగా అధారపడకుండ,రూపాయి విలువ మరంత పతనంకాకుండ తక్షణచర్యలు చేపట్టడానికి మనదేశానికి ఎటువంటి మార్గాలు ఉన్నాయో తెలుపగలరా?

  2. దేశీయ ఉత్పాదకతను పెంచుకోవడం ద్వారా. స్ధానికంగా విద్య, శాస్త్ర పరిశోధన రంగాలను అభివృద్ధి చేయడం, దేశీయ మార్కెట్ ను అభివృద్ధి చేయడం, తద్వారా ఉత్పాదకతను, ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం జరిగితే విదేశీ పెట్టుబడులపై ఆధారపడడం తగ్గించవచ్చు. (ప్రపంచ ఆర్ధిక సంక్షోభం తర్వాత చైనా ఈ పద్ధతిపై కేంద్రీకరించింది.) కాని దానికి స్వల్ప, దీర్ఘ కాలిక ప్రణాళికలు (అహ్లూవాలియా మార్కు ప్రణాళికలు కాదు) అవసరం. దానికి మళ్లీ రాజకీయ నిబద్ధత కావాలి.

  3. ఈ ఎఫ్ ఐ ఐ లు ఎప్పుడో ఒకప్పుడు ఇలా దెబ్బ తీస్తారని ఒకప్పుడు మనీ కంట్రొల్. కామ్మ్ లొ రాసేను. దీనికి ఉన్న ఒకే ఒక మార్గం క్రూడు ను దిగుమతి అరికట్టడమె. దేశీయ ఉత్పాదకతను పెంచుకోవడం. ప్లస్ పైన శేఖర్ గారు చెప్పినవి. పాటించాలి .

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s