ఉద్దేశ్యపూర్వకంగానే స్నోడెన్ హాంగ్ కాంగ్ వదిలి వెళ్లడానికి సహకరించారనీ, ఇందులో చైనా హస్తం ఉందనీ అమెరికా చేసిన ఆరోపణలను చైనా తిరస్కరించింది. కారు కూతలు కట్టిపెట్టాలని దునుమాడింది. అమెరికా మానవ హక్కుల నమూనా అని భావిస్తే ఆ భ్రమల నుండి బైటికి రావాలని హిత బోధ చేసింది. ఇంటర్నెట్ హక్కుల మేనిపులేటర్ గా అవతరించిన అమెరికా “ఒక పిచ్చి (హక్కుల) ఆక్రమణదారు” అని నిరసించింది. చైనా కమ్యూనిస్టు పార్టీ పత్రిక పీపుల్స్ డైలీ విదేశీ ఎడిషన్ ఈ మేరకు అమెరికాను తూర్పారబడుతూ విశ్లేషణ ప్రచురించిందని రష్యా టుడే తెలిపింది.
పీపుల్స్ డైలీ, చైనా కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రిక. పేరుకు కమ్యూనిస్టు పార్టీయే గానీ కమ్యూనిజాన్ని అదెప్పుడో వదిలిపెట్టింది. ప్రజల్లో సోషలిజం పట్ల ఉన్న ప్రతిష్ట వలన ఎర్ర జెండా ముసుగు కొనసాగిస్తున్న చై.క.పా నీడలోని పాలకవర్గాల గొంతును పీపుల్స్ డైలీ వినిపిస్తుంది. చైనా ధనిక వర్గాలను తమలో తాము తగువులాడకోకుండా ఒప్పందాలు చేయడం, ధనికుల పెత్తనాన్ని ఎదిరించే కార్మికవర్గాన్ని అణచివేయడం ఇప్పుడు చై.క.పా విధి.
చైనాలోపలి పరిస్ధితి ఎలా ఉన్నా అమెరికా దురహంకార ధోరణిని పీపుల్స్ డైలీ పత్రిక ఘాటుగానే తిరస్కరించింది. “అమెరికా అధికారులు మాకు వివరణ ఇచ్చి ఆపాలజీ చెప్పకపోవడమే కాకుండా దానికి బదులుగా హాంగ్ కాంగ్ ప్రత్యేక పాలనా ప్రాంతం తన చట్టానికి అనుగుణంగా వ్యవహరించలేదని అసంతృప్తి ప్రకటిస్తోంది” అని పత్రిక ఆశ్చర్యం ప్రకటించింది. చైనా, హాంగ్ కాంగ్ లలో ఫోన్ కంపెనీలు, యూనివర్శిటీలను హ్యాకింగ్ చేసినందుకు అమెరికా తమకు క్షమాపణ చెప్పాలని పత్రిక అంతరార్ధం. అకాడమీ ఆఫ్ మిలటరీ సైన్స్ పరిశోధకుడు ఈ విశ్లేషణ చేసినట్లు తెలుస్తోంది.
చైనా విదేశీ మంత్రిత్వ శాఖ కూడా అమెరికా ఆరోపణలకు ఘాటుగా స్పందించింది. అమెరికా ఆరోపణలు ఆమోదనీయం కాదని, ఆధారం లేనివని చైనా విదేశాంగ ప్రతినిధి హువా చున్యింగ్ విలేఖరులతో మాట్లాడుతూ తిరస్కరించింది. “తమ చట్టాల ప్రకారం వ్యవహరించలేదని హాంగ్ కాంగ్ ని అమెరికా ప్రశ్నించడం హేతుబద్ధం కాదు. చైనా కేంద్ర ప్రభుత్వం పైన అమెరికా చేసిన ఆరోపణలకు ఆధారం లేదు” అని ఆమె పేర్కొంది.
ఎడ్వర్డ్ స్నోడెన్ తనంతట తానే, చట్టబద్ధంగా హాంగ్ కాంగ్ వదిలి వెళ్లాడని హాంగ్ కాంగ్ ప్రభుత్వం ఆదివారం ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. స్నోడెన్ ను అప్పగించాలంటూ అమెరికా దాఖలు చేసిన పత్రాలు చైనా చట్టాలకు తగిన విధంగా లేవని, మరిన్ని పత్రాలు అవసరం కావాలనీ హాంగ్ కాంగ్ అమెరికాను కోరింది. స్నోడెన్ హాంగ్ కాంగ్ వదిలి వెళ్లకుండా నిరోధించడానికి తగిన న్యాయ, చట్ట ప్రాతిపదిక లేనందున తాము అడ్డుకోలేదని కూడా హాంగ్ కాంగ్ ప్రకటన పేర్కొంది. ఇవేవీ పట్టించుకోని అమెరికా తమ చట్టాల ప్రకారం హాంగ్ కాంగ్ ఎందుకు వ్యవహరించలేదంటూ ప్రశ్నించి దీనివలన సంబంధాలు మామూలుగా ఉండవంటూ హెచ్చరించింది.
ఈ ధోరణిని పీపుల్స్ డైలీ తూర్పారబట్టింది. “ఒక విధంగా చూస్తే, అమెరికా మానవ హక్కుల నమూనా స్ధాయి నుండి వ్యక్తిగత ఏకాంతానికి తూట్లు పొడిచే ఈవ్స్ డ్రాపర్ గా, అంతర్జాతీయ అంతర్జాలాన్ని కేంద్రీకృత అధికారం ద్వారా నియంత్రించే మేనిపులేటర్ గా, ఇతర దేశాల నెట్ వర్క్ లలోకి దురాక్రమించే పిచ్చి దురాక్రమణదారుగా (mad invader) అవతరించింది” అని పీపుల్స్ డైలీ పేర్కొంది.
మేన్ హంట్ ఆపండి –ఆమ్నెస్టీ
బ్రిటన్ ఆధారిత అంతర్జాతీయ హక్కుల సంస్ధ ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ అమెరికా ధోరణిని నిరసించింది. అమెరికా ప్రభుత్వ హక్కుల ఉల్లంఘనలను వెల్లడి చేసినవారిని ప్రాసిక్యూట్ చేయడానికి వీలు లేదని సదరు సంస్ధ కోరింది. “అమెరికా ప్రభుత్వ మానవ హక్కుల ఉల్లంఘనల గురించిన సమాచారాన్ని వెల్లడి చేసినవారిపై ఎలాంటి చట్టం కింద కూడా ఆరోపణలు నమోదు చేయరాదు. ఆ విధంగా వెల్లడి చేయడం అంతర్జాతీయ సమాచార హక్కుల కిందా, భావ ప్రకటనా స్వేచ్చ కిందా చట్టబద్ధమే. అంతర్జాతీయ చట్టాలు అలాంటి వెల్లడికి రక్షణ కల్పిస్తాయి” అని ఆమ్నెస్టీ ప్రకటన పేర్కొంది.
అంతే కాకుండా రాజకీయ ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తిని ఆ దరఖాస్తు పరిశీలనలో ఉండగా నేరారోపణ చేసిన దేశానికి అప్పగించడానికి అంతర్జాతీయ చట్టాలు అంగీకరించవని ఆమ్నెస్టీ తెలిపింది.
అమెరికాకి చెందిన అంతర్జాతీయ మానవ హక్కుల సంస్ధ హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్ధ మాత్రం ఇంతవరకూ నోరుమెదపలేదు. ఈ సంస్ధలకు మూడో ప్రపంచ దేశాలపై అమెరికా, ఐరోపా దేశాలు సాగించే దాష్టీకాలు పెద్దగా కనపడవు. సిరియా, లిబియా, ఇరాక్, ఇరాన్, పాకిస్ధాన్, ఇండియా లాంటి దేశాల్లో మాత్రం మానవ హక్కుల ఉల్లంఘనలు వెంటనే పసిగట్టేస్తాయి. అమెరికా, ఐరోపాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు జరిగితే ఇంకా వేగంగా పసిగట్టేస్తాయి. మానవ హక్కులకు కూడా సామ్రాజ్యవాద లక్ష్యాలు ఉన్నాయి మరి!
