స్నోడెన్ కి షెల్టర్ ఇచ్చారా, జాగ్రత్త! అమెరికా హెచ్చరిక


అమెరికా తన సామ్రాజ్యవాద దురహంకార స్వభావాన్ని ఎటువంటి శషభిషలు లేకుండా మరోసారి చాటుకుంది. సి.ఐ.ఏ మాజీ గూఢచారి ఎడ్వర్డ్ స్నోడెన్ హాంగ్ కాంగ్ వీడి రష్యా వెళ్ళిన నేపధ్యంలో ఆయనకు ఏ దేశమూ షెల్టర్ ఇవ్వడానికి వీలు లేదని హెచ్చరించింది. విద్రోహ నేరం కింద అమెరికాలో ఆయనపై కేసులు నమోదయ్యాయని కాబట్టి ఏ దేశమూ ఆయనకు రక్షణ ఇవ్వడం గానీ, తన గగనతలం గుండా ప్రయాణించే అవకాశం కల్పించడం గానీ చేయరాదని అమెరికా అధికారి ఒకరు హెచ్చరించినట్లు పి.టి.ఐ తెలిపింది.పి.టి.ఐ వార్తను ది హిందూ, ఐ.బి.ఎన్ లైవ్ పత్రికలు కవర్ చేశాయి. అయితే ఐ.బి.ఎన్ లైవ్ లో ఈ వార్తా ఇంకా అందుబాటులో ఉండగా ది హిందూ పత్రిక ఆశ్చర్యకరంగా దానిని తొలగించింది.

స్నోడెన్-హాంగ్ కాంగ్ పరిణామాలు -ఆర్.టి నుండి

స్నోడెన్-హాంగ్ కాంగ్ పరిణామాలు -ఆర్.టి నుండి

“రాయబార మరియు చట్టాల అమలు సంస్ధల మార్గాల ద్వారా అమెరికా, పశ్చిమార్ధ గోళం లోని దేశాలతో నిరంతర సంబంధాలతో ఉన్నది. ఈ దేశాల గుండా స్నోడెన్ ప్రయాణించవచ్చు లేదా వీటిలో కొన్ని దేశాలే ఆయనకు అంతిమ గమ్యంగా ఉండవచ్చు. విద్రోహ నేరాల కింద స్నోడెన్ అమెరికాలో వాంఛనీయ వ్యక్తిగా ఉన్నాడని అమెరికా ఈ దేశాలకు సలహా ఇవ్వదలిచింది. కాబట్టి ఆయన ఇక ఎంత మాత్రమూ అంతర్జాతీయ ప్రయాణాలు చేయడానికి అనుమతి ఇవ్వరాదని చెప్పదలిచాము. ఒక్క అమెరికాకు మాత్రమే ఆయన ప్రయాణం చేయగలడని సూచిస్తున్నాము” అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అధికారి చెప్పినట్లు పి.టి.ఐ తెలిపింది.

వైట్ హౌస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి కైట్లిన్ హేడెన్ కూడా దాదాపు ఇదే హెచ్చరిక జారీ చేసింది. అవసరమైన అన్ని పత్రాలు అందజేసినప్పటికీ హాంగ్ కాంగ్ తదనుగుణంగా స్పడించనందుకు తాము అసంతృప్తి చెందినట్లు ఆమె ప్రకటించినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (ది పోస్ట్) పత్రిక తెలిపింది. స్నోడెన్ వెళ్లిపోవడానికి అనుమతించడం పట్ల రాయబార మార్గం ద్వారా హాంగ్ కాగ్, చైనా ప్రభుత్వాలకు తాము తీవ్ర అభ్యంతరం తెలిపామని ఆమె తెలియజేశారు. “ఇటువంటి ప్రవర్తన అమెరికా-హాంగ్ కాగ్, అమెరికా-చైనా సంబంధాలకు నష్టకరమని వైట్ హౌస్ స్పష్టం చేసింది” అని కైట్లిన్ హేడెన్ తెలిపారని ది పోస్ట్ తెలిపింది.

రష్యా ప్రభుత్వాన్ని దాదాపు బెదిరిస్తున్నట్లుగానే కైట్లిన్ వ్యాఖ్యానించారు. బోస్టన్ మారధాన్ టెర్రరిస్టు పేలుళ్ళ అనంతరం అమెరికా, రష్యాల మధ్య సహకారం తీవ్రంగా మెరుగుపడిందని, చట్టాల అమలు విషయంలో ఇరు దేశాల సహకారానికి మెరుగైన చరిత్ర ఉందని కాబట్టి స్నోడెన్ విషయంలో రష్యా తగిన సహకారం అందజేయాలని కైట్లిన్ ప్రకటించారు. సహకారం కావాలని ఒకవైపు కోరుతూనే మరోవైపు రష్యా, చైనా తదితర దేశాలను హేళన చేసే పద్ధతుల్లో అమెరికా అధికారులు వ్యాఖ్యానించడం విశేషం.

ప్రజాస్వామ్యం, వ్యక్తిగత హక్కులను రక్షించడానికే నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీ రహస్య గూఢచార కార్యక్రమాల వివరాలను లీక్ చేయడానికి సిద్ధపడినట్లు స్నోడెన్ చెబుతున్నాడని కానీ సదరు హక్కులను రక్షించడానికి స్నోడెన్ ఎంచుకున్న దేశాలు -చైనా, రష్యా, క్యూబా, వెనిజులా, ఈక్వడార్- ఆయన ఉద్దేశ్యంలోని బోలుతునాన్ని వెల్లడిస్తున్నాయని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించినట్లు ది పోస్ట్ తెలిపింది. “ఈ దేశాలను విమర్శించడంలో స్నోడెన్ విఫలం అయ్యాడు. దాన్ని బట్టే అమెరికా జాతీయ భద్రతకు నష్టం చేయడానికే ఆయన మొదటి నుండి కట్టుబడి ఉన్నాడు తప్ప అంతర్జాల స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ లకు కాదు” అని ఆయన వ్యాఖ్యానించాడు.

చైనా, క్యూబా, రష్యా, వెనిజులా, ఈక్వడార్ దేశాల్లో ప్రజాస్వామ్యం లేదని అమెరికా ఎప్పుడూ గొంతు చించుకుంటుంది. చైనా, క్యూబాలను పక్కన బెట్టినా మిగిలిన మూడు దేశాల్లోనూ క్రమం తప్పకుండా ఎన్నికలు జరుగుతాయి. వెనిజులాలో ప్రపంచంలోనే అత్యంత పారదర్శకమైన, అత్యంత మెరుగైన ఎన్నికల వ్యవస్ధ పని చేస్తోందని అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఇటీవలే ప్రశంసలు కురిపించాడు. ఈక్వడార్ లో మాజీ నియంతలను పెంచి పోషించి వారికి నిరంతర మద్దతు అందజేసింది అమెరికాయే. నియంతృత్వాలను కూల్చివేసి ప్రస్తుత అధ్యక్షుడు ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికల ద్వారా అయిదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్నారు.

రష్యాలో సైతం పుతిన్ ఎన్నికల ద్వారానే అధ్యక్షుడు అయ్యారు. అమెరికా ఎన్నికలు ఎంతగా కార్పొరేట్ కంపెనీల కనుసన్నుల్లో జరుగుతాయో అందరికీ తెలిసిన విషయం. జార్జి బుష్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడంలో అనేక అనుమానాలు ఉండగా ఆ అనుమానాలను తొలగించడానికి ఆదేశం ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. అలాంటి అమెరికానా వెనిజులా, ఈక్వడార్, రష్యా ఎన్నికలను పరిహసించేది? నవ్వి పోదురుకాక!

అమెరికా దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే అమెరికా బహుళజాతి కంపెనీలకు మాత్రమే వర్తించేది. ప్రజలు ఏమైపోయినా దానికి పర్వాలేదు. ప్రపంచంలో అత్యంత క్రూతమైన, అత్యంత హంతక స్వభావం కలిగిన నియంతృత్వాలకు సహకరించి కాపాడిన నీచ చరిత్ర అమెరికాకు ఉన్నది. కోల్డ్ వార్ కాలంలో లాటిన్ అమెరికా దేశాలలో అమెరికా సాగించిన మిలట్రీ కాంపెయిన్లను తలచుకుని ఇప్పటికీ అక్కడి ప్రజలు వణికిపోతారంటే అతిశయోక్తి కాదు. మధ్య అమెరికా దేశాలను డ్రగ్ పంటలు పండించే నిలయాలుగా మార్చివేసి వాటిద్వారా బిలియన్లు గడించిన మాఫియాలు అమెరికాలో కోకొల్లలు. అదే డ్రగ్స్ ను చూపి మధ్య, లాటిన్ అమెరికాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చివేసిన చరిత్ర కూడా అమెరికా సొంతం.

అంతెందుకు! ఇండియాలో 26/11 గా పేరు పొందిన ముంబై మారణకాండ దోషి డేవిడ్ కోల్మాన్ హెడ్లీ (మహమ్మద్ జిలానీ) ఇప్పుడు అమెరికా నిర్బంధంలోనే ఉన్నాడు. ఆయనను విచారించడానికి అనుమతి ఇవ్వాలని ఇండియా కోరినా అమెరికా అనుమతి ఇవ్వడం లేదు. ఒక సంవత్సరం పాటు హేడ్లిని ఇండియాకి పంపాలని విచారించి మళ్ళీ అప్పగిస్తామని ఇండియా కోరినా అమెరికా నుండి సానుకూల ప్రతిస్పందన రాలేదు. అమెరికా బూటకపు ‘టెర్రరిజం పై యుద్ధం’ కూ, ప్రజాస్వామ్య నిబద్ధతకు ఇంతకు మించిన సాక్ష్యం ఏముంటుంది?

అలాంటి అమెరికా ఇపుడు తనకు సమస్య వచ్చేసరికి ప్రపంచం పై వేలెత్తి చూపించడానికి సాహసిస్తోంది. అదీగాక సమస్యలో ఉన్న దేశం ఎలా ప్రవర్తిస్తుంది? వివిధ దేశాల సహకారం అవసరం అయినప్పుడు ఎలా అడగాలి? మర్యాదగా అడగాలి. సమానత్వ సూత్రంపై ఆ దేశానికి ఎలాగూ నమ్మకం లేదు. కనీసం సమానత్వ సూత్రాన్ని పాటిస్తున్నట్లయినా కనిపించాలి. దానికి బదులు బాసిజం వెలగబెట్టడానికే అమెరికా ఆసక్తి చూపుతోంది తప్ప సహకారం కోరుతున్నట్లుగా లేదు.

స్నోడెన్ పై హాంగ్ కాంగ్ పత్రికా ప్రకటన

స్నోడెన్ పై హాంగ్ కాంగ్ పత్రికా ప్రకటన

సెనేట్ గూఢచార సెలెక్ట్ కమిటీ ఛైర్మన్ డియాన్ ఫీన్ స్టీన్ ఏమంటున్నారో చూడండి. “అమెరికాతో సంబంధాలు మెరుగుపరుచుకోడానికి ఇదొక అవకాశంగా చైనా భావిస్తుందని, స్నోడెన్ ను అప్పగిస్తుందని నేను ఊహించాను. కానీ చైనా అందుకు భిన్నంగా వ్యవహరించింది. ఇందులో (స్నోడెన్ హాంగ్ కాంగ్ వదిలి వెళ్లడంలో) చైనా పాత్ర స్పష్టంగా ఉంది. చైనా పాత్ర లేకుండా హాంగ్ కాంగ్ సొంతగా ఈ పని చేయదు. మాస్కో పాత్ర ఆసక్తికరంగా ఉంది. (రష్యాలో) స్నోడెన్ ని ఒక కారులోనూ, ఆయన లగేజిని ఇంకో కారులోనూ తీసుకెళ్లారు. ఆయనతో మాస్కో ఏమీ చేసిందో తెలుసుకోవడం ఆసక్తిగా ఉంటుంది” అని ఆమె వ్యాఖ్యానించారని పి.టి.ఐ తెలిపింది.

స్నోడెన్ లగేజీని వేరే కారులో రవాణా చెయ్యడం ద్వారా ఆయన లీక్ చేసిన పత్రాలను రష్యా కూడా చూసిందని ఫీన్ స్టీన్ చెప్పదలిచారు. అసలు ప్రపంచ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని రహస్యంగా సేకరించడమే చట్టబద్ధం అని బారక్ ఒబామా దగ్గర్నుండి ఈ ఫీన్ స్టీన్ వరకూ సమర్ధించుకుంటూ స్నోడెన్ లీక్ చేసిన కొన్ని పత్రాలను రష్యా చూస్తే వచ్చిన నేరం ఏమిటి? అమెరికా చేసే దారి దోపిడీ చట్ట బద్ధం, రష్యా పెట్టె కన్నం మహా నేరమూనా?

మరో సెనేటర్ చార్లెస్ షూమర్ అయితే “తీవ్ర పరిణామాలు తప్పవు” అని రష్యాను నేరుగా హెచ్చరించాడు. సెనేట్ లోని డెమోక్రటిక్ పార్టీ నాయకుల్లో ఈయన మూడో స్ధానంలో ఉంటారు. “స్నోడెన్ కు షెల్టర్ ఇస్తే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది. స్నోడెన్ తప్పించుకోడానికి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా సహకరించడమే ఇప్పుడు తీవ్ర ఆగ్రహం కలిగిస్తోంది. అమెరికా-రష్యా సంబంధాలపై ఇది తీవ్ర ప్రభావం కలిగిస్తుంది” అని ఆయన సి.ఎన్.ఎన్ తో మాట్లాడుతూ హెచ్చరించాడు. “అమెరికా కంటిలో వేలు నెట్టడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నట్లుగా పుతిన్ కనిపిస్తాడు. సిరియా కానివ్వండి లేదా ఇరాన్ కానివ్వండి, లేదా ఇప్పుడు స్నోడెన్ వ్యవహారం అన్నా కానివ్వండి” అని షూమర్ తన భావ దరిద్రాన్నంతా వెళ్ళబుచ్చుకున్నాడు. అసలు అమెరికా సిరియా, ఇరాన్ ల కళ్ళల్లో ఎందుకు వేలు సరికదా మేకులు ఎందుకు నాటుతోందో షూమర్ సెలవివ్వాలి.

రాయిటర్స్ వార్తా సంస్ధ ప్రకారం రష్యా, అమెరికాకు ఘాటుగా బదులిచ్చింది. మాగ్నిట్ స్కీ చట్టం పేరుతో రష్యాకు వ్యతిరేకంగా అమెరికా ఒక చట్టాన్ని ఆమోదించాక ఇక రష్యా పైన ఎటువంటి బాధ్యతా లేదని స్పష్టం చేసింది. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన రష్యా అధికారులు, నాయకుల ఆస్తులను స్తంభింపజేయడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. ఈ చట్టాన్ని చేయవద్దని రష్యా కోరినప్పటికీ అమెరికా వినలేదు. రష్యా ఇప్పుడు ఆ సంగతే ఎత్తిచూపడం తగిన సమాధానమే కాగలదు. “అసలు సంబంధాలే క్లిష్ట దశలో ఉన్నాయి. ఒక దేశానికి వ్యతిరేకంగా మరొక దేశం శత్రుపూరిత చర్యలు తీసుకుంటున్నపుడు రష్యా నుండి సదవగాహనను, సహకారాన్ని అమెరికా ఎలా ఆశించగలదు?” అని రష్యా దిగువ సభలో విదేశీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ అలెక్సీ పుష్కోవ్ ప్రశ్నించారాని రాయిటర్స్ తెలిపింది. స్నోడెన్ అడిగితే రష్యాయే ఆయనకు రాజకీయ ఆశ్రయం ఇచ్చి ఉండేదని పుష్కిన్ చెప్పడం విశేషం.

ఇదిలా ఉండగా స్నోడెన్ అంతిమ గమ్యం ఈక్వడార్ అని తెలుస్తోంది. స్నోడెన్ వెనిజులాలో రాజకీయ ఆశ్రయం కోరినట్లుగా పత్రికలు ఆదివారం తెలిపాయి. అయితే ఆయన తమ శరణు వేదాడని ఈక్వడార్ ప్రభుత్వం ప్రకటించినట్లు సోమవారం పి.టి.ఐ తెలిపింది. మాస్కో నుండి హవానా వెళ్ళిన తర్వాత స్నోడెన్ అక్కడి నుండి నేరుగా ఈక్వడార్ వెళ్లవచ్చని తెలుస్తోంది.

ప్రజాస్వామ్య ప్రియులు, అభ్యుదయ కాముకులు, హక్కుల కార్యకర్తలు, సమాజ మార్పును కోరుకునే ప్రగతిశీల పధగాములు ఎడ్వర్డ్ స్నోడెన్ కు బేషరతు మద్దతు ఇవ్వవలసిన అవసరం ఉన్నది. స్నోడెన్ కు వ్యతిరేకంగా అమెరికా తదితర పశ్చిమ దేశాలు తీసుకోబోయే ప్రతి చర్యను ప్రజలు తిరస్కరించాలి.  స్నోడెన్ తిరిగి తన కుటుంబ సభ్యులను కలుసుకుని సుఖవంతమైన జీవనం గడపాలని కోరుకోవాలి. తమ లండన్ ఎంబసీలో జులియన్ ఆసాంజేకు రక్షణ కల్పిస్తున్న ఈక్వడార్, స్నోడెన్ కు సైతం రాజకీయ ఆశ్రయం కల్పించడం ద్వారా తన సామ్రాజ్యవాద వ్యతిరేకతను, ప్రజాస్వామిక ఆకాంక్షలను, పౌర హక్కుల పట్ల తనకు గల నిబద్ధతను నిర్ద్వంద్వంగా నిరూపించుకుంది. ఈక్వడార్ కూ, అక్కడి ప్రజలకు జేజేలు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s