ఏదైతే అదవుతుంది! -కార్టూన్


The Hindu

The Hindu

రూపాయి విలువ నూతన లోతులకు దిగజారుతున్నా, దుగుమతుల విలువ అమాంతం పెరిగిపోతున్నా మన పాలకులకు పెద్ద ఆందోళన లేదు. సరిగ్గా చెప్పాలంటే వారిపై వారికే నమ్మకం లేదు. జనం అయితే పోలీసుల్ని, సైన్యాన్నీ దించి అణచివేయొచ్చు గానీ అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ అధిపతిని వీరేమి చేయగలరు? అందువల్ల ఆందోళన పడుతున్న భారత మదుపుదారులకు ‘మరేం ఫర్వాలేదు’ అని చెబుతూ తమకు తాము ‘చేసేదేముంది ఏదైతే అడవుతుంది’ అని చెప్పుకుని నిశ్చేష్టులై ఉండిపోయారు.

సుపరిపాలన (గుడ్ గవర్నెన్స్) అనేది ఎక్కడైనా పాలకులు తరచుగా వల్లించే సూత్రం. భారత పాలకులకు అది లేదని ఆర్.బి.ఐ అధిపతి దువ్వూరు సుబ్బారావు గత కొన్నేళ్లుగా మొత్తుకుంటున్నారు. ఆర్.బి.ఐ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేటు తగ్గించమని భారత పెట్టుబడిదారుల నుండి ఆర్ధిక మంత్రి చిదంబరం వరకూ సుబ్బారావు గారి మీద అదేపనిగా ఒత్తిడి తెస్తున్నారు. వారి ఒత్తిడి మేరకు ఈ సంవత్సరంలోనే విడతకు 0.25 శాతం చొప్పున మూడు విడతలుగా వడ్డీ రేటులో కోత పెట్టింది ఆర్.బి.ఐ. అయినా వారు సంతృప్తి పడలేదు. ఇంకా తగ్గించమంటున్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం 10 శాతం దగ్గర్లో ఉన్నందున ఆర్.బి.ఐ గవర్నర్ అందుకు నిరాకరించారు. జూన్ 14 న జరిపిన ద్రవ్య విధాన సమీక్షలో వడ్డీ రేటు, సి.ఆర్.ఆర్ రేట్లను ఆయన యధాతధంగా ఉంచారు. దానితో పెట్టుబడిదారీ వర్గాలు, విత్తమంత్రి ఆయనపై కినుక వహించారు.

ఈ లోపే బెన్ బెర్నాంక్ ప్రకటన వెలువడడం, రూపాయితో పాటు స్టాక్ మార్కెట్లు కూడా అమాంతం కూలబడిపోయింది. రూపాయి విలువ తగ్గడం వలన దిగుమతుల విలువ పెరిగిపోనుంది. అంటే కరెంట్ ఖాతా లోటు ఇంకా పెరగనుంది. దీనివలన సుబ్బారావు గారి చర్య కాస్తో కూస్తో ఉపయోగకరంగా మారిందని స్పష్టం అయింది. ద్రవ్యోల్బణం, కరెంటు ఖాతా లోటు వల్లనే ఆర్.బి.ఐ వడ్డీ రేటు తగ్గించడానికి విముఖత చూపింది. కనుక ఆర్ధిక వ్యవస్ధ గవర్నెన్స్ ఎలా ఉన్నా ఆర్.బి.ఐ గవర్నెన్స్ గుడ్డిలో మెల్ల చందాన ఉన్నట్లయింది.

రూపాయి విలువ ఇప్పుడు డాలర్ కి రు. 59.50 పైసల పైనే ఉంది. ఇది రానున్న రోజుల్ల ఇంకా తగ్గి రు. 61 పైసలకు చేరవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే భారత ప్రజల కొనుగోలు శక్తి ఇంకా తగ్గిపోతుంది. రూపాయి విలువ పడిపోవడం సాకు చూపి మొన్ననే పెట్రోల్ రేటు లీటర్ కి 2 రూపాయలు పెంచారు. రూపాయి ఇంకా తగ్గితే పెట్రోల్ రేటుతో పాటు ఇతర నిత్యావసర సరుకులన్నీ పెరుగుతాయి. ప్రజల కొనుగోలు శక్తి ఇంకా పడిపోతుంది. అయితేనేం భారత పాలకులు, వారి ధనిక వర్గాల వద్ద అవినీతి సొమ్ము లక్షల కోట్లలో మూలుగుతోంది. కాబట్టి వారికి ఏది జరిగినా ఓ.కె. జనానికి మాత్రం తిప్పలు తప్పవు. నిజానికి తిప్పలు అనేది చాలా చిన్నమాట.

2 thoughts on “ఏదైతే అదవుతుంది! -కార్టూన్

వ్యాఖ్యానించండి