అమెరికా నిఘాపై పిటిషన్ స్వీకరించిన సుప్రీం కోర్టు


NSA logo

NSA logo

భారత ప్రజల వ్యక్తిగత వివరాలను అక్రమంగా సేకరిస్తూ, వారి రోజువారీ సంభాషణలపై నిఘా పెడుతున్న అమెరికా పైన భారత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ కు అర్జెంటు హియరింగ్ ఇవ్వడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. అమెరికా మిలట్రీ గూఢచార సంస్ధ ఎన్.ఐ.ఏ భారతీయుల ఇంటర్నెట్ కార్యకలాపాల డేటాను ‘ప్రిజమ్’ అనే ప్రత్యేక ప్రోగ్రామ్ ద్వారా సేకరించడానికి ఇంటర్నెట్ కంపెనీలు అంగీకరించడం వలన భారత జాతీయ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని పిటిషనర్ ఆరోపించారు. ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయ శాస్త్ర విభాగం అధిపతి (Dean of Law Faculty) ప్రొఫెసర్ ఎస్.ఎన్.సింగ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.

ఆశ్చర్యం!

నిజానికి అమెరికా దాష్టీకం పైన కేంద్ర ప్రభుత్వం తనకు తానుగా చర్యలు తీసుకోవలసి ఉండగా అది జరగలేదు. విచిత్రంగా అమెరికా నిఘా పైన భారత ప్రభుత్వం ఆశ్చర్యం మాత్రం వెళ్ళబుచ్చి ఊరుకుంది. లక్షల కోట్ల రూపాయలను స్విస్ ఖాతాలకు తరలించిన ఘరానా దొంగల పేర్లను పార్లమెంటు సభ్యులకు చెప్పడానికి కూడా ‘జాతీయ భద్రత’ ను సాకుగా చూపే భారత ప్రభుత్వం వాస్తవంలో జాతీయ భద్రతకు తీవ్ర ఉల్లంఘన జరుగుతున్నా ‘ఆశ్చర్యం’ మాత్రమే ప్రకటించి ఊరుకోవడం ఎలా అర్ధం చేసుకోవాలి?

జస్టిస్ ఎ.కె.పట్నాయక్, జస్టిస్ రంజన్ గొగోయ్ లతో కూడిన డివిజన్ బెంచి పిటిషన్ ను అత్యవసరంగా వినడానికి అంగీకరించింది. వచ్చేవారం హియరింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపింది.

భారతీయులపై అంత భారీ మొత్తంలో అమెరికా గూఢచార సంస్ధలు నిర్వహిస్తున్న గూఢచర్యం వలన భారత దేశ జాతీయ భద్రతకు పెను ప్రమాదం ఏర్పడుతుందని పిటిషనర్ ఆరోపించారు. అందువలన సుప్రీం కోర్టు ఈ పిటిషన్ ను అత్యవసరంగా వినాలని కోరారు. ఇంటర్నెట్ కంపెనీలు భారతీయుల సమాచారాన్ని విదేశీ అధికార వ్యవస్ధతో అక్రమంగా పంచుకుంటోందని, ఇది భారత పౌరుల ఏకాంత హక్కును తీవ్రంగా ఉల్లంఘించడమేనని ప్రొఫెసర్ ఎస్.ఎన్.సింగ్ పిటిషన్ లో పేర్కొన్నారు.

ప్రిజమ్

“నివేదికల ప్రకారం, భారత దేశంలో వినియోగదారులతో కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న తొమ్మిది అమెరికన్ ఇంటర్నెట్ కంపెనీలు 6.3 బిలియన్ పత్రాల సమాచారాన్ని/డేటా ను అమెరికాకి చెందిన నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీ కి అందజేస్తోంది. భారత వినియోగదారుల బహిర్గత అంగీకారం లేకుండా కంపెనీలు ఇలా చేస్తున్నాయి. అమెరికా అధికార వ్యవస్ధలు అంత పెద్ద మొత్తంలో గూఢచార కార్యకలాపాలు నిర్వహించడం ఏకాంత ప్రమాణాలకు వ్యతిరేకమే కాకుండా (మన) జాతీయ భద్రతకు నష్టకరం కూడా” అని పిటిషనర్ పేర్కొన్నారు.

అడ్వొకేట్ విరాగ్ గుప్తా ద్వారా ఈ పిటిషన్ దాఖలయినట్లు తెలుస్తోంది. ప్రైవేటు ఇంటర్నెట్ కంపెనీల సేవలను భారత ప్రభుత్వ అధికారిక ఉత్తర, ప్రత్యుత్తరాల కోసం కూడా వినియోగిస్తున్నందున అవన్నీ అమెరికా గూఢచర్యం పరిస్ధితిలోకి వస్తాయనీ, ఇది భారత జాతీయ భద్రతను ఉల్లంఘించడమేనని ఎస్.కె.సింగ్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి చెందిన సున్నితమైన ఇంటర్నెట్ ఉత్తర ప్రత్యుత్తరాలను సంరక్షించడానికి సత్వరమే చర్యలు తీసుకొనేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. ఇవన్నీ ఇండియాకి బయట అమెరికాలోని సర్వర్లలో ఉంచబడ్డాయని తెలిపారు. అమెరికా గూఢచార సంస్ధలు, అమెరికాలోని ఇంటర్నెట్ కంపెనీల ద్వారా రహస్య నిఘా ప్రోగ్రామ్ ‘ప్రిజమ్’ ను వినియోగించి వీటిల్లోకి అక్రమంగా చట్ట విరుద్ధంగా జొరబడి సేకరిస్తున్నాయని తెలిపారు.

ఇండియాలో సర్వర్లు

అధికారిక ఉత్తర, ప్రత్యుత్తరాల కోసం ప్రభుత్వాలు గానీ, అధికారులు గానీ అమెరికా ఆధారిత ఇంటర్నెట్ కంపెనీలను వినియోగించకుండా నిరోధించాలని పిటిషనర్ కోరారు. అంతే కాకుండా ఇండియాలో వ్యాపారం చేస్తున్న ఇంటర్నెట్ కంపెనీలు భారతీయుల ఇంటర్నెట్ వినియోగ సమాచారాన్ని, సంభాషణలను నిర్వహించడానికి అమెరికాలో కాకుండా ఇండియాలోనే సర్వర్లు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తద్వారా ఇంటర్నెట్ కంపెనీలను భారత దేశ చట్టాల ద్వారా నియమ్తృంచడం సాధ్యపడుతుందని పిటిషనర్ తెలిపారు.

“దేశం యొక్క సార్వభౌమత్వం ప్రమాదంలో పడింది. ఎందుకంటే ప్రతివాది (కేంద్ర ప్రభుత్వం) నేరానికి పాల్పడిన ఇంటర్నెట్ కంపెనీలపై చర్యలు తీసుకోవడానికి ఎటువంటి ప్రయత్నము చేయడం లేదు” అని పిటిషనర్ తెలిపారు. తన వాదనకు మద్దతుగా అమెరికా ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జేమ్స్ ఆర్.క్లాపర్ ఒప్పుకోలును పిటిషనర్ ప్రస్తావించారు. అమెరికాకి బయట ఉన్న పౌరుల నిఘా సమాచారాన్ని ‘ఫెడరల్ ఇంటలిజెన్స్ సర్వైలెన్స్ యాక్ట్ (ఫిసా) లోని సెక్షన్ 702 క్రింద సేకరిస్తున్నామని క్లాపర్ పత్రికా ముఖంగా ధృవీకరించిన విషయాన్ని పిటిషనర్ గుర్తు చేశారు.

ఎన్.ఎస్.ఎ విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్ వెల్లడించిన రహస్య పత్రాల ఆధారంగా అమెరికా నిఘా పెట్టిన దేశాల్లో భారత దేశం అయిదో స్ధానంలో ఉన్నదని జాతీయ, అంతర్జాతీయ పత్రికలు తెలిపాయి. ప్రపంచవ్యాపిత ఇంటర్నెట్ డేటాను రోజువారీగా పర్యవేక్షిస్తూ భారీ మొత్తంలో డేటాను ఎన్.ఐ.ఎ నిల్వ చేసుకుంది. ఇలా సేకరించిన డేటా మొత్తంలో భారత దేశం అయిదో అతి పెద్ద స్ధానంలో ఉందని స్నోడెన్ వెల్లడించిన పత్రాలు స్పష్టం చేశాయి. అయినప్పటికీ వెల్లడి జరిగిన రోజుల తర్వాత కూడా భారత ప్రభుత్వం కుయ్, కయ్ మనలేదు. ఏమీ అనకపోతే బాగోదు అన్నట్లుగా ఆశ్చర్యం ప్రకటించి ఊరుకోవడం బట్టి భారత ప్రభుత్వం నిజంగా తన జాతీయ భద్రతకు ప్రమాదం వచ్చినపుడు ఏమి చేస్తుంది అన్న విషయంలో ఒక అవగాహనకు రావచ్చు.

One thought on “అమెరికా నిఘాపై పిటిషన్ స్వీకరించిన సుప్రీం కోర్టు

వ్యాఖ్యానించండి