బీహార్ కాంగ్రెస్: కిం కర్వ్తవ్యం? -కార్టూన్


The Hindu

The Hindu

జనతా దళ్ (యునైటెడ్) బీహార్ కాంగ్రెస్ కి పెద్ద చిక్కే తెచ్చిపెట్టినట్లుంది! ఆ పార్టీ మీదా, పార్టీ నాయకుల మీదా కాంగ్రెస్ పార్టీ అధినాయకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నప్పటికీ బీహార్ వరకు చూసుకుంటే ఒక సమస్య కాంగ్రెస్ ముందు నిలబడి ఉంది. ఎన్.డి.ఏ నుండి చీలిన జనతాదళ్ (యు)తో సఖ్యత పెంచుకోవడమా లేక ఎప్పటి నుండో కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తున్న రాష్ట్రీయ జనతా దళ్ తోనే స్నేహం కొనసాగించడమా?

పోనీ రెండింటితో సఖ్యత నెరుపుదామంటే ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు కదా!

నిన్నటిదాకా బి.జె.పితో నెయ్యం నెరిపిన జె.డి(యు), కాంగ్రెస్ దృష్టిలో ఇప్పుడు అకస్మాత్తుగా సెక్యులర్ శక్తిగా అవతరించడం ప్రజలు గమనించాల్సిన విషయం. జె.డి(యు) సెక్యులర్ పార్టీ అని ప్రధాని మన్మోహన్ ప్రశంసలు కురిపిస్తుండగా, ప్రధాని అంతటి వ్యక్తి తమను సెక్యులర్ శక్తిగా భావించడం తమ అదృష్టం అని నితీశ్ కుమార్ మురిసిపోతున్నారు.

భారత దేశంలో తన అర్ధాన్ని పూర్తిగా కోల్పోయిన రాజకీయ పారిభాషక పదం ఏదన్నా ఉందంటే అది ‘సెక్యులరిజం’ లేదా ‘లౌకిక వాదం.’

ఇంతకీ బీహార్ ముస్లింలు జాతీయ స్ధాయిలో పార్లమెంటరీ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. వారి ఓట్లు అటు లాలూ ప్రసాద్ యాదవ్ కి కావాలి. ఇటు నితీశ్ కుమార్ కి కావాలి. వారి ద్వారా కాంగ్రెస్ పార్టీకి కూడా కావాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో (2010) ఫలితాలను బట్టి చూస్తే కాంగ్రెస్, ఆర్.జె.డి లు సోదిలోకి కూడా లేకుండా పోయాయి. జె.డి(యు), బి.జె.పి ల కూటమి ఏకంగా 85 శాతం సీట్లు (118 + 91)  గెలుచుకున్నాయి. కొద్దో గొప్పో సీట్లతో ఆర్.జె.డి (25) మెరుగు అనిపించుకోగా కాంగ్రెస్ పార్టీ నాలుగు సీట్లతో సరిపెట్టుకుంది. కాబట్టి ఆర్.జె.డి కంటే జె.డి(యు) పార్టీయే బెటరని కాంగ్రెస్ భావిస్తుందా?

కానీ 2010 ఫలితాలే మళ్ళీ 2014లో కూడా వస్తాయని గ్యారంటీ లేదు. మారిన పరిస్ధితుల్లో బీహార్ ప్రజలు బి.జె.పికి మద్దతిస్తారా లేక జె.డి(యు) కి మద్దతిస్తారా అన్నది చెప్పడం ఒకింత కష్టమే. అందుకే అక్కడి ముస్లిం ఓట్ల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. మోడి సారధ్యంలోని బి.జె.పితో జతకడితే ముస్లిం ఓట్లు కోల్పోవలసి వస్తుందని జె.డి(యు) భయం.

ఎన్నికలకీ ఇంకా సమయం ఉంది కనుక ఏ కత్తిని ‘చేత’ పట్టాలో కాంగ్రెస్ అప్పుడే నిర్ణయించకపోవచ్చు. కానీ ఈలోపు బీహార్ రాజకీయాలు జనానికి ఒకింత వినోదం పంచే అవకాశాలు లేకపోలేదు.

One thought on “బీహార్ కాంగ్రెస్: కిం కర్వ్తవ్యం? -కార్టూన్

  1. భావదారిద్ర్యం పార్టీలలో ప్రష్పుటంగా కనిపిస్తొంది.అవకాశవాద పార్టీలకు బుద్ధిచెప్పేదెలా?

వ్యాఖ్యానించండి