ఎన్.డి.ఎ కి జె.డి(యు) రామ్ రామ్


Nitish

పత్రికలు ఊహించినట్లే జరిగింది. జనతాదళ్ (యునైటెడ్) పార్టీ జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్.డి.ఎ) కి రామ్ రామ్ చెప్పేసింది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ప్రధాని అభ్యర్ధిగా బి.జె.పి పరోక్షంగా ప్రకటించిన వారం రోజులకి ఆ పార్టీ ప్రతిపక్ష కూటమి నుండి బిచాణా ఎత్తేసింది. ప్రస్తుత పాలక్ష కూటమి లోకి ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులోనైనా చేరుతుందో లేదో గానీ ఇప్పటికైతే బీహార్ లో పరిస్ధితిని సవరించుకునేలో పడింది. బి.జె.పి మంత్రులను మంత్రివర్గం నుండి తొలగించి జూన్ 19 తేదీన విశ్వాస పరీక్ష జరపనున్నట్లు ప్రకటించింది.

పోయిన ఆదివారం గోవాలో జరిగిన బి.జె.పి జాతీయ కార్యవర్గ సమావేశాల అనంతరం జరిగిన పరిణామాలు తమకు అసంతృప్తి కలిగించాయని జె.డి(యు) నేత శరద్ యాదవ్ విలేఖరులకు తెలిపారు. ఎన్.డి.ఏ స్ధాపన సమయంలో అంగీకరించిన జాతీయ అజెండాకు విరుద్ధంగా ఈ పరిణామాలు ఉండడంతో బి.జె.పి తో పుట్టును తాము సమీక్షించుకోవాల్సి వచ్చిందని ఆయన పునరుద్ఘాటించారు. ఎన్.డి.ఏ చీలికకు బి.జె.పియే బాధ్యత వహించాలని ఆయనతో పాటు నితీశ్ కుమార్ కూడా నొక్కి చెప్పారు. బైటికి రాక తప్పని పరిస్ధితి కల్పించారని వారు తెలిపారు.

జె.డి(యు) చీలికతో ఎన్.డి.ఏ లో ఇప్పుడు మూడు పార్టీలు మాత్రమే ఉన్నాయి. బి.జె.పి కాక శివ సేన శిరోమణి అకాలీ దళ్ (ఎస్.ఏ.డి). వీటిలో మోడి ప్రధానమంత్రి అభ్యర్ధిత్వానికి అంగీకరించబోమని శివసేన గతంలో తెలిపింది. ఇప్పటికీ వారు అదే అవగాహన ఉన్నారా లేదా అన్నది తెలియలేదు. బి.జె.పి పార్లమెంటరీ ప్రచార కమిటీకి సారధ్య బాధ్యతలు నరేంద్ర మోడీకి అప్పగించడం అంటే ఆయనను ప్రధాన మంత్రి అభ్యర్ధిగా ప్రకటించడమేనని జె.డి(యు) భావిస్తోంది. ప్రధార కమిటీ సారధ్యం, ప్రధాని అభ్యర్ధిత్వానికి కేవలం ఒక్క అడుగు మాత్రమే దూరమని పత్రికలు కూడా చెబుతున్నాయి. దీనిని బి.జె.పి నిరాకరించడం లేదు కూడా.

అయితే ఎన్.డి.ఎ చీలిక విషయంలో శివసేన బి.జె.పితోనే ఉన్నట్లు ప్రకటించింది. జె.డి(యు) వెళ్లిపోవడం వలన ఎన్.డి.ఎ కి ఎమీ కాదు అని చెబుతూనే ఎన్.డి.ఎ లోని భాగస్వామ్య పక్షాలన్నింటికీ ఈ పరిణామం నష్టకరం అని శివసేన ప్రతినిధి భరత్ కుమార్ విలేఖరులతో అన్నారు. పదకొండు నెలల ముందుగానే ఇది జరగడం ఒక విధంగా మంచిదే అని ఆయన సంతోషం ప్రకటించారు.

జె.డి(యు) చీలికతో 17 సంవత్సరాల ఎన్.డి.ఏ భవితవ్యంపై సందిగ్ధం నెలకొంది. మరోవైపు బీహార్ లో జె.డి(యు), బి.జె.పి లు అప్పుడే కత్తులు దూస్తున్నాయి. రాష్ట్ర మంత్రివర్గంలోని 11 మంది బి.జె.పి మంత్రులను నితీశ్ తొలగించారు. బి.జె.పి అవసరం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం నిలబడుతుందని నితీశ్ చెబుతున్నారు. ఆ మేరకు ఇండిపెండెంట్ల మద్దతు ఇప్పటికే సంపాదించిన నితీశ్ జూన్ 19 తేదీన విశ్వాస పరీక్ష జర్పనున్నట్లు తెలిపారు. విశ్వాస పరీక్షలో నెగ్గితే తమ చర్యకు (ఎన్.డి.ఏ నుండి బైటికి రావడం) ప్రజల నుండి మద్దతు వచ్చినట్లేనని ఆయన ఒక విడ్డూరమైన ప్రకటన చేశారు.

“మా మౌలిక సూత్రాల విషయంలో మేము రాజీ పడలేము. పరిణామాల గురించి మాకు బాధ లేదు. ఈ కూటమి బీహార్-కేంద్రకంగా ఉన్నన్నాళ్లూ ఏ సమస్యా లేకుండా గడిచింది. కానీ ఇప్పుడు మా ముందు మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. బాధ్యత మాది కాదు. ఈ నిర్ణయం తీసుకోక మాకు తప్పలేదు.” అని నితీశ్ కుమార్ నరేంద్ర మోడిని పరోక్షంగా ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారని ది హిందూ తెలిపింది.

“బి.జె.పి కొత్త దశగుండా ప్రయాణిస్తోంది. బీహార్ కూటమిలో బైటి వ్యక్తుల జోక్యం లేనంతవరకూ అది సున్నితంగా సాగింది” అని నితీశ్ అన్నారు. మోడి పేరు ఒక్క సారి కూడా ఎత్తకుండానే ఆయనను ఉద్దేశిస్తూ ఆయన పలుమార్లు వ్యాఖ్యానించారని పత్రికలు తెలిపాయి.

గుజరాత్ ముస్లింలపై మారణ హోమం సాగించడం ద్వారా మోడి జాతీయంగానే కాక, అంతర్జాతీయంగా కూడా ప్రముఖ మైన వ్యక్తిగా పేరు పొందడంలో సఫలం అయ్యారు. ప్రజలను కలిపి ఉంచి సకల వర్గాల ప్రజలకూ మేలు జరిగే విధంగా పాలించేవారు కాకుండా వారిని విడగొట్టి, రెచ్చగొట్టి మారన హోమాలు నిర్వహించడం ద్వారా ప్రముఖ స్ధానాన్ని పొందే పరిస్ధితులు నేటి ప్రపంచంలో ఉండడం ఒక విషాధం. ప్రజలందరినీ కలిపి ఉంచగల పాలకులు, ప్రజల ప్రయోజనాలే పరమార్ధంగా పాలించే పాలకులు లేకపోవడం ఈ పరిస్ధితికి ఒక కారణం.

వ్యాఖ్యానించండి