మొదటి భాగం తరువాయి………….
–
మీరు దీనికోసం పధకం వేస్తున్నారని మీ కుటుంబానికి తెలుసా?
లేదు. ఏం జరుగుతోందో నా కుటుంబానికి తెలియదు. ప్రధానంగా నా భయం ఏమిటంటే వారు కుటుంబం వెంటపడతారు. నా మిత్రులు, నా భాగస్వామి… ఇలా నా సంబంధీకులను అందర్నీ వేధిస్తారు… నా మిగిలిన జీవితంలో ఈ వాస్తవంతో నేను బతకాల్సి ఉంటుంది. వారితో సంభాషించే అవకాశం నాకు ఇక ఉండదు. వాళ్ళు (అధికార వర్గాలు) నేను తెలిసిన ప్రతి ఒక్కరిపైనా తీవ్ర చర్యలకు పాల్పడతారు. నన్ను ఇది రాత్రుల్లో కూడా మెలకువగా ఉంచుతోంది.
పత్రాలను లీక్ చేయాలని ఎప్పుడనుకున్నారు?
మనసును వేధించే విషయాలను మీరు చూస్తారు. మీరు అదంతా చూశాక వీటిలో కొన్ని విషయాలు దుర్వినియోగం కిందికి వస్తాయని మీకు అర్ధం అవుతుంది. తప్పు చేస్తున్నామన్న భావన క్రమంగా మీలో పేరుకుపోతుంది. ఒక ఉదయాన లేచి ఇలా చెయ్యాలి అని నిర్ణయించుకోవడం అంటూ ఏమీ లేదు. అది ఒక సహజ పరిణామం. 2008లో అనేకమంది ఒబామాకు ఓటు వేశారు. నేనాయనకు ఓటెయ్యలేదు. మూడో పార్టీకి ఓటు వేశాను. కానీ ఒబామా హామీలపైన నమ్మకం పెట్టుకున్నాను. నిజానికి నేను (అప్పుడే) వెల్లడి చేయడానికి సిద్ధపడ్డాను (కానీ ఒబామా గెలుపు వల్ల ఆగిపోయాను.) ఆయన తన ముందరి అధ్యక్షుడి విధానాలనే కొనసాగించారు.
పత్రాల వెల్లడి పట్ల వ్యక్తమైన సాధారణ స్పందన గురించి చెప్పండి?
నేను ఆశ్చర్యానికి లోనయ్యాను. భద్రత పేరుతో అణచివేతకు గురవుతున్న ఈ హక్కుల రక్షణ కోసం ప్రజలు చాలా శక్తివంతంగా స్పందించడం చూసి సంతోషిస్తున్నాను. ‘ఆక్యుపై వాల్ స్ట్రీట్’ ఉద్యమం లాంటిది కాదు గానీ, (అమెరికా రాజ్యాంగ) నాలుగవ సవరణ రక్షణ కోసం “నాల్గవ సవరణను పునరుద్ధరించండి” పేరుతో జులై 4 తేదీన (అమెరికా ఇండిపెండెన్స్ డే) ఒక మౌలిక ఉద్యమం వీధుల్లోకి రాబోతోంది. రెడ్డిట్ (Reddit) ద్వారా ఆ ఉద్యమం ఉద్భవించింది. అంతర్జాలంలోనైతే స్పందన భారీగానూ, మద్దతుగానూ ఉంటోంది.
భద్రత, బహిరంగత్వం (openness) ల మధ్య సమతూకం పాటించడంపై చర్చను ఆహ్వానిస్తూ, పత్రాల వెల్లడిని ఖండిస్తూ ఒబామా స్పందించిన తీరుపై మీ ప్రతిస్పందన ఏమిటి?
నాకు వెంటనే ఏమనిపించిందంటే, దానిని సమర్ధించుకోడానికి ఆయన తానే ఇబ్బందిపడుతున్నారు. సమర్ధించుకోలేని దానిని సమర్ధించడానికి ఆయన ప్రయత్నించారు. ఆ సంగతి ఆయనకు తెలుసు.
వాషింగ్టన్ లోని విదేశీ వ్యవహారాల విశ్లేషకులు స్టీవ్ క్లెమాన్స్ డల్లాస్ విమానాశ్రయం వద్ద నలుగురు గూఢచారులు మాట్లాడుకుంటుండగా విన్న విషయాలను చెప్పారు. వాళ్ళు అంతకుముందే హాజరైన ఇంటలిజెన్స్ సమావేశం గురించి వారు చర్చించుకున్నారు. క్లెమాన్స్ ప్రకారం లీక్స్ గురించి చర్చించుకుంటూ వాళ్ళలో ఒకాయన రిపోర్టర్, లీకర్ ఇద్దరినీ “మాయం చెయ్యాలి” అని అన్నాడట?
ఈ కధనానికి స్పందిస్తూ కొందరు ‘నిజమైన గూఢచారులు అలా మాట్లాడరు’ అని అంటున్నారు. నేనూ గూఢచారినే కదా! గూఢచారులు అలానే మాట్లాడతారు. ఆఫీసులో నేరాలను ఎలా అరికట్టాలి అన్న చర్చ వచ్చినప్పుడల్లా, చట్ట బద్ధ ప్రక్రియను వారు సమర్ధించరు – నిర్ణయాత్మక చర్యలనే వాళ్ళు సమర్ధిస్తారు.
అలాంటివారిని కోర్టులో ప్రవేశపెట్టడం కంటే విమానం నుండి బైటికి తోసేయ్యడమే మంచిదని వారు చెబుతారు. సాధారణంగా నియంతృత్వ పూరితమైన మైండ్ సెట్ తోనే వాళ్ళు ఉంటారు.
మీ దృష్టిలో పధకం ఏమైనా ఉన్నదా?
నేను చేయగల పనల్లా ఒక్కటే. ఇక్కడే ఉండి హాంగ్ కాంగ్ ప్రభుత్వం నన్ను తరలించకుండా ఉంటుందని ఆశించడం… సమ విలువలను కలిగి ఉన్న దేశంలో రాజకీయాశ్రయం పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాంటివి ఉన్న దేశాల్లో మొదటిది ఐస్ లాండ్. అంతర్జాల స్వేచ్ఛను కోరుకునేవారికి వారు మద్దతుగా నిలిచారు. నా భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్న ఆలోచన నాకు లేదు. వాళ్ళు ఇంటర్ పోల్ నోట్ జారీ చేయవచ్చు. కానీ అమెరికా పరిధికి ఆవల నేను నేరం చేశానని అనుకోవడం లేదు. అలాంటిది జరిగితే అది రాజకీయ స్వభావంతోనే కూడుకుని ఉంటుంది.
బహుశా మీరు చివరికి జైలులో తేలవచ్చేమో…
జైలు లాంటి ప్రమాదాన్ని ఊహించి ఆమోదించకుండా ఇలాంటి పనిని నేను చేయలేను. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన గూఢచార సంస్ధలకు ఎదురొడ్డి నిలిచి ప్రమాదం జరగదని ఎలా అనుకుంటాను. నిన్ను పట్టుకోవాలన్న కృత నిశ్చయంతో ఉన్నట్లయితే రేపయినా వారది సాధిస్తారు.
మొదటి లీక్ వెల్లడి అయ్యి దాదాపు వారం కావస్తోంది. ఇప్పుడు ఏమనిపిస్తోంది?
వ్యక్తం అవుతున్న ఆగ్రహావేశాలను చూస్తే నేను చేసింది సరైందే అనిపిస్తోంది. నాకు ఏదైనా జరగొచ్చు గాక, అంతిమ ఫలితం అమెరికాకు సానుకూలంగానే ఉంటుందని నాకిప్పుడు నమ్మకం కలుగుతోంది. నేను మళ్ళీ ఇంటికి వెళ్లడమే నాకు కావలసింది, కానీ అది జరగదని నాకు తెలుసు.
…………………అయిపోయింది
