బి.జె.పి అంతర్గత సంక్షోభం పై ది హిందూ పత్రిక స్ధిరంగా కేంద్రీకరించి కార్టూన్ లు ప్రచురిస్తోంది. గత పది రోజుల్లో ప్రచురించబడిన పది కార్టూన్ లలో ఆరు బి.జె.పి, ఆ పార్టీ నాయకులపైనే కావడం బట్టి ఈ సంగతి తెలుస్తోంది. ఈ ఆరింటిలో ఐదు కార్టూన్లు అంతర్గత సంక్షోభం పైన గీసినవే.
పార్టీ పదవులకు రాజీనామా ద్వారా అద్వానీ ఏమి సాధించదలిచారు? పోనీ ఏమి సాధించారు? ఆవేశంతో రాజీనామా విసిరి కొట్టిన అద్వానీ తీరా ఆర్.ఎస్.ఎస్ ఆదేశాలతో వెనక్కి తగ్గడమే కాకుండా ఎన్.డి.ఏ విచ్ఛిన్నం కాకుండా ఉండడానికి పడరాని పాట్లు పడుతున్నట్లు కనిపిస్తున్నారు.
అద్వానీ రాజీనామా కూర్చున్న కొమ్మను నరుక్కోవడమేనని, ఆర్.ఎస్.ఎస్ పూనుకుని అద్వానీని కనీసం ఆ పనిని కూడా సరిగ్గా చేయనివ్వలేదని కార్టూనిస్టు సూచిస్తున్నట్లుంది. నరుక్కున్న కొమ్మపైనే అద్వానీ కొనసాగి ఉన్నట్లయితే ఆయన నడుములు విరిగి ఉండేవి. బి.జె.పి వృక్షానికి తిరిగి కట్టేయడం ద్వారా అలా విరక్కుండా ఆయన్ని ఆర్.ఎస్.ఎస్ కాపాడిందా?
తీవ్ర స్ధాయిలో జరిగిన చర్చల పర్యవసానంగా ఎటువంటి ఒప్పందమూ లేకుండానే అద్వానీ వెనక్కి తగ్గారా అన్న విషయమై సందేహాలు కొనసాగుతున్నాయి. వీటికి సమాధానాలు ఇప్పుడు దొరక్కపోయినా భవిష్యత్తులో అయినా దొరకక మానవు.
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రాంతీయ పార్టీలు అనేకం సుముఖంగా ఉన్నట్లు చానెళ్లు చెబుతున్నాయి. మమత (బెంగాల్), నవీన్ (ఒడిశా), నితీశ్ (బీహార్) లకు తోడు చంద్రబాబు నాయుడు (ఆంధ్ర ప్రదేశ్), అఖిలేష్ యాదవ్ (ఉత్తర ప్రదేశ్), జయలలిత (తమిళనాడు), కుమార స్వామి (కర్ణాటక) లు కూడా టి.వి తెరల ముందు ఫెడరల్ ఫ్రంట్ కు సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. అయితే ఫ్రంటు ఒక రూపం సంతరించుకోలేదని, ఇంకా ఐడియా గానే ఉందనీ వారు చెబుతున్నా, ఈ టి.వి లాంటి చానెళ్లు దానిని ఖాయం చేస్తున్నాయి.
కాంగ్రెసేతర, బి.జె.పి యేతర వ్యక్తి ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అద్వానీ నెలల క్రితమే తన బ్లాగ్ పోస్టు ద్వారా జోస్యం చెప్పి ఉన్నందున అడుగులు అటువైపు పడుతున్నాయా అనుకున్నా, మరి ప్రధాని అభ్యర్ధి ఎవరన్నది వారికి కూడా సమస్యే.
