
అమెరికా హ్యాకింగ్ కి గురయ్యే దేశాల్లో భారత దేశ ప్రజలు ఐదవ స్ధానంలో ఉన్నారని స్నోడెన్ లీక్ చేసిన ఈ మ్యాప్ చెబుతోంది. ఇండియా తన మిత్ర దేశం అని అమెరికా చెప్పేది అబద్ధమా?
అమెరికా రహస్య గూఢచార సంస్ధ ‘నేషనల్ ఇన్వేస్టిగేటివ్ ఏజన్సీ’ (ఎన్.ఐ.ఎ) అక్రమాల గుట్టు విప్పిన ఎడ్వర్డ్ స్నోడెన్ ది గార్డియన్ పత్రిక విలేఖరులు గ్లెన్ గ్రీన్ వాల్డ్, ఎవెన్ మకాస్కిల్ లకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇది. ది హిందు పత్రిక మూడు రోజుల క్రితం దీనిని పునర్ముద్రించింది. తాను ఎందుకు ఎన్.ఎస్.ఎ అక్రమాలను బైటపెట్టవలసి వచ్చింది, ఆర్ధికంగా ఉన్నతమైన తన ప్రామిసింగ్ కెరీర్ ని ఎందుకు వదులుకున్నదీ ఆయన ఇందులో వివరించారు. ఉగ్రవాదం కొత్తగా పుట్టిందేమీ కాదనీ, దాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల నిత్య సంభాషణలపై నిఘా పెట్టాల్సిన అవసరం లేదని ఆయన చెబుతున్నారు. మామూలు పోలీసు పనితో బోస్టన్ ఉగ్రవాద దాడుల దోషులను కనిపెట్టారని, దానికి ఇంత భారీ నిఘా ఉపయోగపడలేదంటున్న స్నోడెన్ విజిల్ బ్లోయింగ్ ప్రపంచంలో ఇప్పటికే ప్రకంపనలు సృష్టిస్తోంది.
*** *** ***
మీరు విజిల్-బ్లోయర్ గా ఎందుకు మారారు?
దాదాపు ప్రతి దాన్నీ అడ్డుకొని వినగలగడానికి వీలుగా ఒక వ్యవస్ధను ఎన్.ఎస్.ఎ అభివృద్ధి చేసింది. ఈ సామర్ధ్యం ద్వారా భారీ మొత్తంలోని మానవ సంభాషణలు, ఒక టార్గెట్ అనేది లేకుండా, సమస్తం ఆటోమేటిక్ గా జీర్ణం అయిపోతాయి. మీ ఈ మెయిళ్లను నేను చూడాలనుకున్నా లేదా మీ భార్య ఫోన్ వినాలనుకున్నా నేను చేయవలసిందల్లా ఒక్కటే, అడ్డగించే పరికరాలను (intercepts) ఉపయోగించడం. మీ ఈమెయిళ్ళు, సంకేత పదాలు (paaswords), ఫోన్ రికార్డులు, క్రెడిట్ కార్డులు అన్నింటినీ నేను (ఎన్.ఎస్.ఎ గూఢచారిగా) సంపాదించగలను.
ఇటువంటి తరహా పనులు జరిగే సమాజంలో నేను నివసించాలనుకోవడం లేదు… నేను చేసే ప్రతి పనీ, నేను మాట్లాడే ప్రతి మాటా రికార్డయ్యే ప్రపంచంలో నేను నివసించలేను. నేను మద్దతు ఇవ్వాలనుకుంటున్నదీ, లేదా నివసించాలనుకుంటున్నదీ అది కాదు.
కానీ బోస్టన్ ఉగ్రవాద దాడుల వంటివి జరిగే అవకాశాలను తగ్గించడానికి ప్రయత్నించాలంటే నిఘా పెట్టాల్సిన అవసరం లేదంటారా?
ఉగ్రవాదం కొత్త ప్రమాదంగా ఎందుకు అవతరించిందో మొదట మనం నిర్ణయించాలి. నిజానికి ఉగ్రవాదం అనేది ఎప్పుడూ ఉంది. బోస్టన్ (పేలుళ్లు) నేరపూరిత చర్య. అదేమీ నిఘాకు సంబంధించినది కాదు. కేవలం పాత తరహా పోలీసు పని దానికి సరిపోయింది. పోలీసులు తాము చేసే పనిలో ఎప్పుడూ ప్రతిభావంతంగానే ఉన్నారు.
మీరు మిమ్మల్ని మరో బ్రాడ్లీ మ్యానింగ్ గా చూస్తున్నారా?
మ్యానింగ్, ఓ గొప్ప విజిల్-బ్లోయర్. ప్రజలకు మంచి జరగాలన్న ఆకాంక్ష నుండి ఆయన స్ఫూర్తి పొందారు.
మీరు చేసింది నేరమా?
ప్రభుత్వం వైపు నుండి మనం ఇప్పటికే సరిపోయినంత నేరతత్వాన్ని చూసి ఉన్నాము. నా మీద ఇటువంటి ఆరోపణ చేయడమే హిపోక్రసీ. ప్రజలు ప్రభావితం చేయగల అవకాశాలను వారు బాగా కుదించివేశారు.
మీకు ఏం జరగనుందని భావిస్తున్నారు?
అంత మంచి అయితే కాదు.
హాంగ్ కాంగ్ ఎందుకు?
స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలకు తక్కువ అవకాశం ఉంటుందని పేరున్న చోటుకు ఒక అమెరికన్ తరలిపోవలసి రావడం నిజంగా ఒక విషాదం. అయినప్పటికీ, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో భాగమే అయినా, హాంగ్ కాంగ్, స్వేచ్ఛకు పేరెన్నిక కలిగినదే. శక్తివంతమైన భావ ప్రకటనా స్వేచ్ఛ దానికి సంప్రదాయంగా ఉంటోంది.
లీక్ చేయబడిన పత్రాలు ఏ విషయాలను వెల్లడిస్తున్నాయి?
అమెరికాలో తాను సాగిస్తున్న నిఘా విస్తృతికి సంబంధించి, కాంగ్రెస్ (అమెరికా ప్రతినిధుల సభ) విచారణలకు ప్రతిస్పందనగా ఎన్.ఎస్.ఏ పదే పదే అబద్ధాలు చెబుతోందని పత్రాలు వెల్లడిస్తున్నాయి. దీని పరిమాణం గురించి (సెనేటర్ రాన్) వేడెన్, (సెనేటర్ మార్క్) ఉడాల్ లు అడిగినపుడు, వాళ్ళు (ఎన్.ఎస్.ఏ) దానికి సమాధానం ఇవ్వడానికి తగిన పరికరాలు తమకు అందుబాటులో లేవని చెప్పారు. కానీ వాస్తవంలో మా వద్ద తగిన పరికరాలు ఉన్నాయి. ఏ దేశ ప్రజలు అత్యధికంగా పరీక్షకు (scrutinise) గురయ్యారో చెప్పే పటాలు కూడా నావద్ద ఉన్నాయి. రష్యన్ల కంటే అమెరికన్ల డిజిటల్ కమ్యూనికేషన్లనే మేము (ఎన్.ఎస్.ఏ) ఎక్కువగా సేకరిస్తాము.
మరి చైనా హ్యాకింగ్ పైన ఒబామా ప్రభుత్వ నిరసనల సంగతి ఏమిటి?
మేము ప్రతి చోటా ప్రతి ఒక్కరినీ హ్యాక్ చేస్తాం. మేము, ఇతరులు అనే తేడాను చూడడం అంటే మాకు యిష్టం. కానీ ప్రపంచంలో దాదాపు ప్రతి దేశంలోనూ మేమున్నాం. ఈ దేశాలతో మేము యుద్ధంలో లేము కదా.
ప్రభుత్వ నిఘా నుండి రక్షణ పొందడానికి ఏదైనా భద్రతను ఏర్పాటు చేసుకోవడం సాధ్యమేనా?
ఏది సాధ్యమో కూడా కనీసం తెలుసుకోలేని పరిస్ధితుల్లో మీరున్నారు. వారి సామర్ధ్యం యొక్క విస్తృతి భీతి గొలుపుతుంది. మెషిన్స్ (కంప్యూటర్స్) లో కంప్యూటర్ క్రిమి (బగ్స్) ని ప్రవేశపెట్టగలం. (ఆ తర్వాత) మీరు నెట్ వర్క్ లో ప్రవేశించడం అంటూ జరిగాక మీ మెషీన్ ని తేలికగా గుర్తించగలం. మీరు ఎన్ని రక్షణలు ఏర్పాటు చేసుకున్నా మీరు ఎప్పుడూ భద్రంగా ఉండలేరు.
………………ఇంకా ఉంది.