బి.జె.పి అధ్యక్షుడి కర్తవ్య నిర్వహణ ఇప్పుడు కత్తి మీది సాము అయింది. కాదు, కాదు… కత్తి మీద సవారీ అయింది. ఆయన అటు ఎన్.డి.ఏ పక్షాలను దారికి తెచ్చుకోవాలి. ఇటు బి.జె.పి లోని నాయకులను ఒక దారిలో నడిచేట్లు చేయగలగాలి. అద్వానీ తిరుగుబాటుతో బి.జె.పి లోని చీలికలు స్పష్టంగా లోకానికి తెలిసి వచ్చాయి. ఇన్నాళ్లూ ఊహాగానాలతో సాగుతూ, బి.జె.పి నాయకుల తిరస్కరణలతో కప్పి ఉంచబడిన బి.జె.పి లుకలుకలకు అద్వానీ తిరుగుబాటు అచ్చమైన జీవం పోసింది.
ఆర్.ఎస్.ఎస్ జోక్యంతో సంక్షోభం తాత్కాలికంగా సద్దుమణిగినట్లు కనిపిస్తున్నా, ప్రధాని పీఠం దగ్గరికి వచ్చేసరికి అవి మళ్ళీ రేగడం ఖాయంగా కనిపిస్తోంది. అద్వానీ ప్రధాని అభ్యర్ధి కాకపోతే, మోడీయే ప్రధాని అభ్యర్ధి అని బి.జె.పి నిర్ణయిస్తే తాము ఎన్.డి.ఏ లో ఉండడం కష్టమేనని ఎన్.డి.ఏ కూటమి కన్వీనర్ శరద్ యాదవే ప్రకటించేశారు. ఇప్పటికీ అవే అభిప్రాయాలను వారు కొనసాగిస్తున్నారు. బీహార్ లోని ముస్లిం ఓట్ల కోసం లాలూ ప్రసాద్ యాదవ్ పొంచి ఉన్నందున మోడిని ఆమోదించే పరిస్ధితి జె.డి(యు) కి లేదు. కాబట్టి మోడీ, బి.జె.పి ప్రచార సారధిగా ఉండగా జె.డి(యు) ని ఎన్.డి.ఏ లో నిలపడం కష్టమే కావచ్చు.
మరో వైపు బి.జె.పి లోనే మోడి, అద్వానీ శిబిరాలు స్పష్టంగా వ్యక్తం అవుతున్నాయి. ప్రజా పాలన, ప్రజల సమస్యలు ప్రధాన కర్తవ్యం కానీ పార్టీలకు పదవీ రాజకీయాలే ప్రాణ సమానం. కాబట్టి అద్వానీ తిరుగుబాటు మరో రూపంలో కొనసాగే సూచనలే కనిపిస్తున్నాయి. ఇంకో వైపు మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, నితీశ్ కుమార్ లు ఫెడరల్ ఫ్రంట్ అంటూ కొత్త పల్లవి అందుకుని అందుకోసం చురుకుగా కృషి చేస్తున్నారు. ఎన్.డి.ఏ లోనే కొనసాగాలని అద్వానీ కోరుతున్నా ఆ కోరికలో ఎంత నిజాయితీ ఉన్నదో అనుమానమే.
ఫెడరల్ ఫ్రంట్ గనుక విజయవంతం అయితే కాంగ్రెస్, బి.జె.పి లకు అధికారం ఈసారి అందని పండే కావచ్చు. కాంగ్రెస్, బి.జె.పి పార్టీలు కాకుండా మూడో పక్షానికి చెందిన అభ్యర్ధి ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అద్వానీ అనేక నెలలముందే తన బ్లాగ్ లో రాయడం ఎందుకో బహుశా ఇప్పుడు స్పష్టంగా ప్రజలు అర్ధం చేసుకోవాలనుకుంటాను.
