అందినట్టే అంది ఎగిరిపోయిందా!… -కార్టూన్


The Hindu

The Hindu

పాపం అద్వానీ! ఎన్ని ఎత్తులు, ఎన్ని పై ఎత్తులు! ఎన్ని ఎదురు చూపులు, ఆ ప్రధాని కుర్చీకోసం? తనను మించిన సీనియర్ పార్టీలో లేకపోయినా, జనంలో బహుశా తనకు మించిన ఆమోదనీయత కూడా పార్టీలో ఎవరికీ లేకపోయినా ఆ ప్రధాని కుర్చీ మాత్రం అద్వానీకి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. రానున్న పార్లమెంటరీ ఎన్నికలకు గాను ప్రచార కమిటీ సారధ్య బాధ్యతలను నరేంద్ర మోడీకి అపజెప్పడం ద్వారా బి.జె.పి జాతీయ కార్యవర్గం తమ ప్రధాని అభ్యర్ధి ఎవరో చెప్పినట్లేనని పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి.

శని, ఆదివారాల్లో జరిగిన బి.జె.పి జాతీయ కార్యవర్గ సమావేశాలలో అద్వానీ మరియు ఆయన అనుచరుల గైర్హాజరీలో ఈ మేరకు నిర్ణయం జరిగిపోయింది. అద్వానీ ఆశీర్వాదం తాను ఫోన్ ద్వారా తీసుకున్నానని మోడి ట్విట్టర్ పేజీలో కూసినా అద్వానీ మాత్రం దానిని ధృవీకరించలేదు. రాత్రి పూట వీడియో ద్వారా పార్టీ కార్యకర్తలకు ప్రకటన జారీ చేసిన అద్వానీ అసలు మోడి ఊసే ఎత్తలేదు. మూడు రోజులుగా విరోచనాలతో బాధపడుతుండడం వలన మొదటిసారిగా జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరు కాలేకపోయాయని కార్యకర్తలు తనను క్షమించాలని ఆయన కోరారు తప్ప మోడి చెప్పుకున్నట్లు తన ఆశీర్వాదం ఆయనకి ఉన్నట్లు అద్వానీ చెప్పలేదు.

అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్, మరో నాయకుడు వెంకయ్య నాయుడు లు కూడా తాము అద్వానితో చర్చించామని, ఆ తర్వాతే మోడీకి బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అద్వానీ ఆ విషయం కూడా ధృవీకరించలేదు. పైగా అద్వానితో ఎవరూ చర్చించలేదని ఆయన సన్నిహితులను ఉటంకిస్తూ ది హిందు పత్రిక తెలిపింది. అద్వానీకి సన్నిహితురాలిగా పేరు పొందిన సుష్మా స్వరాజ్ మోడి ఎన్నిక గురించి వ్యాఖ్యానించాల్సిందిగా పత్రికలు కోరగా ఆమె అందుకు అనిరాకరించడం విశేషం. మరో పక్క మరో గైర్హాజరీదారు యశ్వంత్ సిన్హా తాను మోడి వ్యతిరేకిని కాదంటూనే ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పలేకపోయారు.

అయితే ప్రచార కమిటీకి నాయకత్వం వహించినవారే ప్రధాని పదవిని అధిష్టించనున్నారా అనేది స్పష్టంగా తేలలేదు. ప్రచార కమిటీ బాధ్యతలు నిర్వహించినవారే సాధారణంగా ప్రధాని పదవిని అధిస్టిస్తారని, కానీ దానికి విరుద్ధంగా కూడా జరిగే అవకాశాలు లేకపోలేదని కొందరు సూచిస్తున్నారు. ఇప్పటికైతే ప్రధాని కుర్చీకి అద్వానీ కంటే మోడీయే దగ్గరగా వెళ్ళినట్లు లెక్క. కానీ కాంగ్రెసేతర, బి.జె.పియేతర వ్యక్తి ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అద్వానీ కొన్ని నెలల క్రితం తన బ్లాగ్ లో అభిప్రాయపడినందున మోడి ప్రధాని కాకుండా ఆయన పాచికలు విసరకుండా ఊరకుంటారా అన్నది అనుమానమే.

2 thoughts on “అందినట్టే అంది ఎగిరిపోయిందా!… -కార్టూన్

  1. మీడియా హడవిడి చూస్తే, 2014 పార్లమెంట్ ఎన్నికలు బి.జె.పి కి అనుకూలంగ వస్తాయని, ప్రజల్ని అందుకు సమాయత్తమవమని ప్రొస్తహహించినట్లు ఉంది. ఒకరకంగ ఇది బి.జె.పి. కి ప్రచారం చేసిపెట్టినట్లుంది. రధయాత్ర చేసి అద్వాని దేశన్ని వంద సవంస్తరాలు వెనక్కు తీసుకపోతే తీసుకపొతే, మోడి ఇంకో రెండు వందల సంవస్తరాలైన వెనక్కు పోవాలని ఆదేస్తున్నరు. అందుకు ప్రజలు ఉవ్విలూరుతున్నర?.

  2. ఆలూ లేదు..చూలు లేదు అల్లుని పేరు సోమలింగం అంటే ఇదేనేమో……జనాల్లోకి వెళ్లకుండానే, ఎన్నికల కోసం అసలు ప్రచారం మొదలు పెట్టకుండానే ప్రధాని పదవికోసం అప్పుడే కలహాలు.

    అద్వానీ లాంటి సీనియర్ నేత ఎందుకో తన స్థాయికి తగినట్లు ప్రవర్తించడం లేదు అనిపిస్తోంది.

    పదవి దగ్గరికి వచ్చేసరికి….ఎంతటి ఉక్కు నేతలైనా….తుక్కు నేతలైనా ఒకటేనన్నమాట.

వ్యాఖ్యానించండి