అమెరికా గూఢచర్యం: ప్రిజమ్ గుప్పిట ప్రపంచ ప్రజల తలరాతలు


RT

RT

ప్రైవసీ పాలసీల పేరుతో గూగుల్, ఫేస్ బుక్, యాహూ, మైక్రోసాఫ్ట్, యాపిల్ తదితర భారీ ఇంటర్నెట్ కంపెనీలు మనకు చూపిస్తున్నదంతా వాస్తవం కాదని అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా స్వయంగా అంగీకరించాడు. అమెరికా ప్రజల భద్రత కోసం తమ గూఢచార సంస్ధలకు ప్రపపంచ ప్రజల వ్యక్తిగత సమాచారం, వారి ఇంటర్నెట్ కార్యకలాపాలు, వారు షేర్ చేసుకొనే ఫోటోలు, వారు పంపుకునే ఈ మెయిళ్ళు అన్నీ తమకు కావలసిందేనని ఆయన పరోక్షంగా స్పష్టం చేశాడు. అంతర్జాల కంపెనీలు ‘అబ్బే, అదేం లేదని’ మొరాయిస్తున్నా ‘ఉన్నది అదే’ అని బారక్ ఒబామా స్పష్టం చేసేశారు.

‘ప్రిజమ్’ అనే ప్రోగ్రామ్ ద్వారా అమెరికన్ అంతర్జాల కంపెనీల సర్వర్లలోకే తమ మిలట్రీ గూఢచార సంస్ధలు ఎన్.ఎస్.ఏ (నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీ), ఎఫ్.బి.ఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) లకు నేరుగా ప్రవేశం దొరకబుచ్చుకున్నామని అమెరికా అధ్యక్షుడు స్వయంగా అంగీకరించడంతో అంతర్జాతీయంగా తీవ్ర కలకలం చెలరేగుతోంది. చేతుల్ని మెలిమెట్టి లొంగదీసుకునే అమెరికా రాజ్య పెత్తనం పట్ల అమెరికా పౌర హక్కుల సస్ధలు, వివిధ రంగాల మేధావులతో పాటు ప్రపంచ దేశాల ప్రజాస్వామిక, పౌర హక్కుల, మానవ హక్కుల సంస్ధలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

తాము విదేశీయుల వివరాలు సేకరిస్తున్నాము తప్ప అమెరికన్ల జోలికి వెళ్ళడం లేదని అమెరికా అధికారులు కొందరు తమ చర్యలను సమర్ధించుకోజూడడం ఈ వ్యవహారానికి కొసమెరుపు. కాగా భారత దేశం లాంటి అనేక దేశాల ప్రజల అంతర్జాల అవసరాలు తీర్చేది అమెరికన్ కంపెనీలే కావడంతో మనందరి వ్యక్తిగత ఏకాంతం (ప్రైవసీ) మాత్రమే కాక జీవన భద్రతకు కూడా తీవ్రమైన ముప్పు పొంచి ఉన్నదని ‘ప్రిజమ్ ద్వారా వెల్లడైన విషయాలు స్పష్టం చేస్తున్నాయి.

బ్రిటన్ కి చెందిన ది గార్డియన్, అమెరికాకు చెందిన ది వాషింగ్టన్ పోస్ట్ పత్రికలు లీక్ చేసిన టాప్ సీక్రెట్ పత్రం ద్వారా ‘ప్రిజమ్’ (PRISM) దారుణం వెలుగులోకి వచ్చింది. ది గార్డియన్ పత్రికకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత విలేఖరి గ్లెన్ గ్రీన్ వాల్డ్ ఈ వెల్లడిలో ప్రముఖ పాత్ర పోషించడం గమనార్హం. ప్రముఖ అంతర్జాల కంపెనీలన్నింటి సర్వర్లలోకి ఎన్.ఎస్.ఏ, ఎఫ్.బి.ఐ లు ప్రవేశం (access) దొరకబుచ్చుకున్నాయని, యూజర్ల సమస్త వివరాలను ఇవి ప్రిజమ్ ప్రోగ్రామ్ ద్వారా సంపాదించి భద్రపరుస్తున్నాయని వీరు వెల్లడి చేశారు. ప్రిజమ్ ద్వారా డేటా సేకరణ రోజు వారీగా జరుగుతోందని, గూఢచార సంస్ధలు అధ్యక్షుడికి సమర్పించే తమ రోజువారీ నివేదికలకు ప్రిజమ్ ద్వారా సేకరిస్తున్న డేటా అత్యంత ఉపయోగం ఉంటోందని చెప్పుకున్నట్లు తెలుస్తోంది.

పవర్ పాయింట్ లీక్

41 స్లైడ్ లతో కూడిన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లీక్ కావడంతో అమెరికా ప్రభుత్వం సాగిస్తున్న ఈ దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. ఏయే కంపెనే ఏయే నెలలో ప్రిజమ్ ప్రోగ్రాంలో చేరిందీ వివరాలు ఈ స్లైడ్ లు తెలియజేస్తున్నాయి. గూఢచార అధికారులకు శిక్షణ ఇవ్వడం కోసం రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను లోపలి వర్గాలు లీక్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

కనీసం 2007 నుంచీ ఈ అక్రమం జరుగుతోంది. మొట్టమొదటి సారిగా ప్రిజమ్ ప్రోగ్రామ్ లో చేరిన మైక్రోసాఫ్ట్ కంపెనీ ‘మీ ప్రైవసీయే మా ప్రాధాన్యం’ అని నినాదం ఇవ్వడం కంటే హిపోక్రసీ మారేముంటుంది. గూగుల్ కంపెనీ అయితే ‘డోంట్ బి ఈవిల్’ అని నినాదం ఇచ్చి అది చేయని చెడ్డ పని అంటూ లేదంటే అతిశయోక్తి కాదు. యాహూ, యాపిల్, ఫేస్ బుక్ తమ వినియోగదారుల ప్రైవసీకి, భద్రతకు ఎంత ప్రాముఖ్యం ఇచ్చేదీ వివిధ ప్రైవసీ పాలసీల ద్వారా అవకాశం వచ్చినప్పుడల్లా గుర్తు చేయడం మనకు తెలిసిన విషయమే. అదంతా ఒట్టి బూటకమని అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా స్వయంగా జారీ చేసిన ప్రకటన ద్వారానే స్పష్టం అవుతోంది. (లీక్ అయిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లోని కొన్ని స్లైడ్ లను కింద చూడవచ్చు.)

ఇప్పటి వరకు తొమ్మిది కంపెనీలు ప్రిజమ్ కార్యక్రమంలో చేరి తమ వినియోగదారుల సమస్త సమాచారాన్ని అమెరికా మిలట్రీ గూఢచార సంస్ధలకు ప్రవేశం కల్పిస్తున్నాయి. నేరుగా తమ సర్వర్లనే ప్రిజమ్ కు అనుసంధానించడం ద్వారా కంపెనీలు ఈ పని చేస్తున్నాయి. లీక్ అయిన పవర్ పాయింట్ స్లైడ్ ల ప్రకారం ప్రిజమ్ లో చేరిన కంపెనీలు అవి చేరిన వరుస క్రమంలో ఇవి: మైక్రోసాఫ్ట్ (డిసెంబర్ 2007), యాహూ (2008), గూగుల్, ఫేస్ బుక్, పాల్ టాక్ (2009), యూ ట్యూప్ (2010), స్కైప్, ఎ.ఓ.ఎల్ (2011), యాపిల్ (2012). అంతర్జాలంలోని ఈ మెయిల్, సెర్చ్, వీడియో, కమ్యూనికేషన్స్ లలో దాదాపు సమస్తాన్ని ఈ కంపెనీలే నియంత్రిస్తుండడంతో ప్రపంచ ఇంటర్నెట్ లోని వివిధ సంభాషణలు, షేరింగ్ లు అన్నీ అమెరికా గూఢచార కంపెనీల గుప్పెట్లోకి చేరుతున్నాయని అర్ధం చేసుకోవచ్చు.

విచిత్రం ఏమిటంటే అమెరికా అధ్యక్షుడే స్వయంగా అంగీకరించినా కంపెనీలు మాత్రం అదేం లేదంటూ ఇంకా వినియోగదారుల చెవుల్లో పూలు పెట్టడానికే కట్టుబడి ఉన్నాయి. గార్డియన్ పత్రిక వెల్లడించే వరకూ తాము అసలు ‘ప్రిజమ్’ అన్న పేరే వినలేదని ఈ కంపెనీలు చెబుతున్నాయి. గూగుల్, ఫేస్ బుక్, మైక్రో సాఫ్ట్ తదితర కంపెనీలు గార్డియన్, వాషింగ్టన్ పోస్ట్ పత్రికల వార్తలను నిరాకరిస్తూ ఇచ్చిన ప్రకటనలు దాదాపూ ఒకే రీతిలో ఉండడం విశేషం.

ఎలా చేశారు?

వాస్తవానికి ప్రపంచ దేశాల ప్రజలు వివిధ సాధనాల ద్వారా జరుపుకునే సంభాషణలపై నిఘా వేయడం అమెరికా 1950ల నుండే ప్రారంభించిందని ది వాషింగ్టన్ పోస్ట్ చెబుతోంది. అయితే అప్పట్లో ప్రజలకు అందుబాటులో ఉన్న కమ్యూనికేషన్ సౌకర్యాలు చాలా చాలా తక్కువ. ఇప్పుడు పరిస్ధితి అలా కాదు. అత్యంత వెనుకబడిన దేశాల్లోని మారు మూల పల్లెల్లోకి సైతం కమ్యూనికేషన్ సౌకర్యాలు చొచ్చుకు వెళ్ళాయి. నిత్య జీవితావసరాలైన నీరు, పరిశుభ్రమైన గాలి, నీడ, రవాణా సౌకార్యాలలో ఏమున్నా లేకపోయినా సెల్ టవర్లు మాత్రం విస్తృతంగా నిర్మించి పెట్టారు.

టెలీ ఫోన్ అంటే కనీసం 2000 సంవత్సరం వరకు లగ్జరీయే. ఎగువ మధ్య తరగతికి సైతం అప్పట్లో ల్యాండ్ లైన్ ఫోన్ అందుబాటులో ఉండేది కాదు. ఇప్పుడేమో సెల్ ఫోన్ ద్వారా ప్రతి వినియోగదారుడి ప్రతి కదలికను ప్రభుత్వాలు, రాజ్యాలు, పోలీసులు, మిలట్రీ లాంటి భద్రతా సంస్ధలు రికార్డు చేసుకోగల సౌకర్యం అందుబాటులోకి వచ్చి పడింది. తమకు అనుకూలమైన చట్టాలు చేసుకుని ప్రభుత్వాలు పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకు వస్తున్నాయి. అమెరికా కూడా అలాంటి చట్టాలనే చేసుకుంటూ ఏకంగా ప్రపంచ ప్రజలందరిపైనా నిఘా వేసే అధికారాన్ని తనకు తాను దాఖలు పరుచుకుంది.

జార్జి డబ్ల్యూ. బుష్ కాలంలో అమెరికా సర్వైలెన్స్ చట్టానికి మార్పులు చేసి క్రూరమైన కోరలు దానికి తొడిగారు. దీనిని అధ్యక్షుడు బారక్ ఒబామా డిసెంబర్ 2012లో మరింత కాలం కొనసాగడానికి ఆమోద ముద్ర వేశాడు. ప్రిజమ్ ప్రోగ్రామ్ ద్వారా అంతర్జాల కంపెనీల సర్వర్లలోకి ప్రవేశించే అవకాశం ఏర్పాటు చేసుకున్న బుష్ ప్రభుత్వ చర్యను ఒబామా ప్రభుత్వం మరింత విస్తృతం చేసింది. అనేకానేక కమ్యూనికేషన్ల పైన అవి కొనసాగుతున్నపుడే నిఘా వేసి రికార్డు చేసుకునే అవకాశాన్ని చట్టం ద్వారా కల్పించుకున్నారు.

ఈ నిఘా ఎంత విస్తృతమైన, లోతైనదంటే ఈ మెయిళ్ళు, స్కైప్ సంభాషణలు, మొబైల్ సంభాషణలు, టెక్స్ట్ మెసేజ్ లు, లైవ్ చాటింగ్, ఫోటో షేరింగ్, ఫైల్ షేరింగ్, డ్రాప్ బాక్స్ షేరింగ్ తదితర సమస్త కమ్యూనికేషన్లలోని ప్రతి అక్షరాన్ని చదివే అధికారం ఎన్.ఐ.ఏ, ఎఫ్.బి.ఐ అధికారులకు చేజిక్కింది. ఈ సమాచారాన్ని బ్రిటన్ గూఢచార సంస్ధలకు కూడా అమెరికా చేరవేస్తోందని తెలియడంతో అమెరికాలోని పలువురు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. బ్రిటన్ చట్ట సభల సభ్యులు కొందరు దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తుండగా బారక్ ఒబామా మాత్రం తమ చర్యలకు సిగ్గుపడకపోగా పూర్తిగా సమర్ధించుకున్నాడు.

అన్నీ అబద్ధాలే

వెరిజాన్ కంపెనీ అమెరికాలో భారీ కమ్యూనికేషన్ల కంపెనీ. ఈ కంపెనీ సర్వర్లలోకి ఎన్.ఎస్.ఏ కు పూర్తి ప్రవేశం కల్పించాలని అమెరికాలోని రహస్య కోర్టు అత్యంత రహస్యంగా ఇచ్చిన ఆర్డర్ ను గార్డియన్ గత బుధవారం వెలుగులోకి తెచ్చింది. దీనిపై గగ్గోలు పుడుతుండగానే గార్డియన్ తో పాటు, వాషింగ్టన్ పోస్ట్ పత్రిక కూడా ‘ప్రిజమ్’ గురించి వెల్లడి చేశాయి. వెరిజాన్ సర్వర్ల నుండి కేవలం మెటా డేటా మాత్రమే సేకరించేందుకు ఆదేశాలు అందాయని వినికిడి. అనగా సంభాషణల పాఠ్యం (Text) లోకి వెళ్ళే అవకాశం అందులో లేదని చెప్పారు. కానీ ప్రిజమ్ ప్రోగ్రామ్ అయితే అన్నీ సరిహద్దులనూ దాటింది. వివిధ కమ్యూనికేషన్స్ లోని ప్రతి అక్షరము గూఢచార కంపెనీల నిఘా పరిధిలోకి వెళ్లిపోయింది.

ఇప్పటివరకు జనానికి తెలిసిన చట్టాల ప్రకారం అయితే పోలీసులు, గూఢచార సంస్ధలు తదితర భద్రతా సంస్ధలు ఫలానా కమ్యూనికేషన్ గురించి వివరాలు ఇవ్వాలని కోర్టు ద్వారా అంతర్జాల కంపెనీలకు వారంట్ ఇస్తాయి. ఆ వారంట్ కి కంపెనీలు బద్ధులై ఉండాలని కాబట్టి ఆ నిర్దిష్ట కమ్యూనికేషన్ వరకు మాత్రమే సమాచారం ఇస్తారని మాత్రమే ఇంతవరకు తెలుసు. గూగుల్, మైక్రో సాఫ్ట్ కంపెనీలయితే తాము అలా కూడా బద్ధులమ్ కావడం లేదని, తమ నుండి ఒత్తిడి ద్వారా ఎవరూ సమాచారం పొందలేరని చెబుతూ వచ్చాయి. ప్రభుత్వం నుండి వచ్చిన వారంట్ లకు కూడా అన్నింటికీ తాము స్పందించడం లేదని, తాము అవసరం అనుకున్నపుడు మాత్రమే సమాచారం ఇస్తున్నామని చెబుతూ వచ్చాయి. ఆ మేరకు ప్రతి సంవత్సరం ఫలానా ప్రభుత్వం నుండి ఇన్ని రిక్వెస్టు లు తమకు వచ్చాయని చెబుతూ వాటిలో ఎన్నింటికీ తాము సానుకూలంగా స్పందించిందీ లెక్కలు చెబుతూ వచ్చాయి. కానీ అదంతా ఒట్టి బూటకమేనని, అన్నీ అబద్ధాలేనని, వినియోగదారులను నిలువునా మోసం ఇచ్చే ఉద్దేశ్యంతోనే ఆ నాటకాలు ఆడాయని ప్రిజమ్ ద్వారా తేటతెల్లం అవుతోంది.

ఇక నమ్మొద్దు!

అంతర్జాలంలో వ్యక్తిగత సమాచారం ఉంచవద్దని ఈ బ్లాగ్ లో వివిధ బ్లాగ్ పోస్టుల ద్వారా చెప్పడం జరిగింది. ఫేస్ బుక్, గూగుల్, యాహూ లాంటి సంస్ధలు అందిస్తున్న ఉచిత సేవల బుట్టలో పడవద్దని, మారు పేర్లతో ఈ మెయిల్ ఐ.డి లు పెట్టుకోవడం ఉత్తమం అని హెచ్చరించడం జరిగింది. ఫోటోలు అప్ లోడ్ చేయకపోవడమే ఉత్తమమని, ఆవేమన్నా ఉంటే స్వంత కంప్యూటర్లలో భద్రపరుచుకోవడం ఉత్తమమని హెచ్చరించడం కూడా జరిగింది. గూగుల్ కంపెనీ స్ట్రీట్ వ్యూ కార్ల ద్వారా సాగించిన డేటా చౌర్యం గురించి సందర్భం వచ్చినప్పుడల్లా వివరించి ఈ కంపెనీల మోసం గురించి వివరించడం జరిగింది. గూగుల్, ఫేస్ బుక్ లాంటి సంస్ధలకు అమెరికా రాజ్య గూఢచార కంపెనీలతో రహస్య అవగాహన ఉండే అవకాశం ఉన్నదని కనుక సాధ్యమైనంత గోప్యత పాటించడం ఉత్తమమని తెలియజేయడం జరిగింది. చివరికి అదే నిజం అయింది. హెచ్చరికలన్నీ ఎంత వాస్తవమో ప్రిజమ్ ప్రోగ్రామ్ నిర్ద్వంద్వంగా నిరూపిస్తోంది.

వినియోగదారుల కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు హ్యాకింగ్ కి గురి కాకుండా తాము ఆహరహం శ్రమిస్తామని గూగుల్, మైక్రో సాఫ్ట్, యాహూ, యాపిల్ లాంటి కంపెనీలు చెబుతాయి. ప్రతి ఆప్ కి ఒక ప్రైవసీ రూపొందించి దానిని ఆమోదిస్తేనే డౌన్ లోడింగ్ సాధ్యమని షరతు విధించి తద్వారా ప్రైవసీకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చేదీ వివిధ రూపాల్లో ఫోజులు పెట్టి చెబుతాయి. మీ వ్యక్తిగత సమాచారం ధర్డ్ పార్టీ లకు ఇచ్చేదే లేదని ప్రతి సందర్భంలోనూ -క్లిక్ చేసేటప్పుడు, భారీ ప్రోగ్రామ్ ల నుండి బ్రౌజర్లలో అతి చిన్న ఎక్స్ టెన్షన్ వరకూ ఇన్ స్టాల్ చేసేటప్పుడు ఒట్టు పెడతాయి. ‘మీ అంతర్జాల జీవితం మా చేతుల్లో (మాత్రమే) భద్రం’ అంటూ ఆడంబరంగా, సాధ్యమైనంత పటాటోపంతో ప్రకటిస్తాయి. ఇదంతా శుద్ధ అబద్ధం అని ఇప్పుడు స్పష్టం అయిపోయింది. ప్రిజమ్ అన్న పేరే వినలేదంటున్న గూగుల్, మైక్రో సాఫ్ట్, యాపిఐ‌ఎల్, యాహూ తదితర కంపెనీల మాటలు ఇప్పుడిక నమ్మనవసరం లేదు. నమ్మామా, ఇక మనల్ని ఎవరూ బాగు చేయలేరు.

3 thoughts on “అమెరికా గూఢచర్యం: ప్రిజమ్ గుప్పిట ప్రపంచ ప్రజల తలరాతలు

  1. నిఘా ఇంత విస్తృతమా?! కళ్ళు చెదిరిపోయే ఈ వాస్తవాలను అంతర్జాలం వినియోగించేవారంతా తప్పనిసరిగా తెలుసుకోవాలి!

  2. I don’t really see anything wrong or any problem with that. Which country does not perform this or similar to this? Well …the fact remains … as long as these agencies keep the privacy data confidential and secure.

    A simple example: I have bank accounts in India and USA; for personal purposes …really personal, track-able and audit-able, i transfer money from one account to another. With no proper personal information, how it can be proved that the purpose of this fund transfer is not to support any anti-social activity? This is a very small example and there are much more to substantiate the purpose of prism or something similar.

  3. పింగ్‌బ్యాక్: స్నోడేన్ పత్రాలు: హార్డ్ డిస్క్ సహా అమెరికా గుప్పిట్లో ఇండియా జాతకం 2 | జాతీయ అంతర్జాతీయ వార్తల

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s