సబిత, ధర్మానలను జైలుకి పంపండి -సి.బి.ఐ


Dharmana, Sabitha

రాష్ట్ర మాజీ హోమ్ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, మాజీ రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుల పట్ల ఇన్నాళ్లూ అంటీ ముట్టనట్లు వ్యవహరించిన సి.బి.ఐ, శుక్రవారం అసాధారణ రీతిలో మెమోలు జారీ చేసింది. తాము నిర్దోషులుగా బైటికి వస్తామంటూ ఇద్దరు మాజీ మంత్రులు ప్రకటించిన దానిని గుర్తు చేస్తూ, వారిద్దరూ విచారణను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, కాబట్టి వెంటనే వారిని జ్యుడీషియల్ కస్టడీకి తీసుకోవాలని కోర్టును కోరింది.

నిర్దోషులుగా బైటికి వస్తామని ప్రకటించడం అంటే ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించినట్లేనని సి.బి.ఐ కోర్టుకు తెలిపింది. సాక్ష్యులను కూడా ప్రభావితం చేయడానికి వారి ప్రకటన ఉద్దేశించారని, అంతే కాకుండా వారి కేసుల్లో విచారణకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నట్లేనని సి.బి.ఐ తన మెమోల్లో తెలియజేసింది. దాల్మియా సిమెంటు, మరో రెండు కంపెనీలపై నమోదయిన కేసుల్లో నిందితులు కోర్టుకు హాజరయినప్పుడు సి.బి.ఐ ఈ మెమోలు జారీ చేసింది. కడప ఎం.పి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పై నమోదయిన అక్రమాస్తుల కేసులో భాగంగా దాల్మియా సిమెంట్ పైన కూడా కేసు నమోదయిన సంగతి తెలిసిందే.

జగన్ అక్రమాస్తుల కేసులో ధర్మాన ప్రసాదరావును నిందితుడిగా సి.బి.ఐ చార్జి షీటులో పేర్కొన్న తర్వాత ఆయన  రాజీనామా చేసినప్పటికీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దానిని ఆమోదించలేదు. అటు విధులు నిర్వహించకుండా, ఇటు సి.బి.ఐ విచారణకు అనుమతీ ఇవ్వకుండా ముఖ్యమంత్రి తాత్సారం చేశారు. దానితో ధర్మానకు రాజీనామా చేశాడన్న ప్రతిష్టతో పాటు సి.బి.ఐ విచారణ నుండి తప్పించుకునే అవకాశం దొరికింది. కేంద్రంలో బన్సాల్, అశ్వనీ కుమార్ ల రాజీనామాలతో రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. సబిత, ధర్మానలు రాజీనామాలు చేయాల్సిరావడమే కాక ఇతర ‘కళంకిత’ మంత్రులకు కూడా పదవీ గండం వచ్చిపడిందని పత్రికలు ఊహాగానాలు సాగించాయి.

సి.బి.ఐ జె.డి లక్ష్మి నారాయణ కూడా ఇప్పుడు మాజీయే

సి.బి.ఐ జె.డి లక్ష్మి నారాయణ కూడా ఇప్పుడు మాజీయే

ఈ లోపు సి.బి.ఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మి నారాయణ బదిలీ కావడంతో జగన్ కేసుల విచారణపై అనుమానపు మేఘాలు కమ్ముకోగా, కేంద్ర-రాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడినట్లయింది. నిర్దేశిత 7 సంవత్సరాల డిప్యుటేషన్ కాలం ముగిసినందున ఆయన తన స్వంత కేడర్ రాష్ట్రం మహారాష్ట్రకు వెళ్ళడం తప్పనిసరని ప్రభుత్వ వర్గాలు చెబుతుండగా, అవసరం అనుకుంటే ఆయనను కొనసాగించవచ్చనీ, జగన్ కేసును తప్పుదారి పట్టించడానికే ఆ అవకాశాన్ని పక్కకు నేట్టారని కొన్ని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే జగన్ కి సంబంధించిన అన్నీ కేసుల్లోనూ లక్ష్మి నారాయణ విచారణ పూర్తి చేశారని, చార్జి షీట్ ఫైల్ చేయడం ఒక్కటే మిగిలి ఉందని సి.బి.ఐ వర్గాలు చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ నేపధ్యంలో సి.బి.ఐ జారీ చేసిన మెమోలు కొంత అయోమయాన్ని సృష్టిస్తే, అవినీతి వ్యతిరేకులలో కొంత ఆశను కూడా రగిలించింది. సి.బి.ఐ మెమోలను జడ్జి యు.దుర్గా ప్రసాద రావు అనుమతిస్తూ సి.బి.ఐ వాదనలోని సాధ్యాసాధ్యాలను పరిశీలించవలసిందిగా కోర్టు సిబ్బందిని ఆదేశించడం వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. మాజీ మంత్రులకు మొదట నోటీసులు జారీ చేయాలని ఆ తర్వాతే జ్యుడీషియల్ కస్టడి విషయం పరిశీలించాలని మంత్రుల తరపు లాయర్లు వాదించినప్పటికీ వారి వాదన నెగ్గినట్లు కనిపించలేదు. మాజీ మంత్రులిరువురూ ‘తాము నిర్దోషులుగా బైటికి వస్తాం’ అంటూ అభిమానుల సందోహాల మధ్య ప్రకటిస్తున్న వీడియో క్లిప్పింగులను సి.బి.ఐ కోర్టుకు సమర్పించింది. తదుపరి హియరింగ్ తేదీ అయిన జూన్ 21 లోగా ఇరువురిని జైలుకు పంపాలని సి.బి.ఐ గట్టిగా కోరింది.

జగన్ అక్రమ ఆస్తులు సంపాదించేందుకు సహాయపడేలా అక్రమ జి.ఓ లు జారీ చేసిన మంత్రులు మరో ముగ్గురు ఉండడంతో ఇప్పుడు అందరి దృష్టి వారిపై కేంద్రీకరించబడింది. అయితే చార్జి షీట్లలో వారి పేర్లు ఇంకా నమోదు కానందున ప్రస్తుతానికి వారి సేఫ్ జోన్ లో ఉన్నట్లే. కానీ జగన్ అక్రమాస్తులకు సంబంధించి ఇంకా ఆరు అంశాలపై చార్జి షీట్లు నమోదు కావలసి ఉంది. ఏ చార్జి షీట్ లో ఏ మంత్రి పేరు ఉంటుందోనని ఆ మంత్రులు గుండెలు ఉగ్గబట్టుకున్న పరిస్ధితి కొనసాగక తప్పదు.

ఇదిలా ఉండగా జగన్ ను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య శుక్రవారం కోర్టుకు హాజరు పరిచారు. ఆయనతో పాటు ఆయన ఆడిటర్ విజయసాయి రెడ్డి, మాజీ మంత్రి సబిత ఇంద్రా రెడ్డిలు కూడా కోర్టుకు హాజరయ్యారు. సబితా ఇంద్రా రెడ్డి భారీ బల ప్రదర్శనతో కోర్టుకు హాజరయినట్లు తెలుస్తోంది. ధర్మాన కేసు వేరు కావడంతో ఆయన హాజరు కాలేదు. అయినప్పటికీ ధర్మాన, సబిత ఇద్దరినీ జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేసింది. ఇద్దరు ఇప్పుడు పదవిలో లేనందున పబ్లిక్ సర్వెంట్లు కారని కనుక వారిని అవినీతి నిరోధక చట్టం కింద అరెస్టు చేసి జయలుకి పంపాలని లేనట్లయితే సాక్ష్యాలను, సాక్ష్యులను ప్రభావితం చేస్తారని తెలిపింది.

కోర్టు నిర్ణయాన్ని బట్టి రాష్ట్రంలో రాజకీయాలు ఒకింత తీవ్రంగానే ప్రభావితం కానున్నాయి.

One thought on “సబిత, ధర్మానలను జైలుకి పంపండి -సి.బి.ఐ

  1. సోనియా గాంధీ గారి అల్లుడి గారి స్థిరాస్తుల గురించి కూపీ లాగిన ఐ ఎ ఎస్ అధికారి వయసు నలభై ఎనిమిది సంవత్సరాలు ! ఆయన గారు చేయబడ్డ బదిలీలు, ఆయన వయసు తో పోటీ పడుతున్నాయి ! ఆ అధికారి, ఇప్పటి వరకూ నలభై ఏడు సార్లు బదిలీ చేయబడ్డారు ! ఆయన చేసిన పాపం – ” కర్తవ్య నిర్వహణ ” !

వ్యాఖ్యానించండి