తమిళనాడులో కులాంతర వివాహాలపై విషం కక్కుతున్న స్వార్ధ శక్తులు ఒక ఆదర్శ వివాహ జంటను విడదీయడంలో ఎట్టకేలకు సఫలం అయ్యారు. రాజకీయ ప్రయోజనాల కోసం దళితులపై విష ప్రచారానికి వెనుకాడని పట్టళి ముక్కల్ కచ్చి (పి.ఎం.కె) పార్టీ నాయకులు ఆ పాపం మూటగట్టుకున్నట్లు కనిపిస్తోంది.
వన్నియార్ కుల ప్రజలను దళితులపై విద్వేషపూరితంగా రెచ్చగొట్టి ఓట్లు, సీట్లు సంపాదించడానికి అలవాటు పడిన పి.ఎం.కె నాయకుడు రాందాస్ అనేక సంవత్సరాలుగా కులాంతర వివాహాలను పచ్చిగా వ్యతిరేకిస్తూ ప్రకటనలు ఇస్తున్నాడు. మరీ ముఖ్యంగా దళిత యువకులు రంగుల లోకం చూపి ఇతర కులాల యువతులను వలలో వేసుకుంటారని, ఆ రంగుల లోకం లేదని తెలిసాక అమ్మాయిలు వివాహం రద్దు చేసుకుని వెనక్కి వస్తున్నారని రాందాస్ విద్వేష ప్రచారంలోని ఒక ప్రధాన అంశం. దానిని రుజువు చేయడానికా అన్నట్లు ధర్మపురిలో మూడు దళిత కాలనీలు తగలబడి పోవడానికి కారణమైన యువ జంటను బలవంతపు ఆమోదంతో విడదీశారు.
“మేము ఆనందమైన జీవితాన్ని గడిపాము. దివ్య ఆమె కుటుంబంతో ఉన్నప్పటి కంటే నాతో ఉన్నప్పుడే ఎక్కువ సంతోషంగా గడిపింది. ఆమెను సంతోషంగా ఉంచడానికి నేను చేయని ప్రయత్నం లేదు. ఈ రోజు ఒక రాజకీయ కుట్రకు మేము బాధితులంగా మిగిలాం” అని కులాంతర వివాహం చేసుకున్న దళిత యువకుడు ఐ.ఇళవరసన్ అన్నాడని ది హిందు తెలిపింది.
గత సంవత్సరం ఆగస్టు ప్రాంతంలో ధర్మపురి జిల్లాలోని నాధం కాలనీకి చెందిన దళిత యువకుడు, వన్నియార్ కులానికి చెందిన దివ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లిని దివ్య తండ్రి, ఆయన కుల పెద్దలు వ్యతిరేకించారు. పంచాయితీ నిర్వహించి పెళ్లి రద్దు చేసుకోవాలని హుకుం ఇచ్చారు. అమ్మాయి అందుకు నిరాకరించడంతో ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. దానితో వన్నియార్ కులస్ధులు వేల సంఖ్యలో దాడి చేసి నాధం కాలనీని, దాని పక్కనే ఉన్న మరో రెండు దళిత కాలనీలను తగలబెట్టారు. పి.ఎం.కె నేతల ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని అప్పట్లో పత్రికలు తెలిపాయి. (వివరాలు ఇక్కడ చూడవచ్చు. మరిన్ని వివరాలు ఇక్కడ. లోతైన విశ్లేషణ ఇక్కడ.)
అప్పటి నుండి పి.ఎం.కె నాయకులు అడపాదడపా దళిత వ్యతిరేక ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు. సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి దళిత వ్యతిరేకతను రెచ్చగొట్టారు. అలాంటి సమావేశాల సందర్భంగా మరొక దళిత కాలనీ మరక్కాణం పైన దాడి చేసి ఇళ్ళు తగలబెట్టారు. ఈ దాడి తర్వాత ముఖ్యమంత్రి జయలలిత పి.ఎం.కె పార్టీ పట్ల కఠినంగా వ్యవహరించడం ప్రారంభించారు. అతి చేస్తే పి.డి యాక్ట్ ప్రయోగిస్తానని హెచ్చరించారు. దానితో దాడి చేసింది తమవారు కాదని, దళితులే తమ ఇళ్ళు తాము తగలబెట్టుకుని వన్నియార్ లపై ఆరోపణలు చేస్తున్నారని పి.ఎం.కె నాయకుడు రాందాస్ అసంబద్ధ ప్రకటనలు ఇచ్చాడు.
ఈ నేపధ్యంలో ధర్మపురి కులాంతర వివాహం పి.ఎం.కె పార్టీకి ఆ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న కులానికి పరువు, ప్రతిష్టల సమస్యగా ముందుకు వచ్చింది. ఇళవరసన్ చెబుతున్నదాని ప్రకారం యువతి తల్లికి జంటను విడదీసే ఆసక్తి ఏమీ లేదు. అతని భార్య దివ్య కు కూడా అతనితో సంతోషంగానే గడుపుతోంది. అయితే హఠాత్తుగా దివ్య కొద్ది రోజుల క్రితం చెప్పాపెట్టకుండా తల్లి దగ్గరికి వెళ్లిపోవడం, తన భార్య కనపడడం లేదంటూ ఇళవరసన్ హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో ఆమె కోర్టుకు హాజరై తాను తల్లివద్దే ఉంటానని చెప్పడం జరిగిపోయింది.
దానితో ఇళవరసన్ ఒంటరిగా మిగిలిపోయాడు. తన భార్యను కాపాడుకోవడానికి పది నెలలుగా అతను జాగ్రత్తగా చేసుకుంటున్న ప్రయత్నాలు రాజకీయ పార్టీల స్వార్ధపర కుట్రల ముందు ఓడిపోయి అతన్ని కోర్టు ముందు దీనంగా నిలిపాయి. పోలీసు డిపార్ట్ మెంటు కు ఎన్నికై ఉద్యోగ నియామకం కోసం ఎదురు చూస్తున్న ఇళవరసన్ ఇప్పుడు తన భార్య తన దగ్గరికి ఎప్పటికైనా వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నాడు.
తన భార్య ఉద్దేశ్యపూర్వకంగానే తనను వదిలి వెళ్లిందని ఇళవరసన్ భావించడం లేదు. “ఆమె మనసును చెడగొట్టారు. ఆమె, ఆమె తల్లి ఇద్దరు ఒక రాజకీయ పార్టీ నిర్బంధంలో ఉన్నారు. తన కుటుంబానికి ఎటువంటి హాని జరగకుండా ఉండడానికే ఆమె ఇప్పుడు నన్ను వదిలి వెళ్లింది” అని ఇళవరసన్ చెబుతున్నాడు. తానెన్నడూ దివ్య పైన షరతులు విధించలేదని ఆమె తన తల్లితో రోజూ మాట్లాడుతుండేదని అతను తెలిపాడు.
“ఇప్పుడు కూడా తన తల్లి, సోదరుల ప్రయోజనాలను ఎలా కాపాడాలన్నదే ఆమె ఆలోచన. మమల్ని విడదీయడానికి ఆమె తల్లికి కూడా ఆసక్తి లేదు. కానీ, హై కోర్టులో పిటిషన్ వేయాలని ఆమె పైన తీవ్రమైన ఒత్తిడి వచ్చింది” అని ఇళవరసన్ తెలిపాడు. కోర్టులో దివ్యతో మాట్లాడడానికి తనకు ఒక్క అవకాశం ఇచ్చి ఉంటే ఆమె వెళ్ళి ఉండేది కాదని అతను గట్టిగా నమ్ముతున్నాడు.
మొత్తం మీద స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు ఒక యువ జంటను విడదీశాయి. కులాంతర వివాహాలు కుల వ్యవస్ధను బలహీనపరుస్తాయన్న అంబేద్కర్ ఆలోచన, ఆశ ఈ విధంగా వెక్కిరింపుకు గురయ్యాయి. సామాజిక పురోగమన పరిణామంలో పడిన ఒక చిన్ని అడుగు తాత్కాలికంగా వెనుదిరిగింది. వెనుదిరిగిన ఆ అడుగు ప్రగతి వైపుకు మరో పెద్ద అంగతో ముందుకు వెళ్తుందన్న ఆశ ఇళవరసన్ మాటల్లో ప్రతిఫలిస్తోంది. ఇళవరసన్, దివ్యల అన్యోన్య దాంపత్యం కోసం ఈ బ్లాగ్ ఎదురు చూస్తుంది.


ధర్మ పురిలో అధర్మం !
‘కులం ‘ గాడి బలం !
‘దివ్య ‘ (మైన ) మనసు మారిన మర్మం !
అవాలి , ఇలవరన్ గుండె పదిలం !