మొట్టమొదటి నల్లజాతి అధ్యక్షుడు బారక్ ఒబామా నల్ల చట్టాలు అమలు చేయడంలో జార్జి డబ్ల్యూ. బుష్ ని మించిపోతున్నారు. ప్రభుత్వ చెప్పు చేతల్లోని విదేశీ గూఢచర్య కోర్టు (Foreign Intelligence Surveillance Act Court -FISA Court) నుండి తనకు కావలసిన ఆర్డర్ తెప్పించుకుని అమెరికా ప్రజలతో పాటు ప్రపంచంలోని ఇతర అన్ని దేశాల ప్రజల ఫోన్ సంభాషణల పైనా గూఢచర్యం సాగించడానికి తెగబడ్డాడు. గత ఏప్రిల్ 25 తేదీన కోర్టు ఈ మేరకు ఆర్డర్ సంపాదించారని చెబుతున్నప్పటికీ వాస్తవానికి ఇది గత ఆరేడేళ్లుగా జరుగుతోందని బ్రిటన్ పత్రిక గార్డియన్, అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్ట్ పత్రికలు వెల్లడి చేశాయి. అమెరికా సాగించే హంతక దురాక్రమణ యుద్ధాలకు పూర్తి మద్దతు అందజేసే న్యూయార్క్ టైమ్స్ పత్రిక సైతం ఒబామా చర్యను దుష్కార్యంగా అభివర్ణించిందంటే పరిస్ధితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.
ఒబామా ప్రభుత్వం సంపాదించిన కోర్టు ఆదేశాల మేరకు అమెరికా పౌరులతో పాటు ఇతర దేశాల పౌరుల ఫోన్ సంభాషణల పైన అమెరికా జాతీయ భద్రతా సంస్ధ (నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీ) నిఘా పెట్టినట్లు గార్డియన్ పత్రిక తెలిపింది. ఇందుకోసం అమెరికాలోని భారీ టెలికమ్యూనికేషన్ కంపెనీ వెరిజాన్ లాంటి కంపెనీల సర్వర్లకు ఎన్.ఎస్.ఏ నేరుగా ప్రవేశం పొంది నిఘా పెట్టిందని సదరు పత్రిక వెల్లడి చేసింది.
మిలియన్ల సంఖ్యలోని పౌరుల వ్యక్తిగత ఫోన్ సంభాషణల పైన ఏళ్లతరబడి ఈ నిఘా కొనసాగుతున్నదని ది గార్డియన్ పత్రిక తెలిపింది. వెరిజాన్ (Verizon) కంపెనీ నుండి టెలిఫోనీ మెటా డేటాను రోజువారీగా సేకరించడానికి వాషింగ్టన్ లోని ఫిసా కోర్టు ఒబామా ప్రభుత్వానికి అధికారం అప్పజెప్పింది. ఇలాంటి ఆదేశాలు ఇప్పించుకోడానికే అలాంటి కోర్టులను ప్రభుత్వాలు ఏర్పరచుకుంటాయనేది నిర్వివాదాంశం.
ప్రపంచంలో ఆధునిక టెలిఫోన్, మొబైల్ ఫోన్ సంభాషణలను నిర్వహిస్తున్నది ప్రధానంగా అమెరికా బహుళజాతి కంపెనీలే. వెరిజాన్, గూగుల్, యాపిల్, యాహూ తదితర కంపెనీలన్నీ అమెరికాలో సర్వర్లు కలిగి ఉన్నందున అమెరికాతో సంబంధం లేని కాల్స్ కూడా అమెరికా నుండి వెళ్లవలసిందే. ఎన్.ఎస్.ఏ ఈ సర్వర్ల వద్ద కాపు గాస్తోంది. కోర్టు ఆర్డర్ ను చూపి అమెరికా పౌరుల సంభాషణలే కాక, ఇతర దేశాల పౌరుల సంభాషణలు, నెంబర్లు తదితర అన్ని అంశాలపైనా నిఘా వేయగలుగుతోంది.
అమెరికా పౌరులకు రానున్న టెర్రరిస్టు ముప్పును తప్పించడానికే తాము ఈ పని చేస్తున్నామని ఒబామా ప్రభుత్వం, ఎన్.ఎస్.ఏ అధికారులు ఇప్పుడు నిస్సిగ్గుగా బొంకుతున్నారు. వీళ్ళ దృష్టిలో ప్రపంచంలో ప్రతిఒక్కరూ టెర్రరిస్టే కాబోలు, ఒక్క ఒబామా, ఎన్.ఎస్.ఏ అధికారులు, బహుళజాతి కంపెనీలు తప్ప! వాస్తవానికి ఇటీవల జరిగిన బోస్టన్ బాంబు పేలుళ్లలో నిందితులైన చెచెన్యా సోదరులను ఎఫ్.బి.ఐ సంస్ధే రిక్రూట్ చేసుకోవడానికి ప్రయత్నించింది. కాబట్టి అసలు టెర్రరిస్టులు ఎవరన్నది స్పష్టమే.
తాము ఫోన్ సంభాషణలు చూడడం లేదని మెటా డేటా మాత్రమే సేకరిస్తున్నామని ఎన్.ఎస్.ఏ చెబుతోంది. “కాల్ ఎన్వలప్” కు సంబంధించిన అంశాలనే సేకరిస్తున్నామని చెబుతోంది. ఏమిటీ కాల్ ఎన్వలప్? ది హిందూ ప్రకారం కాల్ ఎన్వలప్ అంటే: కాల్ మొదలయ్యే నెంబర్లు, కాల్ డెస్టినేషన్ నెంబర్లు, కాల్ సమయం, టెలిఫోన్ కాలింగ్ కార్డ్ నెంబర్లు, ట్రంక్ ఐ.డిలు, IMSI (International Mobile Subscriber Identity) నెంబర్లు, సంభాషణలు ప్రయాణించే రూట్ల సమాచారం మొ.వి ఈ కాల్ ఎన్వలప్ లేదా మెటా డేటా కిందికి వస్తాయి. కానీ పౌర హక్కుల సంస్ధలు ఈ సమాచారం తక్కువ కాదని, పౌరుల ప్రైవసీ హక్కులను ఉల్లంఘించడానికి తగిన సమస్త సమాచారం ఇందులో ఇమిడి ఉన్నదని ఆ సంస్ధలు చెబుతున్నాయి.
“లెక్కించడానికి వీలులేనంత భారీ సంఖ్యలోని అమాయక పౌరులు ప్రభుత్వ గూఢచార సంస్ధల నిరంతర నిఘాలో ఉంచబడే ప్రోగ్రామ్ ఇది. ఆర్వేలియన్ దశ ఎప్పుడో దాటిపోయింది. జవాబుదారీతనం అనేదే తెలియని గూఢచార సంస్ధల డిమాండ్లకు పౌరుల మౌలిక ప్రజాస్వామిక హక్కులను రహస్యంగా ఎలా సరెండర్ చేస్తున్నదీ తెలియడానికి ఈ వ్యవహారం మరొక సాక్ష్యం మాత్రమే” అని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ డిప్యూటీ లీగల్ డైరెక్టర్ జామీల్ జాఫర్ అన్నారని ది హిందూ తెలిపింది.
అమెరికా వార్తా సంస్ధ అసోసియేటెడ్ ప్రెస్ ఉద్యోగుల టెలిఫోన్ సంభాషణలపై నిఘా పెట్టినందుకు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న అమెరికా అటార్నీ జనరల్ ఎరిక్ హోల్డర్ మాత్రం తాము తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని పాత పాటే పాడుతున్నాడు. అమెరికా న్యాయ విభాగం అమెరికా పౌరుల భద్రతకు కట్టుబడి ఉందని ఆయన హామీ ఇస్తున్నారు. కానీ అమెరికాయేతర పౌరుల భద్రత మాటేమిటి? అసలు విదేశీయుల సంభాషణలపై నిఘా పెట్టమని ఆదేశించే అధికారం అమెరికాలోని టెర్రరిస్టు కోర్టుకు ఎలా వస్తుంది?
ఇండియాలో టెర్రరిస్టు దాడులు చేసి వందల మందిని బలిగొనడానికి ముందస్తు ఏర్పాట్లు చేసిన హెడ్లీ ఇప్పుడు అమెరికా నిర్బంధంలో ఉన్నాడు. అతనిని విచారించడానికి ఇండియా పంపాలని కోరితే ఇప్పటివరకు దిక్కు లేదు. కనీసం ఒక్క సంవత్సరమైనా హేడ్లిని ఇండియాకు పంపితే విచారించుకుంటామని ఇటీవలే భారత ప్రభుత్వం దేబిరించింది. అమెరికా, భారత్ ప్రభుత్వాలకు ఇంత తేడా ఎందుకు ఉన్నది? ఒకటి ఆదేశాలిస్తుంటే మరొకటి దేబిరించే పరిస్ధితిలో ఉండడం ఏమిటి? భారత ప్రజలు ఆలోచించవలసిన ప్రశ్నలివి.