ఆహార భద్రతా బిల్లు: ఖోలో సెసేమ్! -కార్టూన్


The Hindu

The Hindu

ఎన్నికలలోపు ‘ఆహార భద్రతా బిల్లు’ (Food Security Bill) ను చట్టం రూపంలో తేవాలని యు.పి.ఏ ప్రభుత్వం సకల ప్రయత్నాలు చేస్తోంది. బి.జె.పి సహాయ నిరాకరణ వలన బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి అవకాశం దొరకలేదు. మైనారిటీలో ఉన్న యు.పి.ఏ-2 ప్రభుత్వం బి.జె.పి సహకారం లేకుండా చట్టం తేవడం అసంభవం. ఈ నేపధ్యంలో కేబినెట్ ద్వారా ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు పత్రికలు చెబుతున్నాయి. ఇంతకీ కాంగ్రెస్ కి ఎందుకింత తొందర?

ఆహార భద్రతా చట్టం తమకు ఓట్ల సిరులు కురిపించే మరో చట్టం అని కాంగ్రెస్ భావిస్తోంది. ఉపాధీ హామీ పధకం ద్వారా వరుసగా రెండుసార్లు ప్రభుత్వం ఏర్పరిచిన కాంగ్రెస్ (అలియాస్ యు.పి.ఏ) నగదు బదిలీ పధకం, ఆహార భద్రతా చట్టంల ద్వారా హ్యాట్రిక్ కొట్టాలని ఆశీస్తోంది. ఈ మేరకు ప్రధాని మన్మోహన్ సైతం మూడోమారు ప్రధాని పదవి చేపట్టడాన్ని కొట్టిపారేయలేదని పత్రికలు ఘోషించాయి. మన్మోహన్ మూడో మారు ప్రధాని ఐనా కాకపోయినా ఆయన ద్వారా తాను మూడోసారి అధికారంలోకి రావడం తధ్యం అని కాంగ్రెస్ పార్టీ సంకేతాలు పంపింది.

కానీ వాస్తవంలో నగదు బదిలీ చట్టం ప్రజలకు ఇస్తున్న సబ్సిడీలను మరింతగా కోతపెట్టడానికి ఉద్దేశించినది. జనానికి సరుకులు నేరుగా ఇవ్వడం వేరు, వాటి బదులు డబ్బులు ఇవ్వడం వేరు. సరుకులు ఇస్తే వాటిని నేరుగా ఉపయోగపెట్టుకోవడమే మిగులుతుంది. ఆ విధంగా కుటుంబ పెద్దతో సంబంధం లేకుండా భార్యా, పిల్లలు కడుపుకి కాసింత తినే అవకాశం వస్తుంది. కానీ డబ్బిస్తే అది జరగదు. డబ్బు మళ్ళీ సరుకుల రూపంలోకి మారాలి. అలా మారేలోపు కుటుంబ పెద్ద ఆ డబ్బును దేనికయినా వినియోగ పెట్టవచ్చు. తాగుబోతు అయితే బార్ లు లాభపడతాయి. పేకాట వ్యసనపరుడైతే మోసగాళ్ళు లాభపడతారు. మొత్తం మీద కుటుంబ సభ్యులు లాభపడే అవకాశాలు తక్కువ. సబ్సిడీ మొత్తం అవినీతిపరులకు అందకుండా చేయడానికి అని చెబుతూ నగదు బదిలీ పధకం ద్వారా సరిగ్గా అదే పని చేయబోతోంది. కాకపోతే చేతికి డబ్బులు వస్తాయి కనుక అది కాంగ్రెస్ చలవే అని తమకు ఓట్లు గుద్దేస్తారని ఆ పార్టీ ఆశీస్తోంది.

ఇక ఆహార భద్రతా చట్టం పట్ల ఇప్పటికే అనేకమంది పెదవి విరిచేశారు. అనేక లోపాలను ఎత్తి చూపారు. ఆర్డినెన్స్ తేవడం వలన ఈ లోపాలన్నీ యధాతధంగా చట్టం రూపంలోకి వస్తాయని కనుక పార్లమెంటులో తగిన చర్చ జరిగిన తర్వాతే చట్టం చేయాలని వివిధ స్వచ్ఛంధ సంస్ధలు డిమాండ్ చేస్తున్నాయి. బి.జె.పి కూడా ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు జరిపి ఆహార బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతోంది. బియ్యం పంపిణీని 7 కె.జి ల నుండి 5 కె.జి లకు తగ్గిస్తూ ఆహార బిల్లుని కాంగ్రెస్ తయారు చేసినట్లు తెలుస్తోంది. అనేక పార్టీలు అనేక సవరణలు ఈ చట్టానికి ప్రతిపాదించాయి. ఇవేవీ పరిగణనలోకి తీసుకోకుండానే చట్టం తెస్తే జనం నష్టపోతారని వివిధ సంస్ధలు వాదిస్తున్నాయి.

ఆహార భద్రతా చట్టం ఆహార భద్రత కల్పించడానికి బదులు ఆహార అబధ్రత కల్పించనున్నదని వివిధ సంస్ధలు చెబుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకునే పరిస్ధితిలో లేదు. అసలు ప్రజలకు ఉత్పాదక పని కల్పించి వారి ఆదాయాలు పెంచేందుకు ప్రయత్నించకుండా ప్రభుత్వం పైన ఆధారపడేట్లు చేయడమే నాసిరకం ఆలోచన. తాము దాన, ధర్మాలు చేస్తున్నామని భ్రమ కల్పిస్తూ ఓట్లు రాబట్టడం పార్టీల లక్ష్యం. ఈ లక్ష్యం ప్రజలకు ఉపయోగం కాదు. ఓట్లు రాల్చే చట్టాలు ఆహార భద్రతకు మంత్ర దండాలు కాలేవు. ప్రజలు దీనిని గట్టిగా వ్యతిరేకించాలి.

వ్యాఖ్యానించండి