ఇ.యు, చైనాల వాణిజ్య యుద్ధం, మొదటి అంకం మొదలు


China - EU solar war

యూరోపియన్ యూనియన్ చెప్పినట్లుగానే చైనా సోలార్ విద్యుత్ ఉత్పత్తి పరికరాలపై దిగుమతి సుంకం పెంచడానికి నిర్ణయం తీసుకుంది. తద్వారా చైనాతో వాణిజ్య యుద్ధానికి తెర లేపింది. చౌక పరికరాలను పెద్ద ఎత్తున డంపింగ్ చేయడానికి వ్యతిరేకంగానే తాను అదనపు సుంకం విధిస్తున్నట్లు ఇ.యు ప్రకటించింది. సౌర విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే సోలార్ పానెళ్లు, బ్యాటరీలు, వేఫర్లు మొదలైన పరికరాలకు 12 శాతం అదనపు సుంకం వేయనున్నట్లు ఇ.యు ట్రేడ్ కమిషనర్ కారెల్ డి గచ్ మంగళవారం తెలిపాడు. ఈ సుంకంతో కలుపుకుంటే చైనా సోలార్ పరికరాలపై ఇ.యు విధిస్తున్న సుంకం మొత్తం ఆగస్టు నుండి 47 శాతానికి చేరుతుందని ది హిందు తెలిపింది.

మే నెల చివరి వారంలో చైనా ప్రధాని లీ కెషాంగ్ జర్మనీ పర్యటించినప్పుడు ఇ.యు అదనపు సుంకం గురించి చర్చించనున్నట్లు ఇరు దేశాల నేతలు చెప్పారు. ఈ చర్చలు ఫలితం ఇవ్వలేదని ఇ.యు ప్రకటనను బట్టి భావించవచ్చు. అయితే చైనా సోలార్ పరికరాలపై అదనపు సుంకం విధించడానికి జర్మనీ వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. చైనాతో వాణిజ్యంలో ఇ.యు దేశాలకు సంబంధించి జర్మనీదే అతి పెద్ద వాటా. ఈ కారణం వల్లనే జర్మనీ వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే ఆగస్టు నుండి అదనపు సుంకం అమలులోకి రానున్నదని ఇ.యు చెబుతున్నందున ఈ లోపు చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కారం చేసుకునే అవకాశం లేకపోలేదు. చర్చలలో చైనాపై తగిన ఒత్తిడి పెంచడానికే ఇ.యు ఈ నిర్ణయం తీసుకుందా అన్నది తెలియవలసి ఉంది.

సోలార్ ప్యానెళ్లకు సంబంధించి చైనాయే అతి పెద్ద ఉత్పత్తిదారు అని ది హిందు తెలిపింది. ఈ ఉత్పత్తులను చౌక ధరలతో ఇ.యు మార్కెట్లను చైనా ముంచెత్తుతోందని ఇ.యు ఆరోపిస్తోంది. చైనా సోలార్ ఉత్పత్తుల ప్రస్తుత ధరల కంటే కనీసం 88 శాతం ఎక్కువగా ఉండాలని ఇ.యు అంచనా వేస్తోంది. ఆ మేరకు తమ ఉత్పత్తుల ధరలను సవరించాలని డిమాండ్ చేస్తోంది. ఆ విధంగా పెట్టుబడిదారీ కంపెనీల మధ్య పోటీ ద్వారా ప్రజలకు తక్కువ ధరలకు సరుకులు లభ్యం అవుతాయన్న ఆడమ్ స్మిత్ (అర్ధ శాస్త్ర పితామహుడని పెట్టుబడిదారీ ఆర్ధిక వేత్తలు ఈయనను కీర్తిస్తారు) సిద్ధాంతాన్ని ఇ.యు గేలి చేస్తున్నది. భారత దేశంలో విదేశీ కంపెనీల ప్రవేశానికి భారత పాలకులతో పాటు విదేశీ కంపెనీలు చెప్పే వాదన కూడా ఇదే. పోటీ ద్వారా మనకు సరుకులు తక్కువ ధరలకు అందుబాటులో ఉంచడమే తమ ధ్యేయం అని వాళ్ళు ప్రచారం చేశారు. అదెంత బూటకమో చైనాపై ఇ.యు ప్రకటించిన వాణిజ్య యుద్ధం స్పష్టం చేస్తోంది.

చైనా చౌక ఉత్పత్తుల వలన యూరోపియన్ యూనియన్ లో 20,000 ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని డి గచ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. “ఐరోపాలో అత్యంత ముఖ్యమైన పరిశ్రమను దెబ్బ తీయగల శక్తి వీటికి (చైనా చౌక ఉత్పత్తులు) ఉన్నది. అందువలన ఈ రోజే చర్య తీసుకోక తప్పదు” అని ఆయన ఆర్భాటంగా ప్రకటించాడు. భారత ప్రజలు ఇప్పుడు ఈ పెద్ద మనుషులను ఒక ప్రశ్న వేయాలి. చిల్లర వర్తకంలో అమెరికా, ఐరోపా దేశాల బహుళజాతి కంపెనీలను ఇండియాలోకి అనుమతించడం వలన ఇక్కడ నాలుగున్నర కోట్ల కుటుంబాలు ఉపాధి కోల్పోతాయి. ఇదేమీ ప్రభుత్వాలు, పరిశ్రమలు కల్పించిన ఉపాధి కాదు. వాటి ముందు చేయిచాచకుండా, ప్రభుత్వాన్ని నిందించకుండా తమకు తాముగా ఏర్పాటు చేసుకున్న స్వయం ఉపాధి. ఈ ఉపాధిని కూడా దెబ్బతీయడానికి అమెరికన్ ‘వాల్ మార్ట్’, బ్రిటిష్ ‘టెస్కో’, ఫ్రాన్స్ దేశ ‘కేరేఫర్’, స్వీడిష్ మరియు నెదర్లాండ్ దేశాల ‘ఐకీ (IKEA)’, జర్మన్ ‘మెట్రో ఎజి’ తదితర కంపెనీలు భారత ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి రిటైల్ బిల్లు ఆమోదింపజేసుకున్నాయి. చైనా సోలార్ ఉత్పత్తులకు వర్తించే వాణిజ్య నీటి ఇ.యు దేశాలు తమ కంపెనీలకు ఎందుకు వర్తింపజేయవు? అలా వర్తింపజేయాలని భారత పాలకులు ఎందుకు నిలదీయరు?

భారత పాలకుల సంగతి ఎలా ఉన్నా చైనా మాత్రం ఇ.యు వాదనను తిరస్కరించింది. “చైనా తన తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తోంది. యూరోపియన్ యూనియన్ మరింత నిజాయితీని, సంయమనాన్ని పాటించాలి. చర్చల ద్వారా పరస్పర అంగీకార యోగ్యమైన పరిష్కారం కనుక్కోవడానికి ప్రయత్నించాలని కోరుతోంది” అని చైనా వాణిజ్య శాఖ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. భారత పాలకులకు కనీసం తమ ప్రయోజనాల పట్లయినా -ప్రజల ప్రయోజనాలు అలా ఉంచుదాం- నిజాయితీగానీ, నిబద్ధత గానీ ఉన్నదా?

అలాగని చైనాకు యూరోపియన్ యూనియన్ తీసిపారేయవలసిన భాగస్వామి ఏమీ కాదు. చైనాకు ఇ.యు నే అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. 2012లో ఇ.యు దేశాలతో చైనా నిర్వహించిన ఎగుమతులు, దిగుమతుల మొత్తం విలువ 546 బిలియన్ డాలర్లు. అంటే దాదాపు 30 లక్షల కోట్ల రూపాయలకు లేదా ఇండియా జి.డి.పి లో మూడో వంతుకు సమానం. ఇ.యు దేశాలకు చైనా చేసే ఎగుమతుల్లో సోలార్ ప్యానెళ్ల ఎగుమతులు 7 శాతం ఉంటాయని చైనా డేటాను విశ్లేషిస్తూ ది హిందు తెలిపింది. రానున్న కాలంలో సంప్రదాయేతర ఇంధన వనరులకు భారీ డిమాండ్ పెరగనున్నది. సౌర విద్యుత్తు, గాలి మరల విద్యుత్తు తదితర పరిశ్రమలకు ఆదరణ పెరగనున్నది. ఈ నేపధ్యంలో భవిష్యత్తులో పెరగనున్న మార్కెట్లను కాపాడుకునే ప్రయత్నాలలో భాగంగానే ఇ.యు చర్యను చూడాల్సి ఉంటుంది.

ఇ.యు వైపు నుండి సంయమనం లేనట్లయితే చైనా కూడా ప్రతి చర్యలకు దిగే అవకాశం ఉంది. అదనపు సుంకాల అమలుకు ఇంకా రెండు నెలల సమయం ఉన్నందున ఇరు పక్షాలు చర్చల ద్వారా సమస్య పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. అలా కాకపోతే చైనా, ఇ.యు ల మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రం కావచ్చు. ఇ.యు సోలార్ ప్యానెళ్ల మార్కెట్ లో ప్రస్తుతం చైనా 80 శాతం వాటా కలిగి ఉన్నదని తెలుస్తోంది. దీనిని తగ్గించుకోవాలని ఇ.యు డిమాండ్ చేస్తోంది. ధరలు పెంచి, మార్కెట్ వాటా తగ్గించుకోవాలని ఇ.యు డిమాండ్. వచ్చే రెండు నెలల్లో ఒప్పందం కుదరకపోతే మెజారిటీ ఇ.యు దేశాల ఆమోదం మేరకు అదనపు సుంకాలు అమలులోకి వస్తాయి. చైనాతో తమ వాణిజ్యం రీత్యా అయితే జర్మనీతో పాటు ఇతర ఇ.యు దేశాలు కొన్ని ఈ సుంకాలను వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి ఒప్పందం కుదిరే అవకాశం లేకపోలేదు.

విస్తారమైన మానవ వనరులు అందుబాటులో ఉన్నపుడు శ్రామికుల మధ్య పోటీ పెరిగి అతి తక్కువ వేతనాలకు పని చేయడానికి సిద్ధపడతారు. చైనా, ఇండియా లాంటి దేశాలలో ఇలాంటి పరిస్ధితే ఎప్పుడూ ఉంటుంది. విద్య, ఆరోగ్యం తదితర సౌకర్యాలను అందుబాటులో ఉంచకుండా నిత్య దరిద్రంలో శ్రామిక ప్రజలు అల్లాడితేనే పెట్టుబడిదారీ కంపెనీలకు, ఇతర దోపిడీ వ్యవస్ధలకు లాభం. చైనాలో నెలకొన్న ఈ పరిస్ధితిని చైనా పెట్టుబడిదారీ పాలకవర్గాలు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారు. చౌక శ్రమను ఆశ చూపి పశ్చిమ దేశాలతో పాటు ఇతర పెట్టుబడిదారీ దేశాల నుండి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెద్ద ఎత్తున రాబట్టారు. ఆ విధంగా చైనా శ్రామికుల చౌక శ్రమకు పశ్చిమ బహుళజాతి కంపెనీలే ప్రధాన లబ్దిదారులు. కానీ తమ మార్కెట్లకు పోటీ వస్తే మాత్రం పశ్చిమ దేశాలు ఒప్పుకోవని, అసత్య, అసంగత ఆరోపణలు చేసి పోటీని అణగదొక్కుతాయనడానికి చైనా సోలార్ ఉత్పత్తుల వివాదం ఒక ఉదాహరణ.

2 thoughts on “ఇ.యు, చైనాల వాణిజ్య యుద్ధం, మొదటి అంకం మొదలు

వ్యాఖ్యానించండి