సామాన్య మానవుడికి సాధ్యం కాని ఫీట్ ఇది. బహుశా గిన్నీస్ రికార్డ్ బుక్ ఎక్కడానికి కూడా అర్హత ఉందేమో కూడా. ఎంత వి.వి.ఐ.పి ఐతే మాత్రం, ప్రమాదకరమైన నేరానికి పాల్పడ్డాడని సుప్రీం కోర్టు పదే పదే వ్యాఖ్యానిస్తున్న ఒక నేరస్ధుడికి, సంవత్సర కాలంలో 125 మంది రాజకీయ నాయకులకి మూలాఖాత్ ఇచ్చే అవకాశం ఎవరికి దక్కుతుంది? ఈ సంఖ్య కేవలం రాజకీయ నాయకులదే. సినిమా నటులు, బంధువులు, పారిశ్రామికవేత్తలు తదితర పెద్దలను కూడా కలిపితే రోజుకి కనీసం ఒక్కరైనా తేలతారేమో!
తెలుగు దేశం పార్టీకి రాష్ట్ర జైళ్ల శాఖకి మధ్య నడుస్తున్న ప్రకటనల యుద్ధంలో భాగంగా ఈ నిజం వెలుగు చూసింది. అక్రమ ఆస్తుల కేసులో అరెస్టయి సంవత్సర కాలంగా చంచల్ గూడ జైలులో వై.కా.పా ఎం.పి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఊచలు లెక్కబెడుతున్న సంగతి విదితమే. ఆయనకు జైలులో రాచ మర్యాదలు జరుగుతున్నాయని, జైలు గదుల్లో బ్లూ ఫిల్మ్ లు చూస్తున్నారని, గంజాయి తదితర డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని తెలుగు దేశం నాయకుడు చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల క్రితం ఆరోపణలు చేసారు.
దరిమిలా రాష్ట్ర జైళ్ల శాఖ అధికారులు స్పందించి ఆరోపణలను తిరస్కరించారు. తాము జైళ్ల మాన్యువల్ ప్రకారమే అక్షరాలా నడుచుకుంటున్నామని తమపైన ప్రతిపక్ష నాయకులు అసత్య ఆరోపణలు చేయడం తగునా అని వారు ప్రశ్నించారు. ఈ నేపధ్యంలో తెలుగు దేశం పార్టీ ఈ నిజాన్ని వెలికి తీసింది. 125 మంది రాజకీయ నాయకుల పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసి వారంతా గత సంవత్సర కాలంలో జైలులోనే జగన్ ఆతిధ్యం స్వీకరించినవారేనని ఆరోపించింది. వాస్తవాలకు విరుద్ధంగా జైళ్ల శాఖ అధికారులు ఎలా ప్రకటనలు చేయగలరని ప్రశ్నించింది.
మే 29, 2012 తేదీన అరెస్టయిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా 125 మంది రాజకీయ నాయకులను కలిశారని చెప్పిన టి.డి.పి వారి జాబితాను జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ టి.కృష్ణం రాజుకు పంపింది. జగన్ కు ప్రత్యేక సౌకర్యాలేవీ కల్పించలేదని ఆయన చేసిన ప్రకటనకు వాస్తవాలతో పొంతన ఎందుకు లేదని ఆ పార్టీ ప్రశ్నించింది. డిచ్ పల్లి ఎం.ఎల్.ఏ మండవ వెంకటేశ్వర రావు ఈ మేరకు ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారని ది హిందు తెలిపింది.
తమ సమస్యలను కడప ఎం.పి పరిష్కరించారని జైలులో ఆయనను కలిసి వచ్చిన నాయకులు బహిరంగ ప్రకటనలు జారీ చేశారని, దానిని బట్టి జైలును తన రాజకీయ కార్యకలాపాలకు వేదికగా జగన్ వినియోగించుకుంటున్నారని స్పష్టం అవుతోందని మండవ వాదించారు. ఇది జైలు నిబంధనలకు విరుద్ధం కాగా అలాంటిదేమీ లేదని జైలు అధికారులు ఎలా చెబుతారని ప్రశ్నించారు.
తన పదవిని కాపాడుకునే పనిలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ జైలులో జగన్ లీలలను లోపాయకారీగా అనుమతిస్తున్నారని మండవ వ్యాఖ్యానించారు.
పదవీ రాజకీయాలు, రాజకీయ నాయకుల సమస్యల పరిష్కారం, తెలుగు దేశం పార్టీ ఆరోపణలు ఇవన్నీ ఎలా ఉన్నా ఈ వ్యవహారం ద్వారా జనం అర్ధం చేసుకోవలసింది, జైళ్ళు సైతం ధనికులకు, పలుకుబడి కలిగినవారికి అత్తిల్లు కంటే ఎక్కువే అని. లేకపోతే దేశ ఆర్ధిక వ్యవస్ధకు ప్రమాదకరంగా సుప్రీం కోర్టు పరిగణిస్తున్న ఆర్ధిక నేరాలకు పాల్పడిన ఘరానా నేరస్ధులకు ఇంత యోగం ఎలా దొరుకుతుంది?
ఏ నేరానికి పాల్పడ్డామో తెలియకుండా, కనీసం కోర్టు హాజరుకు నోచుకోని వందలాది గిరిజన ఖైదీలు ఒకవైపు, రోజుకో వి.ఐ.పికి జైలులోనే ఆతిధ్యం ఇవ్వగలిగిన ‘ప్రమాదకర నేరారోపణలు’ ఎదుర్కొంటున్న ఖైదీ మరొకవైపు! ఇదేనా సమ న్యాయం? ఇదేనా ప్రజాస్వామ్యం?

CBI officers even found condoms in a prison in Bihar.