అద్వానీ భవిష్యత్తు ఏమిటి? భావి ప్రధాని కావడానికి తగిన ప్రయత్నాలన్నింటినీ ఆయన చేస్తున్నారు. కానీ ‘తానొకటి తలచిన దైవమొకటి తలచెను’ అన్న రీతిలో అద్వానీ కలను రాముడు పట్టించుకుంటున్నట్లు లేదు. ‘అన్నీ నేనే’ అని ఎప్పుడో చెప్పేసిన శ్రీ మహా విష్ణువు ఆయన పార్టీ చేత ‘ఇక మీరు రిటైర్మెంట్ తీసుకోండి’ అని పరోక్షంగా చెప్పిస్తున్నారు. మోడిని తీవ్ర స్ధాయిలో ప్రమోట్ చేయించడం ద్వారా ఆయనని విశ్రాంతి తీసుకొమ్మని ‘హింట్’ ఇప్పిస్తున్నారు.
కానీ అద్వానీ శ్రీ మహా విష్ణువు సూచనను పట్టించుకుంటున్నట్లు లేదు. ఎన్ని హింట్ లు ఇచ్చినా జరుగుతున్న ప్రతి పరిణామాన్నీ తన పదవీ ఉన్నతి కోసమే అని ఆయన కలలు గంటున్నారు. మోడి కంటే మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి చౌహాన్ ఎంతో బెటరని చెప్పడం ద్వారా మోడి పాపులారిటీని తగ్గించడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
ఒకప్పుడు బి.జె.పి లో హార్డ్ లైన్ కు చిరునామాగా ఉన్న అద్వానీ పాకిస్ధాన్ పర్యటనలో జిన్నాను గొప్ప సెక్యులరిస్టుగా పొగిడి, వాజ్ పేయి ఖాళీ చేసిన మోడరేటర్ స్ధానాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నం సఫలం కాకపోగా ఆర్.ఎస్.ఎస్ ఆగ్రహానికి పాత్రుడయ్యారాయన.
దరిమిలా హార్డ్ లైన్ పాత్రను ఆయన ఖాళీ చేసినట్లయింది. ఆయన ఖాళీ చేశారో లేదో తేలేలోపల మోడి గారు దూసుకొచ్చి హార్డెస్ట్ హార్డ్ లైనర్ పాత్రను లాక్కున్నారు. దానితో అద్వానీ కుర్చీ గల్లంతయింది. విశ్రాంతి తీసుకోవడానికి పార్టీ సరఫరా చేస్తున్న వాలు కుర్చీని సైతం ఆయన ప్రధాని పదవీ కిరీటంగా ధరించి మురిసిపోవలసిన దాపురించెను.
అకటకటా ఏమి ఈ విధి వైపరీత్యము!? ఈ విధి గారికి జాలి, దయ, కరుణ అన్నదే లేకపోయేనా?

super cartoon