ఆదివారం బి.సి.సి.ఐ బోర్డు అత్యవసర సమావేశం జరిపి అధ్యక్షుడు శ్రీనివాసన్ కు ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. కార్యదర్శి జగ్దాలే, ట్రెజరర్ అజయ్ షిర్కే ల రాజీనామాలతో శ్రీనివాసన్ పై ఒత్తిడి బాగా పెరిగినట్లు తెలుస్తోంది. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ లాంటి పరిణామాలను కారణంగా చూపుతూ, ఐ.పి.ఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా కూడా శనివారం రాజీనామా చేయడంతో ఇక శ్రీనివాసన్ రాజీనామా దాదాపు ఖాయమేనని పత్రికలు చెప్పేస్తున్నాయి.
అయితే రాజీనామాకు శ్రీనివాసన్ కొన్ని షరతులు విధించినట్లు తెలుస్తోంది. తనకు జెల్ల కొట్టిన జగ్దాలే, షిర్కే లను మళ్ళీ బోర్డులోకి తీసుకోకూడదని, ఐ.సి.సి సమావేశాలకు బి.సి.సి.ఐ ప్రతినిధిగా తననే పంపాలనీ, కమిటీ విచారణలో తన నిర్దోషిత్వం రుజువైతే తనను మళ్ళీ అధ్యక్షుడుగా రానివ్వాలని ఆయన షరతు విధించారట. అయితే జగ్దాలే తానిక బోర్డులో ఉండనని చెబుతున్నారు గనక ఆ సమస్య లేదు. అజయ్ షిర్కే కు స్ధానం ఉండగూడదన్న షరతును బోర్డులోని ఇతర సభ్యులు అంగీకరించబోరని తెలుస్తోంది.
మొత్తం మీద బి.సి.సి.ఐ లో ఏ ఒక్కరూ తనను రాజీనామా చేయమని అడగలేదని హుంకరించిన శ్రీనివాసన్ ఆ బోర్డులోని సభ్యులే ఒకరి తర్వాత ఒకరు తిరుగుబాటు చేస్తూ, రాజీనామాలతో, ప్రకటనలతో ఒత్తిడి పెంచడంతో తప్పుకోక తప్పడం లేదు. డబ్బు మూటలు ఇరుసుగా మారడంతో శ్రీనివాసన్ పలుకుబడి కంటే వ్యతిరేకుల బలమే ఎక్కువ తూగి అతన్ని గిరవాటు వేయనుంది.
