మావోయిస్టులది హింస కాదు, ప్రతి హింస -అరుంధతీ రాయ్ ఇంటర్వ్యూ -1


Arundhati Roy -AFP

Arundhati Roy -AFP

(అరుంధతీ రాయ్ కి పరిచయం అవసరం లేదు. తన మొదటి పుస్తకం ‘ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ నవలకు బుకర్ ప్రైజ్ గెలుచుకుని ప్రపంచానికి పరిచయం అయినప్పుడు ఆమె భారతీయ ఆంగ్ల సాహిత్యానికి కీర్తి, వన్నె తెచ్చిన ఒక అర్బన్ మహిళ. తర్వాత్తర్వాత భారత దేశ శ్రామిక ప్రజలకు నిఖార్సయిన, రాజీలేని మద్దతుదారుగా అవతరించిన అరుంధతి, భారత పాలక వర్గాలకు కంటిలో నలుసుగా మారారు.

‘వాకింగ్ విత్ ద కామ్రేడ్స్’ వ్యాస రచన ద్వారా మావోయిస్టుల లేదా మార్కెస్టు-లెనినిస్టు తాత్విక చింతనతో దాదాపు ఏకీభవించిన రాయ్, ‘కేపిటలిజం: ఎ ఘోస్ట్ స్టోరీ’ రచన ద్వారా దేశ సహజ వనరులను స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారీ వర్గం ఏ విధంగా కొల్లగొడుతున్నదీ శక్తివంతగా వివరించారు.

పాలకవర్గాలతో కుమ్మక్కై ప్రజల పోరాటాలను అందమైన వాగాడంబరాల మాటున పక్కదారి పట్టించి, నీరుగార్చే ఎన్.జి.ఓ (నాన్ గవర్న్ మెంటల్ ఆర్గనైజేషన్స్) లు కుప్పలు తెప్పలుగా వెలిసిన భారత దేశంలో అరుంధతీ రాయ్ లాంటి అర్బన్ మేధో మహిళ భారత దేశంలోని అర్ధ-వలస, అర్ధ-భూస్వామ్య పీడితులైన అశేష శ్రామిక ప్రజలకు అందించిన మేధో మద్దతు అనుపమానం అని చెప్పవచ్చు.

ఈ ఇంటర్వ్యూ 2010లో ఆమె సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ చానెల్ యాంకర్ సాగరికా ఘోష్ కు 2010 ఏప్రిల్ లో ఇచ్చినది. ఛత్తీస్ ఘర్ లో మే 25 తేదీన రాష్ట్ర కాంగ్రెస్ అగ్ర నాయకుల కాన్వాయ్ పైన మావోయిస్టులు జరిపిన మెరుపుదాడి తర్వాత భారత కార్పొరేట్ పత్రికలు మరొకసారి మావోయిస్టులపై విషం కక్కుతున్నాయి. దేశ సహజ వనరులను కొల్లగొడుతున్న విదేశీ కంపెనీల దురన్యాయాలపైనా, వారికి మద్దతుగా మహేంద్ర కర్మ లాంటి నాయకులు ‘సల్వాజుడుం’ లాంటి సంస్ధల ద్వారా అమాయక గిరిజన ప్రజానీకం పై సాగించిన ఊచకోతల పైనా పల్లెత్తు మాట మాట్లాడని పత్రికలు దేశంలో హింస మే 27, 2013 తేదీనే మొదలైనట్లు గగ్గోలు పెడుతున్నాయి. ఈ సందర్భంలో ఆమె ఇంటర్వ్యూని సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ వెబ్ సైట్ పునర్ముద్రించింది. ఆ ఇంటర్వ్యూ యధాతధ అనువాదం ఇది. -విశేఖర్)

——***——

సాగరిక ఘోష్ (ఎస్.జి): దంతెవాడ ఘటన*కు ముందు ది ఔట్ లుక్ పత్రిక కోసం మీరు ‘వాకింగ్ విత్ ద కామ్రేడ్స్’ అని ఒక ఆర్టికల్ రాశారు. దంతెవాడ (ఘటన) తర్వాత కూడా ఆ వ్యాసంలో మావోయిస్టుల లక్ష్యం పట్ల మీరు వ్యక్తపరిచిన సానుభూతితో ఇంకా కొనసాగిస్తున్నారా?

అరుంధతీ రాయ్ (ఎ.ఆర్): దంతెవాడ ముందు, తర్వాత అనే చట్రంలో ఇరికించడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే, ఈ హింసాత్మక వలయం నిజానికి ఎప్పటి నుండో జరుగుతూ వస్తున్నదేనని మీకు తెలుసు. మావోయిస్టులు పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలను చంపడం ఇదే మొదటిసారి కాదు. దానితోపాటు 2005-07 మధ్య కాలంలో చోటు చేసుకున్న దాడుల గురించి నేను రాశాను. నేను వాటిని ఎలా చూస్తానంటే, ‘ఓహో, సి.ఆర్.పి.ఎఫ్ జవాన్ల హత్యల పట్ల ఆనందం ప్రకటించే ప్రజలు ఇటువైపూ ఉన్నారు, మావోయిస్టులను పూర్తిగా తుడిచిపెట్టాలని కోరే ప్రజలు అటువైపూ ఉన్నారు’ అని ధ్వనించేలాగా జనం చెబుతారు. ఇది అలాంటిది కాదు. ప్రజలపైన బలవంతంగా రుద్దబడుతున్న ఒక యుద్ధంలో, దురదృష్టవశాత్తూ ఆ యుద్ధం పేదలపై ధనికులు సాగించే యుద్ధంగా అవతరిస్తున్న పరిస్ధితుల్లో; ఒక వ్యవస్ధలో ప్రతి చావునీ ఓ భయంకరమైన విషాదంగా మీరు చూడవలసి ఉంటుంది. ఇందులో పేదలలోకెల్లా అతిపేదలైనవారిని పేదలపై యుద్ధానికి ధనికులు నిలబెడతారు. సి.ఆర్.పి.ఎఫ్ (జవాన్లు) భయంకరమైన బాధితులు. కానీ వారు కేవలం మావోయిస్టుల వల్ల మాత్రమే బాధితులు కాదు. ఇప్పుడు చోటు చేసుకుంటున్న నిర్మాణాత్మక హింసతో కూడిన ఒక వ్యవస్ధకు వారు బాధితులు; కొనసాగుతూ పోయే ఈ శూన్య ఖండనల పరిశ్రమలో ముంచివేయాల్సిన తరహా హింస అది. ఇది పూర్తిగా అర్ధరహితం, ఎందుకంటే, వాటిని (హింసలను) ఖండించేవారికి, చాలావరకు, వారిపట్ల (జవాన్ల పట్ల) సానుభూతి ఏమీ ఉండదు. వారిని కేవలం పావులుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నారు.

ఎస్.జి: మరయితే హింసా వలయాన్ని ఎవరు బద్దలు చేస్తారు? తాను ఏ అభివృద్ధి పనిని చేపట్టినా, బ్రిడ్జిల నిర్మాణం గానీ లేక ఒక స్కూల్ ప్రారంభించినా గానీ, వాటిని మావోయిస్టులు పేల్చివేస్తున్నారనీ, అందుకే ఆ ప్రాంతాన్ని (మావోయిస్టులు లేకుండా) తుడిచి పెడుతున్నామనో, లేదా పరిశుభ్రం కావిస్తున్నామనో ప్రభుత్వం చెబుతోంది. మీ ప్రకారం ఆ హింసా వలయాన్ని ఆపడం  రాజ్యం మాత్రమే చేయగలదనా, రాజ్యం (తన బలగాలను) ఉపసంహరించుకున్నట్లయితేనే అది సాధ్యమనా మీ ఉద్దేశం?

ఎ.ఆర్: దానికొక మామూలు తరహా లిట్మస్ పరీక్ష ఉంది: మావోయిస్టులు లేని పేద ప్రాంతాల్లో ఆసుపత్రులు, స్కూళ్ళు, ఇంకా అలాంటి గొప్ప భారీ అభివృద్ధి ఉందనా దానర్ధం? అలా లేదు కదా. నిజం ఏమిటంటే, బిలాస్ పూర్ లాంటి చోట్ల డాక్టర్లు నిర్వహించిన అధ్యయనాలను చూసినా, డాక్టర్ బినాయక్ సేన్ చెప్పిన పౌష్టికాహార సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు పాఠశాలల లోపలికి వెళ్ళినట్లయితే అవి బ్యారక్ లుగా ఉపయోగించబడడాన్ని మీరు చూడవచ్చు. అవి బ్యారక్ లుగానే నిర్మించబడ్డాయి. కాబట్టి మావోయిస్టులు పాఠశాలలను పేల్చివేస్తున్నారు కాబట్టి వారు అభివృద్ధికి వ్యతిరేకం అన్నవాదన హాస్యాస్పదం.

ఎస్.జి: మీరు రాజ్య హింసను ఖండిస్తారు. కానీ నక్జల్స్ హింసను మీరు ఖండించరని మీ మీద ఆరోపణ. నిజానికి మీరు దానిని (నగ్జల్ హింసను) హేతుబద్ధం చేస్తారు. హింసను ఆరాధ్యనీయం (రొమాంటిసైజ్) సైతం చేస్తారు. ఇది మీపై చేయబడిన ఆరోపణ. నిజానికి మీరు రాసిన వ్యాసంలో నుండి చదివి వినిపించగలను కూడా. మీరేమీ రాశారంటే, “హింస యొక్క నిష్ప్రయోజనం గురించి ఏదో ఒకటి చెప్పాలన్న కోరికగా నాకు ఉందని నేను భావిస్తాను. కానీ వారేం చేస్తున్నారని నేను సూచించాలి? కోర్టుకు వెళ్లమనా, ర్యాలీ? అమరణ నిరాహార దీక్ష చేయాలనా, ఇవన్నీ హాస్యాస్పదంగా ధ్వనిస్తాయి; ఏ పార్టీకి వాళ్ళు ఓటు వేయాలి, ఏ ప్రజాస్వామిక సంస్ధ వద్దకు వారు వెళ్ళాలి?” అహింస నిష్ప్రయోజనమని మీరు చెబుతున్నట్లు కనిపిస్తోంది?

ఎ.ఆర్: అహింస గురించి, అహింసాయుత ఉద్యమాల గురించి గత 10 సంవత్సరాలుగా రాస్తున్న ఒక వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణ చేయడం ఒక వింత. కానీ అడవుల్లోకీ వెళ్ళినపుడు నేను చూసింది ఇది – అహింసాయుత ప్రతిఘటన వాస్తవంగా పని చేయలేదు; ‘నర్మదా బచావో ఆందోళన్’ లో పని చేయలేదు, మరే ఇతర అనేక అహింసాయుత ఉద్యమాలలోనూ పని చేయలేదు, మిలిటెంటు ఉద్యమాలు కూడా పని చేయలేదు. ఉద్యమాలలోని కొన్ని భాగాలలో అది పని చేసింది. కానీ అడవుల లోపల అది వేరే కధ. ఎందుకంటే, అహింస, ముఖ్యంగా గాంధేయవాద అహింస అనేదానికి ఒక విధంగా చెప్పాలంటే అలకించేవారు (audience) కావాలి. అది, ఆలకించేవారు కావలసిన ఒక నాట్య ప్రదర్శనా క్షేత్రం. అర్ధరాత్రి వేళ అటవీ గ్రామాన్ని ఒక వెయ్యి మంది పోలీసులు వచ్చి చుట్టుముడితే వాళ్లేమి చెయ్యాలి? తినడానికి ఆహారమే లేనివారు నిరాహార దీక్ష ఎలా చేయాలి? అసలు చెల్లించడానికి డబ్బే లేనివారు పన్ను చెల్లింపులను, విదేశీ వస్తువులను లేదా వినియోగ సరుకులను ఎలా బహిష్కరించాలి? 

వారి వద్ద ఏమీ లేదు. అడవిలోని హింసను నేను ‘ప్రతి హింస’గా చూస్తాను. ‘ప్రతిఘటనా హింస’గా చూస్తాను. అంతకంతకూ పెరుగుతూ పోయే హింసా వలయం నెలకొని ఉందన్న వాస్తవం పట్ల నేను భయభ్రాంతురాలనవుతాను – ప్రభుత్వం మరిన్ని ఆయుధాలు పోలీసుల చేతికి ఇచ్చేకొద్దీ, ఆ ఆయుధాలు చివరికి మావోయిస్టు పి.ఎల్.ఎ (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) చేతుల్లోకి వెళ్తున్నాయి. ఏ సమాజానికైనా అది భయంకరమైనదే. అందులో నాకు ఏ విధమైన ఆరాధన ఉన్నదని నేను అనుకోవడం లేదు. అయితే, నేను ఆరాధనకు వ్యతిరేకం కాదు. ఈ పేదజనం వేలాది మంది పారా-మిలటరీ బలగాలను పంపుతున్న అత్యంత శక్తివంతమైన రాజ్యాన్ని ఎదుర్కొని నిలబడడం నమ్మలేని వాస్తవంగా నేను భావిస్తాను. అంటే, ఆ అడవుల్లో ఆ ప్రజలకు వ్యతిరేకంగా ఎ.కె-47 లతో, గ్రెనేడ్లతో వారు ఏమి చేస్తున్నారు?

ఎస్.జి: కానీ మావోయిస్టుల వద్ద కూడా ఎ.కె-47 లు ఉన్నాయి కదా? వారి వద్ద ప్రెజర్ బాంబులు కూడా ఉన్నాయి?

ఎ.ఆర్: వాటిని పోలీసుల వద్ద నుండి లాక్కున్నారు.

………………………………………..ఇంకా ఉంది.

One thought on “మావోయిస్టులది హింస కాదు, ప్రతి హింస -అరుంధతీ రాయ్ ఇంటర్వ్యూ -1

వ్యాఖ్యానించండి