సుక్మా అడవుల్లో భారీ క్యాంపు ఎత్తివేసిన పోలీసులు


Maoists

మావోయిస్టుల దాడి ఫలితంగా అడవుల్లోని తమ భారీ శిబిరాన్ని పోలీసులు ఎత్తివేసుకున్నారని ది హిందు తెలిపింది. దాడి జరిగిన 72 గంటల లోపే వ్యాహాత్మకంగా అత్యంత ముఖ్యమైనదిగా పోలీసులు చెప్పుకున్న శిబిరాన్ని ఎత్తివేయడం అడవుల్లోని పరిస్ధితికి ఒక సూచన కావచ్చు.

పత్రిక ప్రకారం సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతం లోపల ‘మినప’ లో పోలీసులు 15 రోజుల క్రితమే భారీ శిబిరాన్ని నెలకొల్పారు. మరో భారీ దాడి ఎదురవుతుందన్న భయంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిన రెండు వారాలకే ఉపసంహరించుకున్నారని పత్రిక వ్యాఖ్యానించింది. శిబిరంలో ఉన్నవన్నీ ఒక్క పూచిక పుల్ల కూడా మిగల్చకుండా అన్నీ తెచ్చేశారని పత్రిక తెలిపింది.

గత వారం వరకు ఈ శిబిరాన్ని తమ భారీ వ్యూహాత్మక ముందడుగుగా పోలీసు అధికారులు చెప్పుకున్నారని తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ బోర్డర్ వైపుగా మావోయిస్టు పట్టు ఉన్న ప్రాంతాల్లోకి తాము చొరబడ్డామనడానికి ఈ శిబిరం ఒక గుర్తు అని వారు చెప్పారని తెలుస్తోంది. కానీ ఈ రెండు వారాల్లోనే మావోయిస్టులు ఈ శిబిరం పైకి అనేకసార్లు కాల్పులు జరిపి కొందరు పోలీసులను చంపేయడంతో పోలీసులు వెనకడుగు వేశారు. శనివారం నాటిదాడితో ఈ వెనకడుగును వేగవంతం చేసినట్లు కనిపిస్తోంది.

సుక్మాకు దక్షిణంగా 50 కి.మీ దూరంలో ఉన్న మినప శిబిరం శనివారం జరిగిన దర్భ దాడికి కీలక మైన లింకు అని జూనియర్ పోలీసు అధికారులు వ్యాఖ్యానించారు. “మినప శిబిరానికి సరఫరాలు, సౌకర్యాలు అందజేయడం పైనే అందరూ కేంద్రీకరించారు” అని వారు తెలిపారు. ఈ శిబిరం నెలకొల్పడమే వారి దృష్టిలో “ఘోరమైన ప్రణాళిక తప్పిదం.”

ఒక పక్క ఋతుపవనాలు దగ్గరవుతుండగా ఈ శిబిరం నెలకొల్పడం తెలివైన పని కాదని శిబిరంలోని పోలీసుల వాదనగా తెలుస్తోంది. “అక్టోబరులో గానీ, నవంబరులో గానీ ఈ శిబిరాన్ని నెలకొల్పి ఉండాల్సింది. అలా చేస్తే ఋతుపవనాలు వచ్చేనాటికి శిబిరం స్ధిరపడి ఉండేది” అని ఒక కానిస్టేబుల్ అన్నారు. శిబిరంలో కనీస సౌకర్యాలు లేవని వారు వాపోయారు. వర్షం, ఎండ, (మావోయిస్టుల) కాల్పుల నుండి రక్షణ పొందడానికి తగిన చెట్లు లేవని వారు తెలిపారు. మావోయిస్టుల ఏరియాలో ఇలాంటి శిబిరంలో ఉండాల్సి రావడం అననుకూలం అని వారి అభిప్రాయం.

శిబిరంలోని పైస్ధితుల వలన ప్రాణ నష్టం క్రమంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. “వాళ్ళు గురు శంక కోసం బైటికి వెళ్ళి కాల్పులకు గురయ్యారు. బుల్లెట్ గాయాలతో ఒకరు చనిపోతే ఒకరు గాయపడ్డారు. ఒకరేమో పాము కాటుకు చనిపోయారు. విషం విరుగుడికి మందు అందుబాటులో లేదు” అని ఒక కానిస్టేబుల్ తెలిపారు. అడవిలో ఒంటరిగా తమపాటికి తమని వదిలేశారని వారు వాపోయారు.

“అడవిలో, బహిరంగ స్ధలంలో, 47 డిగ్రీల వేడికి మమ్మల్ని వదిలేశారు. మీరే సౌకర్యాలు కల్పించుకోండని చెప్పారు. మమ్మల్ని మేము రక్షించుకుంటూ దాడులు చేయాలని చెప్పారు. ఇది పూర్తిగా అర్ధరహితం” అని మరొక కానిస్టేబుల్ చెప్పారు. వారిలో కొందరు ఛత్తీస్ ఘర్ మైదానాల నుండి వచ్చినవారు. అడవి గురించి బొత్తిగా తెలియనివారు. తరచుగా డీ హైడ్రేషన్ కి వారు లోనయ్యేవారు.

అయితే పోలీసు ఉన్నతాధికారుల వాదన వేరేలా ఉంది. వారి ప్రకారం శిబిరం ఉద్దేశ్యం 15 నుండి 20 రోజుల వరకు ఉంచి తీసివేయడమే. “మావోయిస్టుల ‘ప్రతిదాడుల ఎత్తుగడ’ (Tactical Counter Offensive Campaign) కాలంలో వారికి పట్టు ఉన్న ప్రాంతం లోనే అదనపు శిబిరం నెలకొల్పడం శిబిరం ఉద్దేశ్యం. తద్వారా వారు ప్రణాళిక రచనలో మునిగి ఉండగా వారితో తలపడడం లక్ష్యం” అని ఒక అధికారి చెప్పారు. కానీ మావోయిస్టు ప్రతిదాడుల ఎత్తుగడ కొనసాగుతూనే ఉన్నదని పత్రిక తెలిపింది. కానిస్టేబుళ్లే వ్యూహ రచనలను ఫైనలైజ్ చేస్తే ఇక మాపని ఎలా సాగుతుంది?’ అని ఛత్తీస్ ఘర్ డిజిపి రామ్ నివాస్ వ్యాఖ్యానించాడు.

వ్యాఖ్యానించండి