సిరియా: అంతులేని విధ్వంసం, హత్యాకాండల యుద్ధక్షేత్రం -ఫోటోలు


సామ్రాజ్యవాదం అంటేనే యుద్ధం అన్న లెనిన్ మహాశయుని చారిత్రక ప్రతిపాదన ఎంత వాస్తవమో చరిత్ర అనేకసార్లు రుజువు చేసింది. సిరియా అందుకు తాజా రుజువు. అమెరికా, ఐరోపా రాజ్యాల వనరులు, మార్కెట్ల దాహానికీ, అంతర్జాతీయ జియో-పోలిటికల్ వ్యూహ ప్రతివ్యూహాల్లో ప్రధాన ప్రత్యర్ధుల ‘ముసుగు యుద్ధానికి’ కేంద్రంగా రక్తం ఓడుతున్న సిరియా, నేటి సామ్రాజ్యవాద యుద్ధ క్షేత్రం. శాంతి విరామం లేని అనంత యుద్ధానికి బహిరంగంగానే నాందీ వాచకం పలికిన జార్జి డబ్ల్యూ బుష్, అమెరికా వాల్ స్ట్రీట్ సంపన్నుల యుద్ధోన్మాడానికి పెట్టిన ముద్దు పేరు ‘టెర్రరిజంపై ప్రపంచ యుద్ధం.’

అమెరికా, ఐరోపాలు అందిస్తున్న ఆధునిక ఆయుధాలు చేబూని ఆల్-ఖైదా టెర్రరిస్టులు సాగిస్తున్న నరమేధాలకు, బాంబు పేలుళ్లకు, సిరియా పౌరులే కాదు అక్కడి వీధులు, భవనాలు, వంతెనలు, రైళ్లు, బస్సులు, కార్లు కూడా తమదైన బాధల గాధలను ఈ దృశ్యాల్లో వినిపిస్తున్నాయి. ఎల్.టి.టి.ఇ, మావోయిస్టులు తదితర సంస్ధలు బాలురికి ఆయుధాలు ఇచ్చి వారి హక్కులను హరించివేస్తున్నారంటూ అరిచి గగ్గోలు పెట్టే అమెరికా, ఐరోపాల మానవ హక్కుల సంస్ధలు సిరియాలో తమ దేశాలు అందించే ఆయుధాలు పసిపిల్లలకు అందిస్తున్నా పల్లెత్తుమాట అనలేదు.

శ్రీలంకలో, మియాన్మార్ లో హత్యాకాండలు సాగుతున్నాయంటూ నివేదికల మీద నివేదికలు వెలువరిస్తున్న ఈ సంస్ధలు సిరియాలో సాగుతున్న అంతులేని మానవ హననాలకు కారకులైన వారిని ఇంతవరకూ ఎత్తి చూపలేదు. కిరాయి తిరుగుబాటు హంతకుల హింసోన్మాదానికి సైతం సిరియా ప్రభుత్వాన్ని బాధ్యురాలిని చేస్తూ పశ్చిమ పత్రికలు, మానవ హక్కుల సంస్ధలు కట్టగట్టుకుని చేస్తున్న దుష్ప్రచారం రానున్న రోజుల్లో సిరియాపై జరగనున్న మూకుమ్మడి దాడికి భూమికను ఏర్పరుస్తున్నాయి.

సిరియా ప్రభుత్వం రసాయన ఆయుధాలు వాడితే అది లక్ష్మణ రేఖ దాటడమే అని హుంకరించిన ఒబామా తాను మద్దతిస్తున్న ఆల్-ఖైదా టెర్రరిస్టులే రసాయన ఆయుధాలను సిరియా ప్రజలపై ప్రయోగించినా కిమ్మనకపోగా అధ్యక్షుడు బషర్ అస్సద్ నే గద్దె డిగమని శాసిస్తున్నాడు. లిబియా తరహాలో మరో రాజ్యరహిత రాజ్యాన్ని మధ్య ప్రాచ్యంలో సృష్టించి ఇరాన్ ని లొంగదీసుకోవాలని వ్యూహాలు పన్నుతున్నాడు.

సిరియా ప్రజలు, వారి ఇళ్ళు, వారి గ్రామాలు, పట్టణాలు, వారి ఆట స్ధలాలు, పిల్లల పాఠశాలలు ప్రపంచ శక్తుల యుద్ధ క్రీడలకు వేదికలుగా ఎలా మారిందీ తెలియజేసే ఈ ఫోటోలను ‘ది అట్లాంటిక్’ వెబ్ సైట్ అందజేసింది.

వ్యాఖ్యానించండి