(సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఒంటెత్తుపల్లి చిన్నప రెడ్డి ఏప్రిల్ 13 తేదీన మరణించారు. భారత దేశంలో అటు న్యాయ పరిపాలనతో పాటు ఇటు రాజకీయ పరిపాలనను కూడా ప్రగతిశీల దృక్పధం వైపుకు నడిపించడానికి ప్రయత్నించిన ‘లెజెండరీ-క్వార్టెట్’ లో జస్టిస్ చిన్నప రెడ్డి ఒకరు. జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్, జస్టిస్ పి.ఎన్.భగవతి, జస్టిస్ డి.ఎ.దేశాయ్ లతో పాటు ‘లెజెండరీ క్వార్టెట్’ గా మన్ననలు అందుకున్న నలుగురిలోకి ఆయనే చిన్నవారు. తన 90 వ యేట వృద్ధాప్యం తెచ్చిన అనారోగ్యం కారణంగా మరణించిన జస్టిస్ చిన్నపరెడ్డి పాలక వర్గాల కబంధ హస్తాల్లో నానాటికీ ఉనికిని కోల్పోతున్న భారత ప్రజల ప్రాధమిక హక్కులకు పునరుజ్జీవనం కల్పించడానికి తన సాహసోపేతమైన తీర్పుల ద్వారా ప్రయత్నించారు. అలాంటి తీర్పుల ద్వారా లబ్ది పొందిన ప్రముఖ విప్లవ కవి నిఖిలేశ్వర్ రాసిన నివాళి ఇది.)
—*—
క్రియాశీలకమైన సామాజిక న్యాయ వ్యవస్ధకు చిరునామాగా నిల్చిపోయిన జస్టిస్ చిన్నప రెడ్డి గారు, భౌతికంగా లేకపోయినా రాజ్యాంగబద్ధమైన తీర్పులతో ఒక ఉత్తమ ఒరవడిని స్ధిరపరిచి వెళ్లారు.
ఆయన సుప్రీం కోర్టు జడ్జిగా ఉండగా, ఆ రోజుల్లో, ముఖ్యంగా నలుగురు న్యాయ మూర్తులను మానవతావాదులుగా, క్రియాశీల న్యాయమూర్తులుగా పేర్కొనేవారు. జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్, పి.ఎన్.భవతి, డి.ఎ.దేశాయ్, నాలుగోవారే (వారిలో చిన్నవాడు) జస్టిస్ ఒంటెత్తుపల్లి చిన్నపరెడ్డి.
వారు ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు జడ్జిగా ఉన్నపుడే, 1971 ఆగస్టుల్లో, ఆం.ప్ర ప్రభుత్వం ముగ్గురు విప్లవ కవులను (గతంలో దిగంబర కవులుగా ఉన్నవారు) ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద అరెస్టు చేసి జైలుకి పంపింది. ఆ ముగ్గురు కవులు నిఖిలేశ్వర్, చెరబండరాజు, జ్వాలాముఖి. (వారిలో ఒకరిగా ఈ తరంతో ఆనాటి ఆ జ్ఞాపకాలను పంచుకోవాలని…)
మేము ముగ్గురం వృత్తి రీత్యా ఉపాధ్యాయులుగా, ప్రవృత్తి రీత్యా కవులుగా, ఉద్యమ రీత్యా విప్లవ రచయితల సంఘం (విరసం) సభ్యులుగా ఉన్న రోజులవి. విప్లవమే ఆశయంగా, పౌర హక్కుల ఉద్యమంలో పాల్గొంటూ సాహిత్య సదస్సులలో క్రియాశీలంగా రచనలు చేస్తూ, ప్రసంగిస్తూ ఉన్నాము. ఆనాటి హోమ్ మినిస్టర్ జలగం వెంగళరావుకు మేము, శ్రీకాకుళం లోని నక్సలైట్ల కంటే ప్రమాదకరమైన వ్యక్తులుగా కనపడ్డాం.
పీడిత వర్గాల పక్షం వహించి, వర్గ చైతన్యానికి దోహదం చేస్తున్న మా ముగ్గురిని 2 ఆగస్టు 1971 నాడు పి.డి. చట్టం కింద అరెస్టు చేసి ఆనాటి ముషీరాబాద్ (సికింద్రాబాద్) జైలులో నిర్బంధించారు. మా మీద ప్రభుత్వం చేసిన నేరారోపణలు (Grounds of Detention) స్ధూలంగా ఇవి. (విడివిడిగా ఛార్జి షీట్స్ ఉన్నందున నాపై పెట్టిన వారినే ఇక్కడ పేర్కొంటున్నాను.)
“దిగంబర కవుల ఉద్యమాన్ని ప్రారంభించిన వాళ్ళలో నువ్వు ఒకడివి. నీ మిత్రులు జ్వాలాముఖి, చెరబండరాజుతో పాటు నువ్వు శ్రీ శ్రీ ని అరసం లోంచి విరసం లోకి లాక్కొన్నావు (prodded). విరసంలో ప్రధాన కార్య నిర్వాహకుడివి.
నువ్వు రాసిన ‘భయం’ అనే కవిత ద్వారా వర్గ పోరాటాన్ని రెచ్చగొట్టావు. పోరాటంలో నిర్భయంగా మృత్యువును ఎదుర్కోమని ఉద్భోదించావు. ‘ప్రతి హింస’ అనే కవితలో సింహళంలో చెలరేగిన సాయుధ తిరుగుబాటును అణచడంలో భారతదేశం నిర్వహించిన పాత్రను వ్యంగ్యంగా విమర్శించావు. నువ్వు రాష్ట్రంలో విరివిగా పర్యటించి, విద్యార్ధుల, పౌర హక్కుల, యువకుల, విప్లవ రచయితల సభలలో పాల్గొని ప్రసంగించావు. జలంధర్ లో జరిగిన పంజాబీ రచయితల సభలో పాల్గొని, ఆ సభ చేసిన తీర్మానాలను ఆమోదించావు.” ఇలాంటివే మరికొన్ని జ్వాలాముఖి, చెరబండరాజులపై మోపిన నేరారోపణలు.
మేము జైలులో ఉండగా, బయటి ప్రపంచంలో ప్రభుత్వ చర్యను ఖండిస్తూ, మేధావులు, శాసన సభ్యులు, న్యాయవాదులు, రచయితలు, ఉపాధ్యాయులు, విద్యార్ధులు నిరసన తెలియజేశారు.
అప్పుడే పౌర హక్కుల ఉద్యమంలోకి ప్రవేశించిన న్యాయవాదులు పత్తిపాటి వెంకటేశ్వర్లు, కె.జి.కన్నాభిరాన్ మాకు అండగా నిలిచి, ఉచితంగానే మా పక్షాన వాదించి విజయం సాధించారు.
మొదట మేము writs of habeas corpus పిటిషన్లు వేయగా హై కోర్టులో జస్టిస్ కొండయ్య, ఎ.డి.వి.రెడ్డి వాటిని అనుమతించారు. ఈలోగా మేము MISA (P.D. Act) కు సంబంధించిన సలహా సంఘానికి మా సాహిత్య, రాజకీయ విశ్వాసాలను వివరిస్తూ, మా డిటెన్షన్ (నిర్బంధం) ను సవాలు చేశాము కోర్టులో.
20.9.1971 నాడు ఆం.ప్ర. హైకోర్టు బెంచిగా జస్టిస్ చిన్నపరెడ్డి, జస్టిస్ ఎ.డి.వి.రెడ్డి మా పిటిషన్ పైన విచారణ జరిపి ఇరువైపుల వాదనలు విన్నారు. ముఖ్యంగా ఆరోజు హై కోర్టు చరిత్రలోనే మొదటిసారి జరిగిన విశేషం- మా డిటెన్షన్ కు కారణాలుగా పేర్కొంటూ పోలీసులు మా ముగ్గురి కవితలను ఉదహరించారు కాబట్టి, న్యాయ మూర్తులు మా ముగ్గురి కవితలను చదవమని ఆదేశించారు. క్రిక్కిరిసిన కోర్టు హాలులో మేము కవితా పఠనం చేశాము. వాటికి ప్రతిస్పందనగా కరతాళ ధ్వనులు మోగాయి అప్పుడే!
చివరగా బెంచి తరపున జస్టిస్ చిన్నపరెడ్డి గారు తమ తీర్పు వెలువరించారు. పది పేజీల వివరణతో కూడిన ఆ జడ్జిమెంటు న్యాయ చరిత్రలో నిలిచిపోయింది. పి.డి. చట్టం లోని వైరుధ్యాలను ఎత్తి చూపుతూ పౌరుడి ప్రాధమిక హక్కుగా రాజ్యాంగ రీత్యా ఉన్న ‘స్వేచ్ఛ’కు ఎలా భంగం కలిగిందో క్లాజులవారీగా స్పష్టం చేశారు. రాజ్యాంగం లోని ఆర్టికల్ 19(1)(ఎ) సహేతుకమైన హద్దులకు లోబడి భారత పౌరులకు మాట్లాడే స్వేచ్ఛను, అభివ్యక్తి హక్కుని ఇచ్చింది. 19(1)(డి) ప్రకారం ఇండియాలో స్వేచ్ఛగా ప్రతి పౌరుడికి తిరిగే హక్కు వుంది. ఆర్.సి.కూపర్, ఎ.గోపాలన్, ఆత్మారామ్, డా.రామకృష్ణ, భరద్వాజ్, సిబ్బన్ లాల్ సక్సేనా తదితరుల కేసుల సందర్భంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను ఉదహరించారు.
దిగంబర కవులైనా, విరసం ఐనా చట్ట విరుద్ధమైన సంఘాలు కావని, మార్క్సిజం-లెనినిజం-మావోయిజంలో నమ్మకం ఏ విధంగా నిర్బంధానికి కారణం అవుతుందో అర్ధం కావడం లేదని అభిప్రాయపడుతూ -“విశ్వాసాలు నియంత్రణకు లోను కావు. విశ్వాసాల మూలంగా ఎవరినీ నిర్బంధించరాదు” (Beliefs are not subject to control. No one can be jailed for his beliefs) అని చరిత్రాత్మకమైన తీర్పు చెప్పారు. కవిత్వం చీకటిలో నుండి వెలుగులోకి నడిపించే ప్రక్రియగా కవుల సంఘర్షణలోంచి వెలువడుతుంది. కాబట్టి, ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం లేదని, పి.డి. చట్టం లోని అసంబద్ధమైన సెక్షన్ 6 (ఎ) రాజ్యాంగం లోని ఆర్టికల్ 22(5) కి వ్యతిరేకం కాబట్టి కొట్టివేస్తున్నామని, విప్లవ కవులు ముగ్గురు స్వేచ్ఛా జీవులుగా కోర్టు నుంచి వెళ్లవచ్చునని తీర్పు చెప్పారు.
జస్టిస్ చిన్నప రెడ్డి గారి ఈ తీర్పు, ఆ తర్వాత విరసం నినాదంగా “కలాలకు సంకెళ్లు లేవు; విశ్వాసాలు విశ్వ వ్యాప్తం” అని ఉత్తేజాన్ని నింపింది. కాలాంతరంలో ఈ తీర్పు ప్రతిధ్వనిస్తూ ఉంటుందని పత్రికలు సంపాదకీయాలు రాసి ప్రశంసించాయి.
(పక్ష పత్రిక “ప్రజాపంధా” నుండి)
