మూడు దేశాల పర్యటనను ముగించుకున్న చైనా ప్రధాని లీ కెషాంగ్ తన పర్యటనలో చివరి మజిలీ అయిన జర్మనీ చేరుకున్నారు. ప్రధాని పదవి స్వీకరించిన తర్వాత ఇండియాతో తన మొట్టమొదటి విదేశీ పర్యటనను ప్రారంభించిన లీ అనంతరం పాకిస్తాన్, స్విట్జర్లాండ్ సందర్శించారు. ఆదివారం జర్మనీ చేరుకున్న లీ, జర్మనీ ఛాన్సలర్ తో జరిపే చర్చల్లో ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలు చర్చకు రానున్నాయని తెలుస్తోంది. వాణిజ్య వ్యవహారాల్లో పరస్పర ఆరోపణలు చేసుకుని ఒకరిపై మరొకరు చర్యలు తీసుకున్న నేపధ్యంలో ఇరు దేశాల నాయకులు సమావేశం అవుతున్నారు.
చైనా, యూరోపియన్ యూనియన్ (ఇ.యు) ల మధ్య తలెత్తిన వాణిజ్య వివాదాన్ని పరిష్కరించుకోవాలని తాను భావిస్తున్నట్లు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ప్రకటించారు. లేనట్లయితే చైనా పైన వాణిజ్య ఆంక్షలు విధించవలసిన అవసరం ఇ.యు కి ఏర్పడవచ్చని ఆమె హెచ్చరించింది. “ఈ చర్చల్లో నిజమైన ప్రగతి సాధించడానికి జర్మనీ చేయవలసిన అన్నీ ప్రయత్నాలు చేస్తుంది” అని లీతో కలిసి ఏర్పాటు చేసిన సంయుక్త విలేఖరుల సమావేశంలో మెర్కెల్ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల నేతలు ఇతరులకు ప్రవేశం లేని సమావేశంలో చర్చించుకున్న అనంతరం విలేఖరుల సమావేశం నిర్వహించారని ది హిందు పత్రిక తెలిపింది.
చైనా తన చౌక ధరల సోలార్ పానెళ్లతో తమ మార్కెట్లను ముంచెత్తుతోందని ఇ.యు ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలు చైనాకు తలనెప్పిగా పరిణమించాయి. పోటీదారులను మార్కెట్ నుండి తరిమేసే ఉద్దేశ్యంతో చైనా చౌక పానెళ్లను డంపింగ్ చేస్తోందని ఇ.యు ఆరోపణ. చైనాలో చౌకగా మానవ శ్రమ దొరుకుతున్నదనే ఉద్దేశ్యంతోనే అనేక ఐరోపా, అమెరికా కంపెనీలు చైనాలో ఫ్యాక్టరీలు తెరిచాయి.
చైనా కార్మికులకు అతి తక్కువ వేతనాలు చెల్లించి పశ్చిమ బహుళజాతి కంపెనీలు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు మూటగట్టుకుంటున్నాయి. అందుకు తగిన ఏర్పాట్లను చైనా ప్రభుత్వం గత రెండు దశాబ్దాలుగా తమ దేశంలో చేసి ఉంచింది. ఇప్పుడు అవే ఏర్పాట్లను సాకుగా చూపి చైనా సరుకులను అడ్డుకోవాలని ఇ.యు ప్రయత్నించడం ఆ కూటమి కుటిల వాణిజ్య నీతికి నిదర్శనం. అసమాన వాణిజ్య ఒప్పందాలను రుద్దాడానికి అలవాటు పడిన పశ్చిమ దేశాలు చైనా నుండి వస్తున్న పోటీని ఎదుర్కోలేక వాణిజ్య వివాదాలను రేకెత్తించి ఏకపక్ష ఆంక్షలు విధించి లబ్ది పొందాలని చూస్తున్నాయి. ఇది వారికి కొత్తేమీ కాదు.
ఆంక్షలు విధించినట్లయితే అలాంటి చర్యలు రక్షణాపూరిత వాణిజ్య విధానం (trade protectionism) అవుతుందని చైనా ప్రధాని లీ కెషాంగ్ హెచ్చరించాడు. ఇ.యు తో సానుకూల సంబంధాలు నెరపడానికే తమ దేశం ప్రాధాన్యం ఇస్తుందని లీ పునరుద్ఘాటించాడు. జిన్ హువా వార్తా సంస్ధ ప్రకారం ఈ విషయంలో ఇ.యు తో నేరుగా వాణిజ్య చర్చలు జరపడానికే చైనా నిర్ణయించుకుంది. ఈ చర్చలు ఈ రోజు (సోమవారం) జరగవచ్చని తెలుస్తోంది.
చౌక ఉత్పత్తులను చైనా డంప్ చేస్తోందని ఆరోపిస్తూ చైనా టెలికమ్యూనికేషన్స్ ఉత్పత్తుల దిగుమతులపైన ఇ.యు ఒక విచారణ కమిటీ వేసి విచారిస్తోంది. దానికి ప్రతిగా ఇ.యు నుండి వచ్చే ఉక్కు దిగుమతులపై చైనా విచారణ నిర్వహిస్తోంది. ఇ.యు, చైనాలు పరస్పర ప్రతీకార చర్యలకు దిగినప్పటికి జపాన్, చైనాలు అనేక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం విశేషం. ఆటోమోటివ్, షిప్పింగ్, ఆయిల్ ప్రాసెసింగ్, ఎనర్జీ కన్సర్వేషన్ తదితర రంగాలలో ఆదివారం ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అంటే యూరోపియన్ యూనియన్ కంటే తమ సొంత వ్యాపారానికి జర్మనీ ప్రాధాన్యం ఇస్తోందన్నమాట. ఈ ఒప్పందాలపై ఇ.యు లోని ఇతర దేశాల స్పందన ఎలా ఉంటుందన్నదీ పరిశీలనార్హం.
సోలార్ పానెళ్ల ద్వారా విద్యుత్ ని ఉత్పత్తి చేయడంలో జర్మనీ ముందంజలో ఉంది. ఫుకుషిమా అణు ప్రమాదం అనంతరం భవిష్యత్తులో ఇక అణు విద్యుత్ కేంద్రాలు నిర్మించకూడదని జర్మనీ నిశ్చయించుకుంది. ఇప్పుడు పని చేస్తున్న అణు విద్యుత్ కర్మాగారాలను కూడా పది సంవత్సరాల్లో మూసేయాలని జర్మనీ నిర్ణయించింది. ఈ నేపధ్యంలో సంప్రదాయేతర ఇంధన రంగంలో ముఖ్యంగా సూర్య విద్యుత్ వినియోగంలో తాను అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానానికి ప్రపంచ మార్కెట్ లో భారీ వాటా దక్కుతుందని ఆశిస్తోంది. కానీ చైనా సోలార్ విద్యుత్ పరికరాలు జర్మనీకి బెడదగా పరిణమించాయి. భారత్ టెక్స్ టైల్స్ దిగుమతులను అడ్డుకోడానికి అమెరికాలో భారత్ దుస్తులు తగలబెట్టి త్వరగా అంటుకుంటాయని ప్రచారం చేసినట్లే చైనా సోలార్ పానెళ్లపై జర్మనీ దుష్ప్రచారానికి దిగింది. ఆ వంకతో కుట్రపూరితమైన విచారణకు దిగింది.
ఈ వివాదంలో ఎవరి పక్షం వహించాలన్నది మనకు అనవసరం. కానీ యూరోపియన్ యూనియన్ తో వాణిజ్యం ఎలా ఉంటుందో తెలియడానికి ఇది ఒక గీటురాయి. ప్రబల ఆర్ధిక శక్తిగా ఎదిగిన చైనా పరిస్ధితే ఇలా ఉంటే ఇండియా లాంటి దేశాల పరిస్ధితి ఊహించుకోవలసిందే.
