——
స్వెట్ షాప్ వర్కర్లు తాము కుట్టే చొక్కాలను తామే డిజైన్ చేస్తే…
*నేను స్కూల్ లో ఉండాల్సిన దాన్ని!
*బాత్ రూమ్ బ్రేక్ లంటే నాకిష్టం!
*దోపిడిని లాండ్రీ చేయడం చాలా కష్టం!
*నేనేమీ తగ్గింపు ధరల ఐటెమ్ ని కాను!
*నేను కుట్టిందే నువ్వు పిండుకుంటావు!
*1000 చావుల 40 దారాల కౌంట్!
——
అత్యంత దారుణమైన పని పరిస్ధితుల్లో, అత్యంత తక్కువ వేతనానికి, రోజుకు అనేక గంటలపాటు పని చేయించే బట్టల తయారీ షాపులను స్వెట్ షాపులని అంటారు. పారిశ్రామిక విప్లవం ప్రారంభం అయిన బ్రిటన్ పాలక ధనిక వర్గాలు స్వెట్ షాపుల ద్వారా బోలెడు పెట్టుబడిని మూటగట్టుకున్నారు. ఇటీవల బంగ్లాదేశ్ లో ఢాకా శివార్లలో కూలిపోయిన భవనంలో 1200 మంది వరకు ఇలాంటి కూలీలు చనిపోయారు. అక్కడ నెల వేతనం కేవలం 38 డాలర్లు. ఢాకా స్వెట్ షాపుల శ్రామికుల శ్రమను సొమ్ము చేసుకుని అనేక పేరుపొందిన బహుళజాతి గార్మెంట్ కంపెనీలు బిలియన్ల కొద్దీ లాభాలు సంపాదించినా ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు.
ఇలాంటి స్వెట్ షాపుల్లోని కూలీలకు తాము కుట్టే బట్టలకు తామే డిజైనర్లుగా వ్యవహరించే అవకాశం ఇస్తే అవి ఎలా ఉండవచ్చు? అనే ప్రశ్నకు కార్టూనిస్టు హాస్యస్ఫోరకంగానే ఆయినా బాధాకరమైన నిజాలతో సమాధానం ఇచ్చారు. బాల బాలికల శ్రమ దోపిడి, బాత్ రూమ్ కు వెళ్ళే సమయం కూడా ఇవ్వని యాజమానుల పచ్చి దోపిడి, అతి తక్కువ చెల్లింపులు లాంటి తమ సమస్యలను ఇలా బట్టలపై డిజైన్ చేస్తారని కార్టూనిస్టు వివరిస్తున్నారు.
ఢిల్లీ వద్ద ఉన్న మారుతీ కార్ల తయారీ కంపెనీలో సుదూరంలో ఉండే బాత్ రూమ్ లకు వొంటేలు పోసుకోవడానికి వెళ్ళి నిమిషం లోపల తిరిగి రావాలన్న నిబంధన ఉంది. లేకపోతే ఒక పూట జీతం కత్తిరిస్తారు. రెండోసారి అలా రాకపోతే రోజు జీతం కట్. అలాంటి పని పరిస్ధితుల్లో పని చేసిన కార్మికులు తాళలేక తిరగబడి పొరబాటున అధికారి మరణానికి కారణం అయ్యారు. అప్పుడు మన పెట్టుబడిదారుల పత్రికలు చేసిన గొడవ అంతా ఇంతా కాదు. ఈ నేపధ్యంలో కార్టూనిస్టు వ్యాఖ్యానాలు అతిశయోక్తి కాదని గ్రహించాలి.
