—
“…తనకు నాయకత్వ సామర్ధ్యం ఏ మాత్రం ఉందో కనిపెట్టడానికి రాహుల్ జీ ప్రయత్నిస్తున్నట్లున్నారు…”
—
కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడుగా నియమితుడయ్యాక రాహుల్ గాంధీ తన మొట్టమొదటి పార్టీ అధికారిక పర్యటనకు ఢిల్లీనే ఎంచుకున్నారు. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయాన్ని గురువారం సందర్శించిన రాహుల్ గాంధీ తాను క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోనని చెప్పారు. అంతవరకు సంతోషమే. కానీ అలా చెప్పడానికి తన అమ్మగారు, నాయనమ్మ గారిని అడ్డం పెట్టుకోవడమే ఎబ్బెట్టుగా కనిపిస్తోంది. తాను తన అమ్మగారు సోనియా గాంధీ లాగా మెతక హృదయం తనకు లేదని, తన నాయనమ్మ ఇందిరా గాంధీ లాగా దృఢంగా, నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తానని ఢిల్లీ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో వాకృచ్చారు.
తాను ఎంత దృఢమైన వ్యక్తినో రాహుల్ గాంధీ తన చర్యల ద్వారా చెప్పి ఉంటే బాగుండేది. వివిధ సమస్యలు వచ్చినపుడు దృఢమైన, నిశ్చయాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా తన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించాలి. అంతే తప్ప అమ్మ గారిని, నాయనమ్మ గారిని ఉదాహరణగా చెప్పుకోవడం దృఢ చిత్త నాయకుల లక్షణం అవుతుందా? కనీసం ‘అమ్మ, నాయనమ్మ’ అనకుండా వారి పేర్లను ఉచ్చరించినా హుందాగా ఉండేదేమో.
కాంగ్రెస్ నాయకుల అవినీతి గురించి ఇంతవరకు పల్లెత్తు మాట మాట్లాడని రాహుల్ గాంధీ దృఢ చిత్తం ఎవరికి ఉపయోగమో కూడా ప్రజలకు అర్ధం కావలసి ఉంది. ఎమర్జెన్సీ విధించి దేశంలో ప్రజాస్వామిక ఉద్యమాలను అణచివేయడంలో దృఢంగా వ్యవహరించిన ఇందిరా గాంధీ దృఢచిత్తాన్ని రాహుల్ గాంధీ మళ్ళీ ప్రదర్శించనున్నారా? ‘గరీబీ హఠావో’ అంటూ నినాదమిచ్చి ఆచరణలో ఒక్క పిసరంత కూడా పేదరికాన్ని దూరం చేయలేని నాయనమ్మ గారితో తనను పోల్చుకోవడం దేనికి సంకేతం? ‘భూ సంస్కరణల చట్టాలను’ కాగితాలకే పరిమితం చేసిన ఇందిరమ్మ పాలనను గుర్తుకు తెస్తున్నారా రాహుల్ గాంధీ?
