వూల్ విక్ హంతకుడికి ఎం.ఐ-5 జాబ్, ఒక పరిశీలన


బి.బి.సి ఇంటర్వ్యూలో అబు నుసయ్‌బా

బి.బి.సి ఇంటర్వ్యూలో అబు నుసయ్‌బా

పశ్చిమ దేశాల మిలట్రీ గూఢచార సంస్ధలు టెర్రరిస్టులతో నిత్యం సంబంధం కలిగి ఉంటాయన్న వాస్తవాన్ని వూల్ విక్ హత్యోదంతం మరొకసారి వెలుగులోకి తెచ్చింది. పశ్చిమ దేశాలకు ఇస్లామిక్ టెర్రరిజం వ్యూహాత్మక మిత్రుడే కానీ శత్రువు కాదని అంతర్జాతీయ పరిశీలకులు ఎప్పుడూ చెప్పే మాట. లండన్ వీధుల్లో జరిగిన హత్య, అనంతరం వెల్లడి అవుతున్న విషయాలు ఈ సంగతిని ధృవీకరిస్తున్నాయి.

లండన్ లోని వూల్ విక్ సబర్బ్ లో ఒక మిలట్రీ డ్రమ్మర్ ను పాశవికంగా చంపాడని బ్రిటిష్ ప్రభుత్వం ఆరోపిస్తున్న మైఖేల్ అడెబొలాజో కు బ్రిటిష్ మిలట్రీ గూఢచార సంస్ధ ఎం.ఐ-5 జాబ్ ఆఫర్ చేసిన సంగతి వెలుగులోకి వచ్చింది. అడెబోలాజో మిత్రుడొకరు బి.బి.సి కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంగతి వెల్లడించాడు.

అమెరికాలోని బోస్టన్ బాంబింగ్ నిందితులు చెచెన్యా సంతతి జర్నాయెవ్ సోదరులు అనేక సంవత్సరాలుగా ఎఫ్.బి.ఐ నిఘాలో ఉన్నట్లుగానే వూల్ విక్ హంతకులుగా చెబుతున్న మైఖేల్ అడెబోలాజో, మైఖేల్ అడెబోవాలే లు కూడా 6 సంవత్సరాలుగా ఎం.ఐ-5 నిఘాలో ఉన్నారని పత్రికలు తెలిపాయి. ఈ అంశాన్ని ఎం.ఐ-5 స్వయంగా ధృవీకరించింది కూడా.

MI5 లోగో

MI5 లోగో

అక్రమ అరెస్టు!

బి.బి.సి కి ఇంటర్వ్యూ ఇచ్చి బైటికి వచ్చిన వెంటనే సదరు వ్యక్తిని బ్రిటిష్ పోలీసులు అరెస్టు చేయడం విశేషం. అరెస్టుకు కారణాలు చెప్పడానికి పోలీసులు ఆసక్తి చూపలేదు. వూల్ విక్ హత్యానంతరం వ్యాపించిన ముస్లిం వ్యతిరేక ఉన్మాదంలో కొట్టుకుపోతున్న బ్రిటిష్ ప్రజానీకానికి ఇలాంటి అరెస్టు గురించి పట్టించుకునే తీరిక అసలే లేదు. ఇంటర్వ్యూ ఇచ్చిన వ్యక్తి అడెబోలాజో బాల్య స్నేహితుడు ‘అబు నుసయ్ బా’ అని ది హిందు తెలిపింది.

అడెబోలాజో, అడెబొవాలె లు వాస్తవానికి పరమ భక్తులైన నైజీరియా సంతతి క్రైస్తవ కుటుంబాలలో జన్మించినవారు. అనంతర కాలంలో వీరిరువురు తమ కుటుంబాలను కాదని ఇస్లాం ను స్వీకరించారు. బ్రిటన్ లో క్రైస్తవ మతం నుండి ఇస్లాం మతానికి మారుతున్న వారి సంఖ్య పెరుగుతోందని వివిధ సర్వేలు చెబుతున్నాయి. వీరిలో మహిళలు అధికంగా ఉండడం పరిశీలకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒక సర్వే ప్రకారం సంవత్సరానికి కనీసం 50,000 మంది మహిళలు స్వచ్ఛందంగానే ఇస్లాం స్వీకరిస్తున్నారు.

అడెబోలాజో, అడెబోవాలె లకు లండన్ లోని ముస్లిం తీవ్రవాద సంస్ధలతో సంబంధాలు ఉన్నాయని తెలిసాక బ్రిటిష్ మిలట్రీ గూఢచార సంస్ధ MI5 వారిపై నిఘా ఉంచడం ప్రారంభించింది. అయినప్పటికీ వూల్ విక్ హత్యను నివారించడంలో MI5 విఫలం కావడం పట్ల బ్రిటన్ లో విమర్శలు వెల్లువెత్తాయి. హత్యారోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఇలాంటి ఘటనకు పాల్పడబోతున్నట్లు ఎప్పుడూ సంకేతాలు ఇవ్వలేదని, అందువలన అనుమానించలేదని MI5 తనను తాను సమర్ధించుకుంటోంది. అంటే టెర్రరిస్టు దాడులు చేసేవారు పోలీసులకు ముందుగానే సంకేతాలిస్తారా?

తీరా చూస్తే అడెబోలాజో ను తమ తరపున పని చేయాలని MI5 కోరిందని వెల్లడయింది. ఆ మేరకు అడెబోలాజో తనతో చెప్పాడని అబు నుసయ్ బా బి.బి.సి కి తెలిపాడు. అయితే ఈ ఆఫర్ ను అడెబోలాజో తిరస్కరించాడని అబు చెబుతున్నాడు. ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్, లిబియా, సిరియాలలో బ్రిటిష్ సైనికులు ముస్లిం ప్రజలపై సాగిస్తున్న అకృత్యాల పట్ల ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉండడంతో ఆయన MI5 ఆఫర్ ను తిరస్కరించాడని అబు వివరణ. ఇది ఎంతవరకు నిజమో త్వరలోనే తెలియకపోదు.

ఎందుకు?

ఎఫ్.బి.ఐ గాని, MI5 గాని ముస్లిం తీవ్రవాదులను ఎందుకు రిక్రూట్ చేసుకుంటాయి? అందునా ‘నాగరికతలపై యుద్ధం’ పేరుతో ముస్లిం టెర్రరిజం పై ప్రపంచ యుద్ధం ప్రకటించిన అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల గూఢచార సంస్ధలు టెర్రరిజాన్ని నివారించడం మాని వారితో స్నేహం ఎందుకు చేస్తారు? ఒసామా బిన్ లాడెన్ నుండి జర్నాయెవ్ సోదరుల మీదుగా అడెబోలాజో వరకూ పశ్చిమ మిలట్రీ గూఢచార సంస్ధల తీవ్రవాద స్నేహాలనే ఎందుకు రుజువు చేస్తున్నాయి?

మైఖేల్ అడెబోలాజో

మైఖేల్ అడెబోలాజో

విశ్లేషకుల ప్రకారం ఇస్లామిక్ టెర్రరిజం పశ్చిమ దేశాల, ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలకు పెంపుడు జంతువు లాంటింది. ఆ దేశాలలోని బహుళజాతి పెట్టుబడిదారీ కంపెనీల విపరీత దోపిడీ వలన తలెత్తే ఆర్ధిక సంక్షోభాలు అక్కడి ప్రజలను అంతకంతకు ప్రభుత్వ వ్యతిరేకులుగా మార్చుతున్నాయి. లేదా ప్రజలను ఉద్యమాల బాట పట్టిస్తున్నాయి. చారిత్రకంగా 1970ల నాటి నుండి అమెరికా తదితర పశ్చిమ దేశాల్లో కార్మికులు, ఉద్యోగుల వేతనాలు స్తంభనకు గురవడమే కాక క్షీణిస్తూ వస్తున్న నేపధ్యంలో కార్మిక వర్గంలో అలజడి, ఆందోళనలు ఏర్పడడానికి తగిన పునాది అభివృద్ధి చెందుతూ వస్తోంది. వేతనాల క్షీణత వలన కొనుగోలు శక్తి నశించి కంపెనీలకు మార్కెట్ కూడా పడిపోతోంది.

ఒకవైపు వేతనాల క్షీణత వలన మార్కెట్ పడిపోవడం, మరోవైపు మార్కెట్ క్షీణతను సమతూకం చేసుకోవడానికి మరింతగా వేతనాలను తగ్గించి దానిని తమ లాభాల ఖాతాకు తరలించుకోవడం పెరిగిపోయింది. ఇది పెట్టుబడిదారీ వ్యవస్ధలో కొనసాగే అనివార్య మౌలిక వైరుధ్యం. ఈ

పరిస్ధితుల్లో విదేశీ  వనరులు మరియు మార్కెట్లను మరింతగా తమ వశం చేసుకోవాల్సిన అవసరం పశ్చిమ దేశాలకు ఏర్పడింది. కాని మీ వనరులు మాకు ఇవ్వండంటే వివిధ దేశాల పాలకులు ఒప్పుకున్నా ప్రజలు ఒప్పుకోరు కదా. ఇరాక్, ఇరాన్, లిబియా, సిరియా లాంటి పాలకులు కూడా ఒప్పుకోరు. ఇలాంటివారిని అణచివేసి దారిని తెచ్చుకోవడం అమెరికా తదితర పశ్చిమ దేశాల అవసరం. అది జరగాలంటే ప్రపంచ స్ధాయిలో వారికి ఒక శత్రువు కావాలి. ఆ శత్రువు ప్రపంచ ప్రజలందరికి శత్రువని జనం నమ్మాలి. కమ్యూనిస్టు రష్యా, చైనాలు ఎటూ లేవు గనుక కొత్త శత్రువు వారికి అవసరమైంది. ఆ విధంగా ఇస్లామిక్ టెర్రరిజం పశ్చిమ దేశాలకు ప్రధమ శత్రువుగా రంగం మీదికి వచ్చింది.

ఈ శత్రువు యొక్క కొత్త లక్షణం ఏమిటంటే అది రాజ్యాధికారం కలిగి ఉన్న శక్తి కాదు. అంటే అది ఏ దేశంలోనూ అధికారంలో లేదు. అది రాజ్యేతర శక్తి. రాజ్య శక్తులతో ఘర్షణ పడడం కంటే రాజ్యేతర శక్తులతో తలపడడం పశ్చిమ రాజ్యాలకు తేలిక. అది కూడా అటువంటి రాజ్యేతర శక్తులు తమ చెప్పు చేతల్లో ఉన్నవారైతే ‘టెర్రరిజంపై యుద్ధం’ మరింత తేలికవుతుంది. తమకు అవసరం అనుకున్నప్పుడు, అవసరం ఐన చోట టెర్రరిస్టు దాడులు, పేలుళ్లు జరపడం, జరిపించడం ఇప్పుడు రాజ్యాల చేతుల్లో పని.

టెర్రరిస్టు దాడుల ద్వారా, కనపడని శత్రువు పట్ల తమ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించి వాటి మాటున అనేక నల్ల అణచివేత చట్టాలను తెచ్చే అవకాశం పశ్చిమ ప్రభుత్వాలు దొరకబుచ్చుకుంటున్నాయి. అమెరికా భూభాగంలో అమెరికా పౌరులపై కూడా నిఘా పెట్టే చట్టం తేవడం, అమెరికా పౌరులపైన సైతం మానవ రహిత డ్రోన్ విమానాలతో దాడులు చేసి చంపేయడానికి తగిన అధికారాలను ఎఫ్.బి.ఐ, సి.ఐ.ఏ లకి కట్టబెట్టడం, బ్రిటన్ పౌరులందరి పైనా, వారి కంప్యూటర్లు, మొబైల్ ఫోన్ల పైనా నిఘా పెట్టగల అధికారాలను తనకు కట్టపెట్టుకుంటూ బ్రిటన్ ప్రభుత్వం చట్టం చేయడం, ఫ్రాన్సు ప్రభుత్వం కూడా దాదాపు ఇలాంటి చట్టం చేసుకోవడం…. ఇవన్నీ టెర్రరిజం సాకుగా చూపి చేసుకున్నా చట్టాలే.

దారుణ హత్యానంతరం అడెబొలాజొ

దారుణ హత్యానంతరం అడెబొలాజొ

ఈ చట్టాలన్నీ ఆర్ధిక సంక్షోభ పరిస్ధితుల రీత్యా ప్రజల్లో నానాటికీ ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని అణచివేయడానికి తెచ్చుకున్న చట్టాలు. కానీ ప్రభుత్వాలు మాత్రం టెర్రరిజాన్ని తుడముట్టించడానికి ఇవి అవసరమని చెబుతున్నాయి. వాస్తవంలో టెర్రరిస్టులకు స్నేహం చేస్తున్నది, వారిని గూఢచార సంస్ధల్లో రిక్రూట్ చేసుకుంటున్నది ప్రభుత్వాలే.

నిజానికి ప్రభుత్వాలు విరుచుకుపడవలసింది సంక్షోభాలను దేశాలపైనా, ప్రజలపైనా రుద్దుతున్న బహుళజాతి కంపెనీల పైన. విపరీతమైన లాభదాహం, ధన లాలసలతో అవినీతి చర్యలకు పాల్పడుతూ దేశ ఆర్ధిక వ్యవస్ధలను స్తంభింపజేస్తున్న బడా బహుళజాతి కంపెనీలను అరికట్టడానికి బదులు వాటి చర్యలపై అసంతృప్తి పెంచుకుంటున్న ప్రజలను అణచివేయడానికి పశ్చిమ ప్రభుత్వాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

ఈ ఏర్పాట్లలో భాగమే టెర్రరిస్టులతో స్నేహాలు. టెర్రరిస్టుల రిక్రూట్ మెంట్లు. ఒసామా బిన్ లాడెన్, డేవిడ్ కోలమాన్ హేడ్లీ, జర్నాహేవ్ బ్రదర్స్, అడెబోలాజో… వీరంతా ఈ కోవలోనివారే. పశ్చిమ దేశాలు ఇపుడు ఏదేశంలో ఐనా జోక్యం చేసుకోవాలంటే అక్కడ టెర్రరిస్టులు హఠాత్తుగా దాడులకు, పేలుళ్లకు దిగుతారు. లేదా తిరుగుబాటు లేవదీస్తారు. అప్పుడు దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడానికి అమెరికా అనే శ్రీ మహా విష్ణువు అవతరిస్తాడు. కానీ అమెరికా (& co) చేసేది మాత్రం శిష్ట శిక్షణ, దుష్ట రక్షణ. ఎందుకంటే అమెరికాకు కావలసిన పని చేసిపెట్టేది దుష్టులే కనుక.

సమ్మతి తయారి

ది హిందు పత్రిక ప్రకారం ఇప్పుడు బ్రిటన్ లో వాతావరణం ముస్లింలకు వ్యతిరేకంగా ఛార్జి అయి ఉంది. తెల్ల దురహంకార మితవాద సంస్ధలు, బ్రిటిష్ జాతీయ దురహంకార సంస్ధలు వీధుల్లో కరాళ నృత్యం చేస్తున్నాయి. ముస్లింలకు వ్యతిరేకంగా ఈ సంస్ధల నాయకులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈ వాతావరణానికి భయపది ముస్లిం సంస్ధలు కూడా అబెడొలాజో లాంటి వ్యక్తులను సహించబోమంటూ ప్రకటనలు ఇవ్వాల్సిన పరిస్ధితి. మసీదుల పైనా, ముస్లిం వ్యక్తుల పైనా దాడులు జరుగుతున్నాయి. ముస్లింల మాటలకు పెడార్ధాలు లాగుతున్నారు. ముస్లింలకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ముస్లిం మహిళల తలల పైన ముసుగులు బలవంతంగా లాగేస్తున్నారు. ముస్లిం ప్రార్ధనా స్ధలాలపై దాడులు చేసే పనుల సమన్వయం కోసం ఆన్ లైన్ లో కార్యకలాపాలు పెరిగిపోయాయి.

బ్రిటిష్ ప్రభుత్వానికి కావలసింది ఇదే. ఇప్పుడిక బ్రిటిష్ ప్రజలకు అసలు సమస్యలైన నిరుద్యోగం, పేదరికం, వేతనాల కోత, పెన్షన్ల రద్దు, ప్రైవేటీకరణ మొదలైనవన్నీ పక్కకు పోయాయి. తమ వాస్తవ సమస్యలను వదిలేసి ‘ముస్లిం టెర్రరిజం’ అనే మాన్యుఫాక్చర్డ్ సమస్య చుట్టూ జనం మూగడమే యూరోపియన్ ప్రభుత్వాలకు అవసరం.

అంతే కాకుండా త్వరలొ సిరియాపై దురాక్రమణ యుద్ధానికి అమెరికా, ఐరోపాలు తెగబడనున్నాయి. రష్యాతో కలిసి జెనీవాలోశాంతి సదస్సు జరుపుతాము అంటూనే అక్కడి తిరుగుబాటుదారులకు ఆయుధాలు ఇవ్వడానికి సెనెట్ కమిటీ ఒక బిల్లును ఆమోదించింది. సిరియా మిత్ర సంస్ధ లెబనీస్ హిజ్బొల్లాను టెర్రరిస్టు సంస్ధగా ప్రకటించాలని బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ లు యూరోపియన్ యూనియన్ ను డిమాండ్ చేస్తున్నాయి. అమెరికా చాలా కాలం క్రితమే ఇ.యు ముందు ఈ డిమాండ్ ఉంచింది. అదిప్పుడు నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. సిరియాపై విధించిన ‘ఆయుధ సరఫరా నిషేధం’ తొలగించాలని ఇ.యును బ్రిటన్ కోరుతోంది.

ఇవన్నీ మధ్య ప్రాచ్యంలో రాబోయే ప్రాంతీయ యుద్ధానికి సూచనలుగా కనిపిస్తున్నాయి. ఈ యుద్ధానికి పశ్చిమ దేశాల్లో ఇంకా మద్దతు రాలేదు. సిరియాలో జోక్యం అనవసరమని అమెరికా, ఐరోపాల ప్రజలు భావిస్తున్నట్లు వివిధ సర్వేలు చెబుతున్నాయి. కనుక ప్రజలను సిరియా జోక్యానికి అనుకూలంగా మార్చవలసిన అవసరం పశ్చిమ దేశాల ముందు నిలబడి ఉంది. నోమ్ చోమ్ స్కీ మాటల్లో చెప్పాలంటి ‘సమ్మతి తయారి’ (manufacturing consent) అన్నమాట!

ప్రజలు వాస్తవ పరిస్ధితుల ఆధారంగా తమంతట తాము ఒక అభిప్రాయానికి రావడానికి బదులు స్వార్ధ శక్తులు పూనుకుని ప్రజలు తమకు అనుకూలమైన అభిప్రాయానికి వచ్చేలా కొన్ని సంఘటనలు సృష్టించడం ఈ ‘సమ్మతి తయారి’ లో భాగం. పశ్చిమ దేశాల్లో సమ్మతి తయారీ పరిశ్రమ దశాబ్దాలుగా ఆచరణలో ఉన్న సాధారణ ఎత్తుగడ. సమ్మతి తయారీకి, ముస్లిం టెర్రరిజానికి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని గుర్తించకపోతే చాలా టెర్రరిస్టు దాడులు ఎందుకు జరుగుతున్నాయో అర్ధం కాకపోగా, తప్పుడు నిర్ధారణలకు వచ్చే ప్రమాదమ్ ఉంది. తస్మాత్ జాగ్రత్త!

వ్యాఖ్యానించండి