—*—
సర్వేయర్: ఒబామా పరిపాలనను ఎక్కువగా నష్టపరుస్తున్న కుంభకోణం ఏదని మీ అభిప్రాయం? బెంఘాజి… ఎ.పి, ఫాక్స్ న్యూస్ సంస్ధల ఫోన్ రికార్డులను ప్రభుత్వం సంపాదించడమా లేక కన్సర్వేటివ్ గ్రూపులను ఐ.ఆర్.ఎస్ టార్గెట్ చెయ్యడమా?
ముక్త కంఠంతో: ఆర్ధిక వ్యవస్ధ!!
—*—
2008 ప్రపంచ ఆర్ధిక సంక్షోభం దరిమిలా అమెరికా ప్రజల జీవన ప్రమాణాలు ఘోరంగా దిగజారాయి. సంక్షోభ భారం అంతా ప్రజలపై మోపి చేతులు దులుపుకున్న ప్రభుత్వం సంక్షోభానికి కారణమైన వాల్ స్ట్రీట్ కంపెనీలను మాత్రం అప్పులు బెయిలౌట్లతో ఇంకా మేపుతూనే ఉంది. అప్పులు, బెయిలౌట్ల భారం మళ్ళీ ప్రజలపైనే పడుతోంది. ఈ భారాన్ని వేతనాల కోతలు, ఉద్యోగాల సదుపాయాల కోత లేదా రద్దు, వైద్య సదుపాయాల కోత లేదా రద్దు, ఖర్చుల్లో కోత… మొదలైన చర్యల ద్వారా ప్రజలపై మోపుతున్నారు.
ఫలితంగా నిరుద్యోగం, దరిద్రం పెరిగిపోయింది. అనేకమంది ఉద్యోగాలు వెతకడమే మానుకున్నారు. దానినే నిరుద్యోగం తగ్గిపోవడంగా ప్రభుత్వం చూపించుకుంటోంది. మరోవైపు యుద్ధాల ఖర్చు తగ్గకపోగా సిరియా లాంటి కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నారు. ఈ నేపధ్యంలో అమెరికా ఆర్ధిక వ్యవస్ధే అతి పెద్ద కుంభకోణం అనీ అదే ఒబామా పరిపాలనలో నష్టం కలిగిస్తున్న అంశం అనీ ప్రజలు భావించడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. కార్టూనిస్టు అదే చెబుతున్నారు.
కార్టూన్ లోని సర్వేయర్ లేవనెత్తిన వివిధ కుంభకోణాల వివరణ క్లుప్తంగా ఇది:
బెంఘాజి కుంభకోణం అంటే అమెరికా మద్దతిచ్చి లిబియా గద్దెపై కూర్చోబెట్టిన ఆల్-ఖైదా మిలిటెంట్ల చేతుల్లోనే అమెరికా రాయబారి క్రిస్టఫర్ స్టీవెన్స్ సెప్టెంబరు 11, 2012 తేదీన దారుణ హత్యకు గురికావడం. ‘ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లిమ్స్’ అని సినిమాకి స్పందనగానే బెంఘాజి ప్రజలు అప్పటికప్పుడు అమెరికా రాయబార కార్యాలయంపై దాడి చేసి స్టీవెన్స్ ని చంపేశారని ఒబామా ప్రభుత్వం మొదట చెప్పింది. అయితే చంపింది జనం కాదని అమెరికా మద్దతిచ్చిన టెర్రరిస్టు సంస్ధలే అని ఆ తర్వాత అమెరికా ప్రభుత్వం ఒప్పుకోక తప్పలేదు.
అసోసియేటెడ్ ప్రెస్, ఫాక్స్ న్యూస్ వార్తా సంస్ధల పై ఒబామా ప్రభుత్వం నిఘా పెట్టిందని ఇటీవల వెలుగులోకి వచ్చింది. 2012 ఏప్రిల్, మే నెలలకు సంబంధించి ఏ.పి వార్తా సంస్ధల కార్యాలయాలు, ఎడిటర్లు, విలేఖరులు తదితరుల ఫోన్, ఫాక్స్ వివరాలను జస్టిస్ డిపార్ట్ మెంటు ఫోన్ సంస్ధల నుండి అక్రమంగా సంపాదించిందని వారం రోజుల క్రితం ఎ.పి ఆరోపించింది. అలాగే ఫాక్స్ న్యూస్ కి చెందిన ఒక విలేఖరి రికార్డులను కూడా జస్టిస్ డిపార్ట్ మెంట్ సంపాదించిందని మూడు రోజుల క్రితం కోర్టు రికార్డుల ద్వారా వెలుగులోకి వచ్చింది.
అమెరికా ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్ విభాగం ఆదాయ పన్ను రాయితీలకు సంబంధించి కన్సర్వేటివ్ గ్రూపలను టార్గెట్ చేసిందని వచ్చిన ఆరోపణలు అమెరికాలో చిన్నపాటి కుదుపును సృష్టించింది. టీ పార్టీ, పేట్రియాట్ లాంటి గ్రూపులు కన్సర్వేటివ్ భావాలు కలిగిన మితవాద గ్రూపులు. ఇవి రిపబ్లికన్ పార్టీకి మద్దతుదారులు. ఆదాయ పన్ను రాయితీ కోసం దరఖాస్తులు వచ్చినపుడు ఇలాంటి గ్రూపులను వేరు చేసి ప్రత్యేకంగా పరిశీలించారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలతో ఐ.ఆర్.ఎస్ చీఫ్ లోయిస్ లెర్నర్ ని మార్చి కొత్త వ్యక్తిని నియమించారు. ఆమె మాత్రం తానేమీ తప్పు చేయలేదని కాంగ్రెషనల్ కమిటీ ముందు సమర్ధించుకుంది.
