బి.బి.సి, రాయిటర్స్ వార్తా సంస్ధల ప్రకారం విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరిని బ్రిటన్ లోని ఎసెక్స్ పోలీసులు అరెస్టు చేశారు. విమానంలో 297 మంది ప్రయాణిస్తున్నారని ది హిందు, ఎన్.డి.టి.వి, రాయిటర్స్ చెప్పగా బి.బి.సి మాత్రం ప్రయాణికులు 308 మంది విమాన సిబ్బంది 14 మంది విమానంలో ఉన్నారని తెలిపింది.
రెండు రోజుల క్రితం లండన్ లోని వూల్ విక్ అనే చోట ఇద్దరు నైజీరియా సంతతి యువకులు ఒక బ్రిటిష్ సైనికుడిని నడి రోడ్డు పైన హత్య చేసిన నేపధ్యంలో తాజా విమాన సంఘటనపై భయాందోళనలు నెలకొన్నాయి. అయితే విమానానికి ఎటువంటి ప్రమాదము తలపెట్టలేదని రాయిటర్స్ వార్తా సంస్ధ తాజాగా తెలిపింది.
విమానాశ్రయం లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తోటి విమాన సిబ్బంది మాట్లాడకపోవడం లాంటి కారణాల వలన విమానాశ్రయానికి వస్తున్న విమానాన్ని కంట్రోలర్ సిబ్బంది గుర్తించలేని పరిస్ధితుల్లో బ్రిటన్ మిలట్రీ అటువంటి విమానాలను ఎస్కార్ట్ చేయడానికి ఫైటర్ జెట్ విమానాలను పంపుతుందని రాయిటర్స్ తెలిపింది.
పాకిస్ధాన్ కి చెందిన PK709 నెంబరు గల బోయింగ్ 777 విమానం లాహోర్ నుండి ఉత్తర ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ చేరవలసి ఉంది. అయితే మాంచెస్టర్ విమానాశ్రయంలోకి దిగడానికి కొద్ది సేపటి ముందు విమానం అకస్మాత్తుగా యార్క్ వద్ద ఉత్తర సముద్రానికి మళ్లించబడిందని అనంతరం స్టాన్ స్టడ్ విమానాశ్రయంలోకి దానిని దించారని ది హిందు తెలిపింది. రెండు RAF టైఫూన్ ఫైటర్ జెట్ విమానాలు విమానాన్ని దారి మళ్లించి స్టాన్ స్టడ్ కు కొనిపోయాయని సదరు పత్రిక తెలిపింది.
లండన్ పోలీసులను ఉటంకిస్తూ రాయిటర్స్ ఇలా తెలిపింది, “ఎసెక్స్ పోలీసులు, స్టాన్ స్టడ్ విమానాశ్రయానికి మళ్లించబడిన పౌర విమానంలోకి ప్రవేశించి ఇద్దరు ప్రయాణీకులను అరెస్టు చేశారు. విమానాన్ని ప్రమాదంలో పడవేయడానికి వీరు ప్రయత్నించినట్లు అనుమానిస్తున్నారు. వారిని విమానం నుండి తొలగించారు.” భద్రతా దళాల సమాచారం ప్రకారం టెర్రరిస్టుల దాడికి విమానం టార్గెట్ కాదని రాయిటర్స్ తెలిపింది.
విమానాన్ని స్టాన్ స్టడ్ విమానాశ్రయానికే ఎందుకు మళ్లించారు? అరెస్టుల కార్యక్రమం మాంచెస్టర్ విమానాశ్రయంలోనే చేయొచ్చు కదా? ఈ ప్రశ్నకు రాయిటర్స్ వార్తా సంస్ధ సమాధానం చెప్పింది. మాంచెస్టర్ విమానాశ్రయం అయితే ఎప్పుడూ బిజీగా ఉండే స్ధలం. భద్రతా ప్రమాదం ఉన్న విమానాలతో డీల్ చేయడం అక్కడ కుదరదు. వచ్చే పోయే విమానాలకు ఆటంకం కలుగుతుంది. కానీ స్టాన్ స్టడ్ విమానాశ్రయం రద్దీ లేని ప్రాంతం. అక్కడయితే తీరిగ్గా విమానాన్ని దించి అరెస్టులు, దాడి, చుట్టుముట్టడం లాంటివి తేలికగా చేయోచ్చు.
వైరుధ్యం
రాయిటర్స్ కధనంలో వైరుధ్యం ఉంది. భద్రతా దళాల సమాచారం ప్రకారం టెర్రరిస్టులకు టార్గెట్ విమానం కాదు. కానీ ఎసెక్స్ పోలీసులు మాత్రం ‘విమానాన్ని ప్రమాదంలో పడవేయడానికి ప్రయత్నించిన’ ఇద్దరిని అరెస్టు చేశారు. ఒక పక్క వారి టార్గెట్ విమానం కాదంటూనే మరో పక్క విమానాన్ని ప్రమాదంలో పడవేయడానికి ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు అని రాయిటర్స్ (అధికారులను ఉటంకిస్తూ) చెబుతోంది.
ఏం జరిగి ఉండవచ్చు. రెండు రోజుల క్రితం వూల్ విక్ లో జరిగిన బ్రిటన్ ఆర్మీ సభ్యుడి హత్య దృష్ట్యా బ్రిటన్ అంతా అప్రమత్తంగా ఉన్నదని బ్రిటన్ నుండి నడిచే వార్తా సంస్ధ అయిన రాయిటర్స్ చెబుతోంది. ఈ అప్రమత్తతలో భాగంగా పాకిస్ధాన్ నుండి వస్తున్న విమానంలో టెర్రరిస్టులు ఉండి ఉండవచ్చని బ్రిటిష్ బుర్రలు ముందుగానే పసిగట్టాయి. వారి అనుమానాలకు తగ్గట్టుగా ఇద్దరు ప్రయాణికులు అదుపు తప్పి ప్రవర్తించారు. దానితో అది మాంచెస్టర్ విమానాశ్రయంలోకి దిగక ముందే రెండు జెట్ ఫైటర్లను పంపి దానిని స్టాన్ స్టడ్ విమానాశ్రయం వద్దకి బలవంతంగా తీసుకుపోయారు.
బాంబు ప్రమాదం ఉండి ఉండవచ్చని తమకు (బ్రిటన్ అధికారులు) చెప్పారని పాకిస్ధాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ప్రతినిధి జూఫికర్ బిజరాని చెప్పాడని సి.ఎన్.ఎన్ చెబుతోంది. తమకు అందిన సమాచారం నిజమా కాదా చెప్పడానికి ఆయన నిరాకరించారట! సి.ఎన్.ఎన్ ప్రకారం విమానాన్ని దారి మళ్లించడానికి ఒక్క ఫైటర్ జెట్ ని మాత్రమే వినియోగించారు.
సి.ఎన్.ఎన్ మరికొంత వివరంగా విషయాన్ని రిపోర్ట్ చేసింది. దాని ప్రకారం విమానంలో ఒక ప్రయాణీకుడు అదుపు తప్పి ప్రవర్తించడమే విమానాన్ని దారి మళ్లించడానికి కారణం. “ఆ ప్రయాణీకుడు విమానంలో అల్లరిగా ప్రవర్తిస్తున్నాడు. ప్రయాణీకులను, సిబ్బందిని భయపడే విధంగా వ్యవహరిస్తున్నాడు. కోపంతో వ్యవహరించే ప్రయాణీకులకు ఇది ఒక గుణపాఠం” అని ఎయిర్ లైన్స్ కి చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారని సి.ఎన్.ఎన్ తెలిపింది.
పాకిస్ధాన్ ఎయిర్ లైన్స్ కి చెందిన మరో అధికారి మషూద్ తజ్వార్ ప్రకారం మరో 20 నిమిషాల్లో విమానం మాంచెస్టర్ లో దిగుతుందనగా అక్కడి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కు ‘Terror threat’ తాము ఎదుర్కొంటున్నామని విమానం నుండి సమాచారం వచ్చింది. “ఈ సమాచారం బాంబు భయానికి సంబంధించి అయి ఉండవచ్చు. కానీ ధృవీకరించలేను” అని తజ్వార్ తెలిపాడు. అనంతరం విమానాన్ని స్టాన్ స్టడ్ కు మళ్లించి ఇద్దరినీ అరెస్టు చేశారని తజ్వార్ తెలిపాడు. అయితే ఈ విషయాన్ని బ్రిటన్ పోలీసులు ధృవీకరించడంలేదు.
కంటికి కన్ను
బ్రిటిష్ ఆర్మీ సిబ్బంది ఒకరిని వూల్ విక్ లో నడిరోడ్డు పై చంపేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నైజీరియా సంతతి యువకులు సంఘటన స్ధలంలోనే అక్కడ గుమి కూడిన జనంతో మాట్లాడారు. ముస్లిం దేశాలలో బ్రిటిష్ సైనికులు సాగిస్తున్న అకృత్యాలకు ప్రతీకారంగానే తాము ఈ హత్య చేశామని వారు అక్కడ తమతో మాట్లాడిన ఒక మహిళాతో అన్నారని రష్యా టుడే తెలిపింది. ‘కంటికి కన్ను, పంటికి పన్ను’ అని వారు అన్నట్లు తెలుస్తోంది. అంటే తెల్ల దేశాలు పాకిస్ధాన్, ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్, లిబియా, సిరియా, యెమెన్, తదితర ముస్లిం దేశాలలో సాగిస్తున్న టెర్రరిస్టు యుద్ధాన్ని బ్రిటిష్ గడ్డ మీదికి తేవడానికి అతను ప్రయత్నించాడని భావించచని ఆర్.టి వ్యాఖ్యానించింది.
“మేమిలా చేయడానికి గల ఏకైక కారణం ముస్లింలు ప్రతిరోజూ చనిపోవడమే. ఈ బ్రిటిష్ సైనికుడు కంటికి కన్ను, పంటికి పన్ను” అని హత్యకు పాల్పడిన ఇద్దరిలో ఒకరుగా అనుమానిస్తున్న అబేడోలాజ్ తనతో మాట్లాడిన మహిళతో అన్నట్లు తెలుస్తోంది. “మహిళలు ఈ రోజు ఈ ఘటనను చూడవలసి వచ్చినందుకు నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను. కానీ మా నేలపై మా మహిళలు కూడా ఇలాంటివి అనేకం చూస్తున్నారు. మీ ప్రజలు ఎన్నటికీ భద్రంగా ఉండలేరు. మీ ప్రభుత్వాన్ని తొలగించండి, వారు మీ గురించి పట్టించుకోరు.” అని సదరు వ్యక్తి అన్నాడని ఆర్.టి తెలిపింది.
(వూల్‌విక్ హత్యా స్ధలం దృశ్యాలను కింది ఫొటోల్లో చూడవచ్చు.)
- హత్యకు గురైన అర్మీ డ్రమ్మర్ లీ రిగ్బి
- లండన్ మేయర్ బోరిస్ జాన్సన్ సందర్శన
- పోలీసు కాపలా
- ఫోరెన్సిక్ నిపుణులు
ఆఫ్ఘన్, ఇరాక్ యుద్ధాల్లో వేల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. నాటో సైన్యాలు టార్గెట్ చేసి మరీ అమాయక పౌరులను చంపేసిన ఘటనలు కోకొల్లలు. ఆఫ్ఘనిస్ధాన్ లో నైతే అమెరికా సైనికులు అర్ధరాత్రులప్పుడు ఇళ్ళల్లో దూరి మహిళలు పిల్లలను కాల్చి చంపిన సంఘటనలు అనేకం జరిగాయి. మతి చలించిన సైనికులు ఆ చర్యలకు పాల్పడ్డారని, యుద్ధం జరిగేటప్పుడు ‘కోలేటర్ డామేజ్’ తప్పదని… ఇలా పలురకాల కారణాలు చెప్పి పశ్చిమ దేశాలు అమాయక పౌరుల హత్యలకు తమ బాధ్యత లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాయి. అబెడోలాజ్ సరిగ్గా ఇదే విషయాలు చెప్పడం గమనార్హం.
“మనమే ముస్లిం టెర్రరిజాన్ని పోషిస్తున్నాము. టెర్రరిజం ఉద్భవించి కొనసాగడానికి మన చర్యలే కారణం” అని బ్రిటిష్ చట్ట సభల సభ్యులు కూడా పలువురు వ్యాఖ్యానించడం గమనించవచ్చు. ప్రముఖ అమెరికన్ బాషా శాస్త్రవేత్త నోమ్ చోమ్ స్కీ ఇటీవల రష్యా టుడే తో మాట్లాడుతూ డ్రోన్ దాడులు పచ్చి టెర్రరిస్టు చర్యలేనని, ఈ టెర్రరిస్టు దాడులకు, ఆఫ్ఘన్, ఇరాక్ దురాక్రమణ యుద్ధాలకు గాను బుష్, ఒబామా, టోనీ బ్లెయిర్ లను అంతర్జాతీయ న్యాయస్ధానంలో విచారించాలని అభిప్రాయపడ్డాడు. సగటు ఆలోచనాపరుడెవరైనా నోమ్ చోమ్ స్కీ అభిప్రాయంతో ఏకీభవించకుండా ఉండలేరు.
వూల్ విక్ హత్య పైన ఆర్.టి అందజేసిన వీడియోను ఈ లింక్ లో చూడవచ్చు.









