ఐ.పి.ఎల్ ఫిక్సింగ్: విందూ, చెన్నై యజమాని పందెందారు


Vindoo Dara Singh

Vindoo Dara Singh

చనిపోయిన మాజీ నటుడు దారాసింగ్ తనయుడు విందూ దారా సింగ్, చెన్నై సూపర్ కింగ్స్ యజమాని, బి.సి.సి.ఐ కార్యదర్శి శ్రీనివాసన్ అల్లుడు గురునాధ్ మీయప్పన్ తరుపున అనేకసార్లు పందెం కాసినట్లు తెలుస్తోంది. మీయప్పన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సి.ఐ.ఓ (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) కూడా. అనేకమంది ప్రముఖుల పేర్లను కూడా విందూ సింగ్ చెన్నై పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. అనేకమంది సినిమా తారలు, పేరు మోసిన మాజీ క్రికెటర్, ప్రస్తుతం కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్న ప్రముఖ మాజీ క్రికెటర్… ఇలా అనేకమంది ప్రముఖుల పేర్లను విందూ సింగ్ చెప్పినట్లు ముంబై పోలీసులను ఉటంకిస్తూ ది హిందు తెలిపింది.

“గురునాధ్ తదితరుల గురించి ఆయన చాలా విషయాలు చెపుతున్నారు. గురునాధ్ ని ప్రశ్నించే అవకాశం వస్తే తప్ప ఏ విషయాన్ని మేము నిర్ధారించి చెప్పలేము” అని ఒక పోలీసు అధికారి చెప్పాడని పత్రిక తెలిపింది. గురునాధ్ ని ప్రశ్నించడానికి ముంబై నుండి క్రైమ్ భ్రాంచి పోలీసులు చెన్నైలోని ఆయన ఇంటికి వచ్చినప్పటికీ ఆయన ఇంటిలో లేకపోవడంతో ప్రశ్నించడం కుదరలేదు. శుక్రవారం ఆయనను ముంబై రావలసిందిగా పోలీసులు ఆదేశించారు. తాను ఐ.పి.ఎల్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత సోమవారం వస్తానని గురునాధ్ మీయప్పన్ కోరారు. అయితే దానికి ముంబై పోలీసులు అంగీకరించలేదు.

విందూ దారా సింగ్ మొదటి నుండి ఐ.పి.ఎల్ మ్యాచుల్లో బెట్టింగ్ లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ముదటి ఐదు టోర్నమెంట్లలోనూ ఆయన పలు నష్టాలు చవిచూశారనీ, ఐ.పి.ఎల్-6 లో మాత్రం ఇప్పటిదాకా 17 లక్షలు సంపాదించానని

Meiyappan with Dhoni

Meiyappan with Dhoni

పోలీసులకు చెప్పారట. అకస్మాత్తుగా ఇంత లాభం ఎలా వచ్చిందో విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు. మీయప్పన్ పరిచయంతోటే విందూ దశ తిరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

“రెండు సంవత్సరాల క్రితం ఆయనా,  గురునాధ్ మీయప్పన్ మిత్రులయ్యారు. విందూ ఒప్పుకోలు ప్రకారం ఆయన మొదటి సారిగా ఐ.పి.ఎల్ ప్రస్తుత సీజన్ లో 17 లక్షలు సంపాదించారు” అని ఒక పోలీసు అధికారి తెలిపారు. “ఇంతవరకూ ఎలాంటి నిర్ధారణలకు మేము రాలేదు. కానీ ఆయనకి అకస్మాత్తుగా సక్సెస్ ఎలా వచ్చిపదిందో విచారిస్తున్నాము” అని సదరు అధికారి తెలిపారు.

ఇదిలా ఉండగా మీయప్పన్ పట్ల పత్రికల వ్యవహరిస్తున్న తీరును ఆయన మామగారు, బి.సి.సి.ఐ కార్యదర్శి శ్రీనివాసన్ తప్పు పడుతున్నారు. మీడియా సొంత విచారణ చేస్తున్నదని ఆయన ఆక్షేపించారు. అయితే అంతకుమించి మాట్లాడడానికి ఆయన ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.

పాకిస్ధాన్ అంపైర్ అసద్ రవూఫ్ కూడా ఐ.పి.ఎల్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకోవడం కొత్త పరిణామం. గతంలో ఎన్నడూ అంపైర్ల పేర్లు ఫిక్సింగ్ వివాదాల్లో వినపడలేదు. ఒక వేళ వినపడినా ఒకటి, రెండు కేసుల్లోనే. అది కూడా బంగ్లాదేశ్ అంపైర్ల విషయంలో అక్కడి స్ధానిక లీగ్ టోర్నమెంటులో జరిగినట్లు వార్తలు వచ్చాయి తప్ప అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్లలో అంపైర్ల పేర్లు ఎన్నడూ వినపడలేదు. ఐ.పి.ఎల్ ఆ ఘనతను కూడా మూట కట్టుకోవడం విశేషం. రవూఫ్ ను ముంబై పోలీసులు విచారిస్తున్న నేపధ్యంలో ఆయనను చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంటు నుండి తప్పిస్తున్నట్లు ఐ.సి.సి ప్రకటించింది. మొదటిసారిగా ఆవిధంగా ఒక అంపైర్ తల అంతర్జాతీయ క్రికెట్ లో రాలి పడింది.

Vindoo with Dhoni's wife

Vindoo with Dhoni’s wife

కొందరు ప్రముఖులు బెట్టింగ్ ను చట్టబద్ధం చేయాలని సూచిస్తున్నారు. ఇంగ్లాండ్ క్రికెట్ మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయ్ కాట్ ఈ మేరకు ఇ.ఎస్.పి.ఎన్ క్రికిన్ఫో కు ఇంటర్వ్యూ ఇస్తూ సూచించినట్లు తెలుస్తోంది. ఆసియా దేశాల్లోనే ఫిక్సింగ్ వివాదాలు తలెత్తుతున్నాయని బాయ్ కాట్ వివాస్పద వ్యాఖ్యలు చేశారు. సౌతాఫ్రికా కెప్టెన్ హాన్సీ క్రానే సంగతి బాయ్ కాట్ మర్చిపోయినట్లున్నాడు. ప్రధాన ఆటగాళ్లకు, జూనియర్ ఆటగాళ్లకు మధ్య ఆదాయంలో తీవ్ర అంతరం ఉండడం కూడా ఫిక్సింగ్ కు దారి తీస్తోందని ఆయన ఎత్తి చూపాడు. సీనియర్, జూనియర్ ఆటగాళ్లకు మధ్య ఉన్న ఆదాయాల తేడా ముఖ్యంగా ఎండార్స్ మెంట్ల వల్ల ఏర్పడుతున్నదే. అయితే ఆదాయాల అంతరాలను తగ్గించాలన్న సూచన అనుసరణీయమే కావచ్చు.

ఐ.పి.ఎల్ ఆటగా కంటే ఎంటర్ టైన్ మెంట్ గానే ప్రధానంగా సాగుతోంది. ఎంటర్ టైన్ మెంట్ పరిశ్రమలో వెల్లువగా ప్రవహించే డబ్బు రాశులు సహజంగానే అవినీతిని ప్రేరేపిస్తాయి. డబ్బు రాసుల్లో ఎక్కువ వాటా రాబట్టుకోవడానికి ఎవరికి వారు ప్రయత్నిస్తూ కొత్త కొత్త అవినీతి మార్గాలను కనిపెడుతుంటారు. డబ్బు ఉన్న చోట మాఫియాలు ఎలాగూ ప్రవేశిస్తాయి. ఆ మాఫియాలు నడిపేది రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్ అధికారులే. అంటే ఐ.పి.ఎల్ అవినీతి గురించి మాట్లాడడం అంటే గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకోవడమే.

వ్యాఖ్యానించండి