ఐ.పి.ఎల్ మాయల బూరోడు -కార్టూన్


The Hindu

The Hindu

పైడ్ పైపర్ అనేది జర్మనీలో బహుళ ప్రచారంలో ఉన్న ఒక కధ. ఓ చిన్న నగరానికి ఎలుకలు పెద్ద బెడదగా ఉండేవిట. వాటిని వదిలించుకోడానికి నగర జనం, అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు. ఒకసారి బూర (పైపర్) ఊదుకుంటూ రంగు రంగుల దుస్తులు ధరించిన ఒక వ్యక్తి ఆ నగరానికి వచ్చాడు. ఎలుకలను తాను తరిమేస్తానని, అందుకు తనకు తగిన ఫలితం ఇవ్వాలని కోరాడాయన. ప్రజలు, మేయర్ చర్చించుకుని పెద్ద మొత్తం ఇవ్వడానికి సరేనన్నారు. పైడ్ పైపర్ గాన బూరతో ఎలుకలను ఆకర్షించి తన వెంట కొనిపోయి నేరుగా వాటిని నదిలో దూకించాడట.

అయితే ఎలుకల బెడద వదిలాక మేయర్, జనం మాట తప్పారు. పైపర్ కి ఇస్తానన్నది ఇవ్వకుండా కొద్దిగా ఇచ్చి ఊరుకున్నారు. పైపర్ కి కోపం వచ్చి మళ్ళీ వస్తానని హెచ్చరించి వెళ్ళాడు. ఓ సారి జనం అంతా చర్చిలో ఉన్నపుడు పైపర్ మళ్ళీ ఆ ఊరికి వచ్చాడు. ఇళ్ల వద్ద ఉన్న పిల్లలపైన తన బూర మాయాజాల విద్యని ప్రయోగించాడు. బూరతో ఆకర్షించి పిల్లల్ని తన వెంట తోడ్కొని పోయాడు. అలా వెళ్ళిన పిల్లలు నగరానికి మళ్ళీ తెరిగి రాలేదు. వారిని కూడా నదిలో కలిపేశాడని కొందరు, ఒక గుహలో బంధించి అనేక రెట్లు దబ్బిచ్చాక పిల్లల్ని అప్పగించాడని మరి కొందరు వివిధ రీతుల్లో ఈ కధకి ముగింపు ఇస్తారు.

ఈ పైడ్ పైపర్ తో ఐ.పి.ఎల్ క్రికెట్ ను కార్టూనిస్టు పోల్చారు. ఐ.పి.ఎల్ మాయాజాలంలో పడిన భారత జనం దాని వెనుక అండర్ గ్రౌండ్ లో చీకటి తెరల మాటున జరుగుతున్న డబ్బు సంచుల మార్పిడిని పట్టించుకోలేదు. ఎంత దూరం సిక్స్ కొట్టాడు, ఎంత ఎత్తున బంతిని పైకి లేపాడు, ఎన్ని తక్కువ పరుగులిచ్చి ఎన్ని ఎక్కువ వికెట్లు తీశాడు, టోర్నమెంటులో సిక్సర్లెన్ని, అవెన్ని, ఇవెన్ని…. ఇలా అంకెల రికార్డుల లెక్కలను తలచుకుని ‘అబ్బో, అబ్బబ్బో, ఓయబ్బో’ అనుకుంటూ ఐ.పి.ఎల్ పైడ్ పైపర్ మాయలో పడిపోయారు జనమంతా.

రెగ్యులర్ గా ఎవరో ఒకరో ఇద్దరో సినీతారలు స్టేడియంలకు రప్పించడం దగ్గర్నుండి సినిమా తారలే ఫ్రాంచైజీల యాజమాన్యంలో భాగస్వామ్యం వహించడం వరకు ఐ.పి.ఎల్ పైపర్ కి ఉన్న గ్లామర్ అంతా ఇంతా కాదు. చివరికి సుప్రీం కోర్టు జడ్జిలు కూడా ‘మేమూ క్రికెట్ చూస్తాం’ అని స్పాట్ ఫిక్సింగ్ సందర్భంగా ఐ.పి.ఎల్ ని రద్దు చేయాలన్న పిటిషన్ ని విచారిస్తూ వ్యాఖ్యానిస్తున్న పరిస్ధితి. వివిధ ఫ్రాంచైజీల జెర్సీల తరహాలో దుస్తులు ధరించి స్టేడియం లకి వెళ్ళి కూర్చోవడం, పసి పిల్లలతో సహా వచ్చి గంటల తరబడి గ్యాలరీల్లో తిష్ట వేయడం, ఫ్రాంచైజీల పైన అభిమానంతో ప్రత్యర్ధి ఫ్రాంచైజీలలోని జాతీయ జట్టు ఆటగాళ్లను సైతం ఎద్దేవా చేయడం, ఐ.పి.ఎల్ మ్యాచుల వివరాలతో రంగు రంగుల పేజీలతో, బొమ్మలతో, కధలతో వార్తలు అందించే వార్తా పత్రికలు, క్రమం తప్పకుండా ఐ.పి.ఎల్ స్కోర్ల వివరాలను క్షణ క్షణం అందించే వార్తా సంస్ధల వెబ్ సైట్లు…. ఇలా ఎన్నో చిత్ర విచిత్రాలను ఐ.పి.ఎల్ పైడ్ పైపర్ మాయగాడు ప్రదర్శిస్తూ జనాన్ని ఒక సమ్మోహనంలో పడేశాడు.

శ్రీశాంత్ పుణ్యమాని పైపర్ మాయనుండి తెప్పరిల్లి బైటపడే అవకాశం వచ్చింది. గత సంవత్సరం ఐదుగురు ఆటగాళ్లు ఫిక్సింగ్ లో దొరికిపోయినా రాని కదలిక ఈసారి శ్రీశాంత్ వల్ల వచ్చిపడింది. ముగ్గురి వరకే పరిమితం అనుకున్న ఐ.పి.ఎల్ ఫిక్సింగ్, బెట్టింగ్ కార్యకలాపాలు తవ్వి తీస్తున్నకొద్దీ బైట పడుతున్న కంకాళాలకు మల్లే ఒక్కో పెద్ద తలకాయ బయిటకు వస్తోంది. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అనేకమంది ఈ ఫిక్సింగ్, బెట్టింగ్ క్రీడల్లో మునిగితేలినట్లు బుకీల సాక్ష్యాలను బట్టి తెలుస్తోంది. ఇటీవలే చనిపోయిన రెజ్లర్, నటుడు దారాసింగ్ కొడుకు విందూ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ మీయప్పన్ (బి.సి.సి.ఐ సెక్రటరీ శ్రీనివాసన్ అల్లుడు) కూడా బెట్టింగుల్లో పాలు పంచుకున్నాడని బైటికి వచ్చింది.

ఫ్రాంచైజీల ఓనర్లే బెట్టింగుల్లో ఉన్నట్లయితే వారు మ్యాచ్ లను ఫిక్సింగ్ చేయకుండా ఉంటారా? ఈ బ్లాగ్ లోనే ప్రచురించబడిన గత కధనంలో అనుమానించిందే నిజం అవుతోందా? వేల కోట్ల రూపాయలను వరదలా పారిస్తున్న క్రికెట్ బెల్లం చుట్టూ రాజకీయ నాయకులు ఈగల్లా ముసిరిన తీరును బట్టి క్రికెట్ ఫిక్సింగ్, బెట్టింగ్ లలో రాజకీయ నాయకులు ఉన్నా ఆశ్చర్యం లేదు.

ఈనాడు పత్రిక చెప్పినట్లు ‘మనం చూసేదంతా నిజం ఆట కాకపోవచ్చు. చూస్తున్న ఆట అంత క్రితమే పబ్బుల్లోనో, మాఫియాల బోర్డు రూముల్లోనో ఆడిన ఆట అయి ఉండాలి. మనం చూసిన ఆట వేరు.. వాళ్ళాడిన ఆట వేరు. చూసిందంతా నిజం కాదు… ఆడిందతా నిజం కాదు. ఆదంతా కాసులు వేటలో ఆడిన ఆట.’

మీయప్పన్ ద్వారా శ్రీనివాసన్ పాత్ర కూడా బైటికి వస్తుందేమో చూడాలి. శ్రీనివాసన్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ పాత్ర అంటూ కధనాలు వస్తాయో ఏమో. ఇది కాస్తా వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లకు చుట్టుకోదు కదా? ఏమో చెప్పలేం. ఏదైనా సాధ్యమై. డబ్బు జబ్బు కదా!

వ్యాఖ్యానించండి