నరేంద్ర మోడిని బి.జె.పి కేంద్ర పార్లమెంటరీ బోర్డులోకి తీసుకుని రెండు నెలలు కూడా కాలేదు. ఆయనని బోర్డు సభ్యుడుగా తీసుకున్న తర్వాత జరిగిన మొదటి సమావేశంలోనే ఇతర సభ్యులను డామినేట్ చేశారు. మీడియాని ఎలా ఆకర్షించాలో మోడీకి కరతలామలకమే. పార్లమెంటరీ బోర్డు సమావేశాలపై కేంద్రీకరించడం మాని విలేఖరులు మోడి చుట్టూ తిరగడం, ఆయన వెంట పరుగులు పెట్టడం చేశారు. బోర్డు సమావేశానికి ముందు ఢిల్లీలోని బి.జె.పి నాయకులను ఒక్కొక్కరినీ స్వయంగా వ్యక్తిగతంగా కలుసుకోవడం ద్వారా మోడి ఈ ఫీట్ సాధించారు.
బి.జె.పి పార్లమెంటరీ బోర్డు మంగళవారం ఢిల్లీలో సమావేశం అయింది. ఈ సంవత్సరాంతంలో జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలు 2014 పార్లమెంటు ఎన్నికల ఏర్పాట్ల గురించి చర్చించడానికి బోర్డు సమావేశం అయినట్లు తెలుస్తోంది. చర్చాంశాల ప్రకారం చూసినా పత్రికల కేంద్రీకరణ సమావేశాలపై ఉండాలి. కానీ అంతకంటే మిన్నగా మోడి ఢిల్లీలో ఎవరెవరిని కాలుస్తున్నదీ, ఎంతసేపు మాట్లాడుతున్నదీ తదితర విషయాలపై విలేఖరులు దృష్టి సారించారని పత్రికలే చెబుతున్నాయి. ప్రధాని పదవి పోటీదారు అద్వానీని కూడా మోడి కలవడం విశేషం.
జాతీయ స్ధాయిలో ప్రధాన పాత్ర పోషించడానికి ఉద్యుక్తుడవుతున్న మోడి అందుకు తగిన ఏర్పాట్లను పార్టీలో చేసుకుంటూ వస్తున్నారు. గుజరాత్ లో తన ప్రత్యర్ధి అయిన సంజయ్ జోషి ని బోర్డు నుంచి తప్పించిన మోడి ఇటీవల ఉత్తర ప్రదేశ్ పార్టీ ఇన్-చార్జి గా తన నమ్మినబంటు, సోరాబుద్దీన్ బూటకపు ఎన్ కౌంటర్ కేసులో నిందితుడు అయిన అమిత్ షాను నియమింపజేసుకున్నారు. ఇప్పటికే పార్టీలో అనేకమంది నాయకులు మోడి ప్రధాని అభ్యర్ధిత్వానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ మద్దతు చెప్పారు.
పార్టీ అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్, అగ్ర నాయకులు లాల్ కృష్ణ అద్వానీ లను పార్లమెంటరీ బోర్డు అనే షోకేసులో బొమ్మల్లా మార్చేసి మోడి తాను మాత్రం ఢిల్లీ అంత కలియ తిరగడాన్ని కార్టూనిస్టు ఇలా చిత్రించారు.