మధ్య ఆసియాలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే సంవత్సరం జులై నెల లోపుగా అమెరికా తన సైనిక స్ధావరాన్ని మూసేయాలని కిర్ఘిస్తాన్ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వబోతోంది. ఈ మేరకు పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెడుతున్నామని ఆ దేశ ప్రభుత్వ కేబినెట్ తెలిపింది. ఈ పరిణామంతో మధ్య ఆసియాలో ప్రభావం కోసం అమెరికా, రష్యాల మధ్య జరుగుతున్న పోటీలో రష్యా మరొకసారి పైచేయి సాధించినట్లే. కొద్ది సంవత్సరాల క్రితం అమెరికా మద్దతుతో తనతో యుద్ధానికి తలపడిన జార్జియాను మట్టికరిపించి పై చేయి సాధించిన రష్యాకు తాజా పరిణామం మరొక విజయం.
ఆఫ్ఘనిస్తాన్ ప్రజలపై అమెరికా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధానికి కిర్ఘిస్తాన్ సైనిక స్ధావరం కీలకమైన సరఫరా కేంద్రం. కిర్ఘిస్తాన్ నుండి సైనిక స్ధావరం ఖాళీ చేయవలసి వస్తే ఆఫ్ఘనిస్ధాన్ లో దశాబ్దాల పాటు కొనసాగానున్న అమెరికా సైనిక స్ధావరాలకు చేయవలసిన సైనిక, ఆయుధ, ఆహార సరఫరాలకు అంతరాయం ఏర్పడుతుంది.
కిర్ఘిస్తాన్ లోని ప్రధాన పౌర విమానయాన కేంద్రం ఉన్న మనాస్ ఎయిర్ పోర్ట్ వద్దనే అమెరికా సైనిక స్ధావరం ఉన్నది. ఈ స్ధావరం కేంద్రంగా కిర్ఘిస్తాన్ లో సంవత్సరాలుగా రాజకీయాలు నడుస్తున్నాయి. దీనిని కొనసాగించేలా చేయడానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఒక వారం రోజుల క్రితమే కిర్ఘిస్తాన్ లోని అమెరికా రాయబారి పమేలా స్ప్రాట్లెన్ ఈ స్ధావరం తమకు కీలకమని, దానిని భవిష్యత్తులో మరిన్ని సంవత్సరాలు కొనసాగించడానికి చర్చలు జరుపుతున్నామని ప్రకటించింది. ఈ నేపధ్యంలో కిర్ఘిస్తాన్ కేబినెట్ ప్రకటన అమెరికాకు శరాఘాతం.
కిర్ఘిస్తాన్ లోని తమ సైనిక స్ధావరం ప్రాంతీయ స్ధిరత్వానికి దోహదం చేస్తుందని అమెరికా గొప్పలు పోయింది. అయితే దీనిని ఎత్తివేయించడానికి రష్యా కొద్ది సంవత్సరాలుగా ప్రయత్నాలు పెంచింది. రష్యాకు కూడా కిర్ఘిస్తాన్ లో ఇక ఎయిర్ బేస్ ఉన్నది. దీని గడువు 2032 వరకు ఉండడం గమనార్హం. అమెరికా స్ధావరం ఎత్తివేస్తే 2 బిలియన్ డాలర్లు రుణం మంజూరు చేస్తానని రష్యా ఆశ చూపింది. దానితో స్ధావరం ఎత్తివేతకు కిర్ఘిస్ధాన్ సిద్ధపడింది. అయితే లీజ్ మొత్తాన్ని మూడు రేట్లు పెంచడం ద్వారా అమెరికా తాత్కాలికంగా కిర్ఘిస్తాన్ నిర్ణయాన్ని ఆపగలిగింది. లీజ్ ఒప్పందం ప్రకారం స్ధావరం ఖాళీ చేయాలంటే మూడు నెలల ముందు నోటీసు ఇవ్వాలని తెలుస్తోంది.
కిర్ఘిస్తాన్ రాజధాని బిష్కెక్ లోని మనాస్ విమాన స్ధావరంలో నిరంతరం 1500 మంది అమెరికా సైనికులు ఉంటారు. ఆఫ్ఘన్ యుద్ధం కోసం ఈ స్ధావరం 24 గంటలు పని చేస్తుంటుంది. వేలాది సైనికులను అమెరికా నుండి మనాస్ కు మనాస్ నుండి ఆఫ్ఘన్ కు తరలించేందుకు ఇది మధ్యంతర స్ధావరం. ప్రతి నెలా కొన్ని వందల టన్నుల సరుకులు ఆఫ్ఘన్ కు ఇక్కడి నుండి సరఫరా అవుతాయి. ఇది ఖాళీ చేస్తే అమెరికా మరో స్ధావరం, సరఫరా మార్గం వెతుక్కోవాల్సి ఉంటుంది.
కిర్ఘిస్ధాన్ మాజీ అధ్యక్షుడు బకీయేవ్ మనాస్ స్ధావరాన్ని మూసివేస్తానని రష్యాకు హామీ ఇచ్చాడు. 2 బిలియన్ డాలర్ల రుణం ఇస్తానన్న రష్యా మాట మేరకు ఈ హామీ యిచ్చాడు. కిర్ఘిజ్ పార్లమెంటు ఆ మేరకు చట్టాన్ని ఆమోదించింది. బకీయేవ్ సంతకం కూడా అయింది. కానీ అమెరికా, లీజు మొత్తాన్ని మూడు రెట్లు పెంచడంతో రష్యాకు ఇచ్చిన హామీ నుండి వెనక్కి తగ్గాడు. దానితో 2010లో ఆయన పదవీచ్యుతుడయ్యాడు.
2011లో అధ్యక్ష పదవిని అధిష్టించిన అల్మజ్ బెక్ అతాంబయెవ్ ప్రజలకు ఇచ్చిన హామీల్లో మనాస్ స్ధావరాన్ని మూసివేయడం ఒకటి. అమెరికా స్ధావరాన్ని మూసేసి ఐరోపా, ఆసియాల మధ్య రవాణా కూడలిగా మారుస్తానని ఆయన హామీ ఇచ్చాడు. సదరు హామీ కార్యరూపం దాల్చడానికి ఇప్పుడు మొదటి అడుగు పడింది. తమ స్ధావరం కొనసాగింపుకు రానున్న రోజుల్లో అమెరికా మరింత కృషి చేయక మానదు. అమెరికా తదుపరి ఎత్తుగడ ఏమిటన్నది పరిశీలనార్హం.