కర్ణాటకలో పదవుల కొట్లాట -కార్టూన్


The Hindu

The Hindu

నా తక్షణ కర్తవ్యం, మంత్రులు కానివారిని అదుపులో పెట్టడం…

మెట్టు తర్వాత మెట్టు ఎక్కడం రాజకీయ నాయకుల వంతయితే, పెనం మీద నుండి పొయ్యిలోకి నిరంతరాయంగా జారుతుండడం ప్రజల వంతు. తమ మధ్య వైరుధ్యాల పరిష్కారం కోసం ఎన్నికల రూపంలో ప్రజల వద్దకు వచ్చే రాజకీయ నాయకులు, పార్టీలు, ఆ కాస్త ఎన్నికల యజ్ఞం అయ్యాక పదవుల పండేరంలో మునిగి తేలడం రివాజు. కర్ణాటకలో ఇపుడు జరుగుతోంది అదే.

అక్రమ మైనింగ్ కేసులు నడుస్తున్నందుకు శివకుమార్, అనీల్ లాడ్ అనే ఇద్దరు ప్రధాన నాయకులను ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య పక్కన పెట్టవలసి వచ్చింది. గాలి జనార్ధన రెడ్డి అక్రమ మైనింగ్ బి.జె.పి ప్రభుత్వానికి ఎసరు తెచ్చినందున, ప్రజల్లో అవినీతి వ్యతిరేకత అంతో ఇంతో ఉన్నందున సిద్ధరామయ్య ఇలా చేయక తప్పలేదు.

కానీ శివకుమార్, అనిల్ లాడ్ లు ఊరుకోవడం లేదు. శివకుమార్ అనుచరులు వివిధ చోట్ల నిరసన ప్రదర్శనలు చేస్తుంటే అనిల్ లాడ్ అసలు అసెంబ్లీకి రాజీనామా చేస్తానని బెదిరిస్తున్నాడు. అత్తెసరు మెజారిటీతో ముఖ్యమంత్రిత్వం చేపట్టిన సిద్ధరామయ్య పైన ఇలాంటి బెదిరింపులు పని చేస్తాయని అనీల్ లాడ్ నమ్మకం కావచ్చు.

రాజ్యాంగం కల్పించిన అవకాశం ప్రకారం కర్ణాటకలో ముఖ్యమంత్రితో కలిపి 34 మంది మంత్రులు ఉండవచ్చు. కానీ శనివారం సిద్ధరామయ్య పదవులిచ్చింది 28 మందికే. అంటే ఇంకా 5 మంత్రి పదవులు ఖాళీ. ఖాళీ పదవులని ఆశ చూపి ఎమ్మెల్యేలని కట్టిపడేయడం మన రాజకీయ పార్టీలకు అలవాటే కదా. కాంగ్రెస్ పార్టీకి అయితే అటువంటి ఎత్తుగడలు వెన్నతో పెట్టిన విద్య.

వ్యాఖ్యానించండి